తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా పసికందుగా ఉన్న మహేంద్రుడిని నీట మునగకుండా ఒక చేత్తో పైకెత్తి ముందుకెళ్తుంది రాజమాత శివగామి బాహుబలి(Bahubali)లో. కానీ, ఇక్కడో తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఊపిరి కోసం.. ఏ తల్లి చేయని సాహసం చేసి చరిత్రకెక్కింది. అయితే ఆ సాహసమే ఆరేళ్ల తర్వాత.. అదే తల్లిని మళ్లీ వార్తల్లో నిలబెట్టింది.
జే35 అనే ఓర్కా తిమింగలం.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 23వ తేదీన అది ఓ బిడ్డకు జన్మనిచ్చిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ అనే ఫేస్‌బుక్ పేజీ ప్రకటించింది. ఆ ఆడ ఓర్కా(Orca) పిల్లకు జే61గా నామకరణం చేశారు. సియాటెల్ నగరపు తీరాన ఉన్న రీసెర్చ్ సెంటర్ వద్దకు చేరుకుంటున్న అంతర్జాతీయ మీడియా సంస్థల ఫొటోగ్రాఫర్లు ఆ తల్లీబిడ్డలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇందులో అంత చెప్పుకోదగిన విషయం ఏముందని అంటారా?..
ఆరేళ్ల కిందట.. బ్రిటీష్ కొలంబియా విక్టోరియాలోని తీర ప్రాంతానికి ఓ ఓర్కా తిమింగలం ఈదుకుంటూ వచ్చింది. అయితే దాని వీపు మీద ఓ పిల్ల ఓర్కాను మోసుకుంటూ వచ్చిందది. ఆ ప్రయాణం వెనుక ఎంతో వ్యధ ఉందని తర్వాతే తేలింది. పుట్టిన గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. మళ్లీ ఊపిరి తీసుకుంటుందన్న ఆశతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం(Swim) ప్రారంభించింది. అలా గంటలు గడిచాయి.. రోజులు దొర్లిపోయాయి.
తలపై 400 పౌండ్ల(181 కేజీల) బరువుతో.. ఏకంగా 17 రోజులపాటు ఏకధాటిగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించిందది!. చివరకు.. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద ప్రముఖ వేల్ రీసెర్చర్ కెన్ బాల్‌కోమ్ ఆ అమ్మ ప్రేమను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే అయినా.. జే35 ప్రేమ మాత్రం అసాధారణమని కొనియాడారు. అలా ఆ దృశ్యాలు.. చూపరుల గుండెను బరువెక్కించాయి.
చరిత్రకెక్కిన ఆ తల్లి ఓర్కానే ఈ జే35. సాధారణంగా.. ఓర్కాలు కిల్లర్ వేల్(Killer Whale)లు. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దవి. అయితే వాటి మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. గుంపుగా బతికే సమూహంలో.. ఏడాది వయసున్న పిల్లలను రక్షించుకోవడానికి అవి సాహసాలే చేస్తుంటాయి. ఆ గండం దాటితే అవి బతికి బట్టకట్టినట్లే!. అయితే..
జే35 ఓర్కాకు జే61ను ఏడాదిపాటు కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి మనుసు గతంలోనే ఓసారి గాయపడింది. అయినప్పటికీ ఈ ఆరేళ్ల గ్యాప్‌లో జే47, జే57 అనే రెండు ఓర్కాలకు అది జన్మనివ్వగా.. అవి సజీవంగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇరాన్‌లో తొలిసారి మహిళలతో..
Comments
Please login to add a commentAdd a comment