మాజీ ప్రధానిని ప్రభుత్వం చంపజూస్తోందన్న బంగ్లా విపక్షం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment