
సింధు జలాల ఒప్పందంపై భారత్ చర్యకు పాక్ ప్రతిచర్య?
అప్పుడిక తృతీయ పక్ష జోక్యానికి ఛాన్స్
ఒప్పందంపై 1972లో ఇందిర, భుట్టో సంతకాలు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది.
1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది.
1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.
:::జమ్ముల శ్రీకాంత్
ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?