ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై అక్రమార్జన ఆరోపణలు సంచలనంగా మారాయి. షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ స్పందించారు. తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు.
బంగ్లాదేశ్(Bangladesh) షేక్ హసీనాపై వచ్చిన అక్రమార్జనల ఆరోపణలు తాజాగా సాజీబ్ వాజెద్ స్పందించారు. ఈ క్రమంలో వాజెద్(Sajeeb Wazed) మాట్లాడుతూ..‘అంత డబ్బు మేము ఎన్నడూ చూడలేదు. రూప్పూర్ పవర్‌ప్లాంట్ ప్రాజెక్టులో షేక్ హసీనా 5 బిలియన్ డాలర్లు దోచుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బోగస్ ఆరోపణలు చేస్తూ మా కుటుంబం బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో మా కుటుంబం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లపై డబ్బు తీసుకోలేదు. 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో అంత మొత్తం తీసుకోవడం సాధ్యం కాదు. గత 30 ఏళ్లుగా నేను యూఎస్‌లో ఉన్నా.. మా ఆంటీ, ఇతర సోదరులు యూకేలో ఉంటున్నారు. అంత డబ్బు మా అకౌంట్లలో ఎన్నడూ చూడలేదు అంటూ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. షేక్ హసీనాపై అక్రమార్జన ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.
అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment