ఇస్తాంబుల్: గత సోమవారం సంభవించిన భారీ భూకంపంతో కకావికలమైన టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
దక్షిణ టర్కీ నగరం కహ్రమన్మరాస్ సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోయినట్లు గానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
34వేలకు పెరిగిన మృతులు..
తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 34వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. వేల మంది గాయపడినట్లు చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు టర్కీ హతాయ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న రన్‌వేను రిపేర్ చేసినట్లు చెప్పారు.
దొంగతనాలు..
భూకంపం కారణంగా సర్వస్వం కోల్పోయి వేల మంది ప్రజలు నిరాశ్రయులైతే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులు, నగలు, డబ్బులు దోచుకెళ్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నందున దొంగలపై కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ హెచ్చరించారు. సాధారణంగా వాళ్లకు ఒక్కరోజు ఉండె జైలు నిర్భంధం ఇప్పుడు నాలుగు రోజులకు పెరిగినట్లు గుర్తు చేశారు. లూటీలకు పాల్పడిన 57 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా..వారంలో నాలుగోది!
Comments
Please login to add a commentAdd a comment