9 గంటలపాటు సోదాలు | Police Arrest Virasam Leader Varavararao | Sakshi
Sakshi News home page

9 గంటలపాటు సోదాలు

Published Wed, Aug 29 2018 2:02 AM | Last Updated on Wed, Aug 29 2018 1:14 PM

Police Arrest Virasam Leader Varavararao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారంటూ జూన్‌ 18న నమోదైన కేసులో ప్రమేయంపై పుణే పోలీసులు విరసం నేత వరవరరావును మంగళవారం ప్రశ్నించి ఆపై అరెస్టు చేశారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి ఉదయమే వచ్చిన పోలీసులు దాదాపు 9 గంటలపాటు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పుణే విశ్రంబాగ్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దీపక్‌ నికమ్‌ నేతృత్వంలో 25 మంది పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వరవరరావు నివాసంతోపాటు విరసం కార్యవర్గ సభ్యులు టేకుల పురుషోత్తం అలియాస్‌ క్రాంతి (జర్నలిస్టు), సత్యనారాయణ (ఇఫ్లూ ప్రొఫెసర్‌), కూర్మనాథ్‌ (జర్నలిస్టు) ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వరవరరావును ఓ పోలీసు బృందం ప్రశ్నించింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి అరెస్టయిన మావోయిస్టు సానుభూతిపరుడు, ఢిల్లీవాసి రోనా విల్సన్‌తో ఉన్న సంబంధం, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయడంలో వరవరరావు పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది.

అనంతరం మధ్యాహ్నం 2: 30 గంటల సమయంలో వరవరరావును అరెస్ట్‌ చేసిన పుణే పోలీసులు... స్థానిక పోలీసుల సహకారంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో పౌరహక్కుల సంఘాల నేతలు, కార్యకర్తలు ఇతర ప్రజాసంఘాల నాయకులు పుణే పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3: 30 గంటల ప్రాంతంలో పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వరవరరావుకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ప్రిజన్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై ఆయన్ను పుణే తరలించేందుకు అనుమతించాలని కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా పుణే కోర్టులో వరవరరావును ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ఆయన్ను హుటాహుటిన పుణే తరలించారు. మరోవైపు మిగిలిన విరసం కార్యవర్గ సభ్యుల ఇళ్లలో సోదాలను సాయంత్రం 4 గంటలకల్లా పూర్తిచేసిన ఇతర పోలీసు బృందాలు...వారి వద్ద నుంచి 600 విప్లవ సాహిత్య పుస్తకాలు, 16 పెన్‌ డ్రైవ్‌లు, 8 ఆడియో టేపులు, రెండు హార్డ్‌డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, ఫేస్‌బుక్, జీ–మెయిల్‌ ఖాతాల వివరాలు, మరాఠీ భాషలో ఉన్న మావోయిస్టు పార్టీకి చెందిన రెండు లేఖలు, ప్లీనరీలో మావోయిస్టు పార్టీ చేసిన తీర్మానాల కాపీలను స్వాధీనం చేసుకున్నాయి.

వరవరరావుపై యూఏపీఏ చట్టం ప్రయోగం..
వరవరరావుపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 13, 16, 17, 18 (బి), 20, 38, 39, 40తోపాటు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 153 (ఏ), 505 (1), 117, 120 (బి), 34 కింద పుణేలోని విశ్వరాంబాగ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిషేధిత సంస్థలైన మావోయిస్టు పార్టీ, ఉగ్రవాద, ఇతర సంస్థలకు అనుబంధంగా పనిచేయడంతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ చట్టం కింద ఆరోపణలు రుజువైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది.

కోరెగావ్‌–భీమా హింసాకాండ నుంచి...
పుణే జిల్లాలోని కోరెగావ్‌–భీమా ప్రాంతంలో దళితులతో కూడిన బ్రిటిష్‌ సేనలు, పెష్వా పాలకుల మధ్య 1818లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్‌ సేనలు గెలిచాయి. ఈ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది డిసెంబర్‌ 31న ఎల్గార్‌ పరిషత్‌ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భారీ హింసాకాండ చెలరేగింది. ముంబైకి చెందిన సుధీర్‌ దావ్‌లే, నాగ్‌పూర్‌కు చెందిన అడ్వొకేట్‌ సురేంద్ర గాడ్లింగ్, మహేష్‌ రౌత్, సోమాసేన్, ఢిల్లీకి చెందిన రోనా విల్సన్‌ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే హింసాకాండ జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌ 18న రోనా విల్సన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా కీలక లేఖ లభించింది.

