
ఇస్తాంబుల్: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల సమయంలో భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు సంస్థ పేర్కొంది.
భూకంప కేంద్రం.. ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, 2023 ఫిబ్రవరి 6న ఆ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారుగా 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువక ముందే తాజాగా మళ్లీ భూ ప్రకంపనలతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.