ప్రొఫెసర్‌ సాయిబాబా కేసు వాదిస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన అడ్వొకేట్‌ సురేంద్ర గాడ్లింగ్‌ ఆ లేఖను రోనా విల్సన్‌కు రాశాడు. ఇందులో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతంలాగే ప్రధాని మోదీని కూడా చంపాలని, ఇందుకు రూ. 8 కోట్లు అవసరముంటుందని లేఖలో పేర్కొన్నాడు. అమెరికా సైన్యం ఉపయోగించే ఏ–4 రైఫిల్‌ను కొనాల్సి ఉంటుందని రాశారు. ఇందుకోసం అవసరమయ్యే ఆర్థిక సహాయ సహకారాల్లో కొంత మేర వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖలో గాడ్లింగ్‌ పేర్కొన్నట్లు పుణే పోలీసులు ఆరోపించారు. ఇందులో భాగంగానే అక్కడి పోలీసులు హైదరాబాద్‌ వచ్చి విరసం కార్యవర్గ సభ్యుల ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

కేసులో నా పేరు అవాస్తవం: వరవరరావు
ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసులో తన పేరు రావడం ముమ్మాటికి అవాస్తవమని వరవరరావు స్పష్టం చేశారు. పౌరహక్కుల గొంతు నొక్కేందుకు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులకు పాల్పడ్డారంటూ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై న్యాయపరంగా పోరాడతానని, కేసుతో తనకెలాంటి సంబంధంలేదని వెల్లడించారు.

ఎలాంటి నోటీసు ఇవ్వలేదు: వరవరరావు భార్య హేమలత
వరవరరావును అరెస్ట్‌ చేసి తీసుకెళ్లిన అనంతరం ఆయన భార్య హేమలత మీడియాతో మాట్లాడారు. ఉదయం 20 మంది పోలీసులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, వారెంట్‌ చూపాలని అడగ్గా అవసరంలేదంటూ లోపలకు ప్రవేశించారన్నారు. గతంలో ఎన్నోసార్లు పోలీసులు వచ్చినా హాల్లోనే మాట్లాడి వెళ్లేవారని, అరెస్ట్‌ అవసరమైతే ఆయనే వెళ్లేవారన్నారు. కానీ పుణే పోలీసులు ఇంట్లోని ప్రతి గదిలో సోదాలు చేశారని, సోదాల సమయంలో వీడియో సైతం తీశారని ఆమె తెలిపారు. స్వాధీ నం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి ఓ నోట్‌ ఇచ్చారని ఆమె వివరించారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర అంటూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

వరవరరావు
1957 నుంచి కవిత్వం రాస్తోన్న వరవరరావు.. విరసం(విప్లవ రచయితల సంఘం) వ్యవస్థాపక సభ్యుడు. 1973లో మీసా(అంతర్గత భద్రతా నిర్వహణ) చట్టం కింద అరెస్టయ్యారు. 1975–86 మధ్యకాలంలో పలుసార్లు అరెస్టై అనంతరం విడుదలయ్యారు. 1986 నాటి రాంనగర్‌ కుట్ర కేసు నుంచి 2003లో విముక్తి పొందారు. ఏపీ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద 2005లో మరోసారి జైలుకెళ్లారు. 2006లో ఆ కేసును కొట్టివేయగా.. ఇతర కేసుల్లో ఆయన బెయిల్‌పై ఉన్నారు.

సుధా భరద్వాజ్‌
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో హక్కుల కార్యకర్తగా సుధా భరద్వాజ్‌కు ఎంతో పేరుంది. భిలాయ్‌లో గని కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. పౌరహక్కుల కార్యకర్తగానే కాకుండా న్యాయవాదిగా భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఐఐటీ కాన్పూరులో చదువుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కార్మికుల వెతల్ని చూసి ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చాలో సభ్యురాలిగా చేరారు.  
 
ఫెరీరా
ముంబైకి చెందిన ఫెరీరా.. 2007లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(మావోయిస్టు)కి ప్రచార, సమాచార విభాగం నాయ కుడిగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. దాదాపు ఐదేళ్లు జైళ్లో ఉన్న ఆయన అక్కడి అనుభవాలపై ‘కలర్స్‌ ఆఫ్‌ ద కేజ్‌’అనే పుస్తకాన్ని రాశారు. 2014లో తనపై ఉన్న అన్ని కేసుల నుంచి విముక్తి పొందారు.  

 గొంజాల్వెజ్
ముంబై యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్న గొంజాల్వెజ్‌.. కొన్నాళ్లు లెక్చరర్‌గా పనిచేశారు. అయితే మహారాష్ట్ర రాజ్య కమిటీ ఆఫ్‌ నక్సలైట్స్‌కు మాజీ కార్యదర్శిగా, సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారనేది పోలీసుల ఆరోపణ. 20 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న గొంజాల్వెజ్‌ ఆరేళ్ల జైలు శిక్ష అనంతరం సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుల నుంచి బయటపడ్డారు.

గౌతం నవలఖా  
ఢిల్లీకి చెందిన ఈ జర్నలిస్టు ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌కు’అనుబంధంగా పనిచేశారు. వారాంతపు పత్రికలకు ఎడిటోరియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. తరచూ కశ్మీర్‌ లోయలో పర్యటించే నవలఖా.. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పలు వ్యాసాలు రాశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967ను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement