heart touching story
-
కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్ లాలాలజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.నరకం నుంచి రెండు నెలలకు.. కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు వైద్యులు. కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట. -
కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. ముంబైకి చెందిన అమిషా జితేష్ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్డ్ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు. అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా.. వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్ మోటా. జితేష్ తల్లి.. అమిషా అత్త. కానీ.. ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్ అవుతుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు. కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ జతిన్ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది. సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు. -
బాకీ పడ్డ కథలు
మహా కథకుడు ప్రేమ్‌చంద్ రాసిన ‘సావాసేర్ ఘెవ్’ అనే కథ ఉంటుంది. అందులో దయాళువు అయిన ఒక రైతు ఆ రాత్రి తన ఇంట బస చేసిన సాధువుకు జొన్నరొట్టెలు పెట్టలేక షావుకారు దగ్గర ‘సేరుంబావు’ గోధుములు అప్పు తెచ్చి, ఆతిథ్యం ఇచ్చి, ఆ సంగతి మర్చిపోతాడు. సేరుంబావు గోధుములు! ఏం పెద్ద భాగ్యమని. ఆ తర్వాత ఆ రైతు ఎన్నోసార్లు గోధుమ పండించి ఉంటాడు. ఎందరికో గోధుమలు దానం చేసి ఉంటాడు. కాని సేరుంబావు గోధుములు అప్పు ఇచ్చిన షావుకారు మాత్రం తన అప్పు మర్చిపోడు. చాలాఏళ్ల తర్వాత ఆ గోధుమలకు వెలగట్టి, వడ్డీ వేసి, చక్రవడ్డీ వేసి రైతు ముందు పద్దు పెడతాడు. ‘ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టు. కాని పైలోకాల్లో ఉన్న దేవతలకు నువ్వు చేసిన బాకీ ఎగవేతకు సమాధానం చెప్పాలి’ అంటాడు. ధర్మభీతి కలిగిన రైతు పై లోకాల్లో ఉన్న దేవతల దగ్గర ముఖం చెల్లడానికి తన పొలం పుట్ర పశువు అన్నీ ఆ సేరుంబావు గోధుమల అప్పుకు దఖలు పరిచి ఆ షావుకారు పొలంలోనే కూలీగా మారతాడు. సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’లో కూడా ఒక కథ ఉంది. రంగయ్య అనే రైతు తండ్రి 200 రూపాయలు అప్పు చేసి దానిని చెల్లించే బాధ్యత కొడుక్కు అప్పజెప్పి కన్నుమూస్తాడు. కొడుకు ప్రతి సంవత్సరం పంట పండించడం, మూడొంతులు బాకీకి జమ చేయడం... ఒక వంతు తినడం. కానీ 20 ఏళ్లు ఇలా చేసినా అప్పు తీరదు. షావుకారు ఒకరోజు ఆ రంగయ్యకు మిగిలిన జత ఎద్దులను కూడా తెచ్చి పెరట్లో కట్టుకుంటాడు. రగిలిపోయిన రంగయ్య కొడవలి పట్టి షావుకారు గొంతు కోస్తానని నిలబడతాడు. అప్పుడు షావుకారు ‘ఒరే... నువ్వు నరకాలంటే నరుకు. కాని పితృరుణం చాలా పవిత్రమైనది. దానికి అపచారం చేయాలనుకుంటే నీ ఇష్టం’ అంటాడు. రంగయ్య తండ్రిని తలుచుకుని కన్నీరు మున్నీరు అవుతాడు. పరలోకంలో ఉన్న తండ్రి ఆత్మ శాంతించడానికి మూడో ఎద్దుగా చాకిరీ చేసి బాకీ చెల్లించడానికి నిష్క్రమిస్తాడు. కథగా మొదట వచ్చి తర్వాత సినిమాగా తెరకెక్కి గొప్పగా నిలిచించి ‘దో బిఘా జమీన్’. అందులో పేద రైతు బల్రాజ్ సహానీ షావుకారు దగ్గర చేసిన అప్పు 65 రూపాయలు మాత్రమే. ఫ్యాక్టరీ కట్టుకుంటాను బాకీకి బదులుగా నీ పొలం ఇవ్వు అనంటే మట్టి మీద మమకారంతో పొలం తప్ప పుడకా పుల్లా అన్నీ అమ్మి షావుకారు దగ్గరకు వెళితే బాకీని 235 రూపాయలుగా తేలుస్తాడు. బాకీనా? పొలమా? బల్రాజ్ సహానీ నగరానికి వస్తాడు. నానా బాధలు పడతాడు. చివరకు బాకీ చెల్లించలేకపోతాడు. క్లయిమాక్స్‌లో ఊరికి తిరిగి వచ్చి తన పొలంలో కడుతున్న ఫ్యాక్టరీని చూసి కనీసం గుప్పెడు మట్టిని తీసుకుందామనుకున్నా కాపలామనిషి అదిలింపుతో తీసుకోలేకపోతాడు. ఒక చక్రవర్తికి శిరస్సున ఉన్న కిరీటం సర్వశక్తిమంతమైనదిగా అనిపించవచ్చు. కాని ఈ జగాన ఎదుటివానికి అప్పిచ్చే స్థితి కలిగి ఉండటమే అసలైన, సర్వవ్యాపితమైన, ధార్మిక బలిమిగల, చట్ట సమర్థత ఉన్న, న్యాయమూర్తుల తీర్పులు పొందగల ప్రచండ శక్తి. ఎదుటివాడి దురదృష్టాన్ని పెట్టుబడిగా చేసుకునేదే అప్పు. 2500 ఏళ్ల క్రితమే మనిషి– నీకు పశువులు, విత్తనాలు, పొలము ఇస్తాను... బాగుపడి బదులుగా నాకు వాటి మీద 20 శాతం అధికమొత్తం ఇవ్వు అని చెప్పడం మొదలుపెట్టాడు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా, అగ్నిప్రమాదాలు సంభవించినా, మహమ్మా రులు పెట్రేగినప్పుడు, ఇంటి పెద్ద అకాల మృత్యువు సంభవించినప్పుడు ఈ ‘అప్పు ఇచ్చువాడు’ ఎదిగి, ఎదిగి, ఎదిగి చెమట చుక్క చిందించకుండా శ్రీమంతుడవడం నేర్చాడు. చెల్లించలేనంత అప్పు ఇవ్వడం ద్వారా దేశాలను నెత్తురు చుక్క చిందించనవసరం లేని యుద్ధంతో జయిస్తున్నాడు. మోసంతో ఎగ్గొట్టే వాళ్ల సంగతి పక్కనపెడదాం. పిల్ల పెళ్లి అని, అబ్బాయి చదువు అని, భార్య అనారోగ్యమని, వ్యాపారంలో నష్టం అని, హఠాత్తుగా ఉద్యోగం పోయిందని, ఎవరో దగా చేశారని అప్పు చేసి, తప్పక తిరిగిద్దామన్న ఉద్దేశంతో ఉండి, చెల్లించలేక సతమతమయ్యవారితో, ఏది ఉన్నా లేకపోయినా ‘పరువు’ అనే బరువుతో బతుకుదామనుకునేవాళ్లతో, కొద్దిపాటి చిల్లర అప్పుకు కూడా బెంబేలెత్తిపోయేవాళ్లతో ‘తెలిసినవారు’, ‘బంధువులు’, ‘స్నేహితులు’, ‘వడ్డీ వ్యాపారులు’ అయిన అప్పిచ్చినవారి వైఖరి ఏమిటి? మీరు ఇచ్చింది అప్పే. వారు చెల్లించవలసిందీ అప్పే. జీవితం కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ భర్త చక్కగా నవ్వుతాడు. భార్య అతని కోసం ఆదివారం చికెన్ వండుతుంది. ఇద్దరు పిల్లలు సాయంత్రం తండ్రి ఇంటికి రాగానే నాన్నా అని కావలించుకుంటారు. అందరూ కలిసి టీవీలో ఏదో సినిమా చూస్తారు. వారు ఉన్నారని వృద్ధ తల్లిదండ్రులు బతుకుతుంటారు. వారు ఉన్నారని తోబుట్టువులు బతుకుతుంటారు. వారు ఉన్నారని ఆప్తులతో కూడిన ప్రపంచమే ఉంటుంది. కాని కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేక ఆ భర్త, ఆ భార్య, ఇద్దరు చిన్నారులు చెరువులో దూకి మరణిస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రాణాలు ఎలాంటి వడ్డీతో సమానం. ఆ సమూహిక మరణంలో అసలు, వడ్డీ పోనూ ఈ అమానుష సమాజం పడిన రుణం ఎంత? హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ విషాదానికి బాధ్యులు ఎవరు? ‘క్షమ’ మనిషిని ఉన్నతీకరిస్తుంది. ఎదుటివారి తప్పులనే కాదు అప్పులను కూడా క్షమించగలిగే సందర్భాలలో క్షమించగలగడమే మనిషి గొప్పతనం. ‘ఇస్తావా? చస్తావా?’ అనకండి. చచ్చే రోజులే ఉన్నాయి ఈ దౌర్భాగ్య కాలంలో. -
బిడ్డ శవాన్ని నెత్తిన పెట్టుకుని...
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూలం అమ్మ. గర్భాశయంలో పెంచి, జన్మనిచ్చే ప్రేమమూర్తి. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అలాంటి అమ్మ ప్రేమ కంటే గొప్పది.. భద్రమైంది మరేదీ ఉండదు. అలాంటిది చనిపోయిన తన బిడ్డ చలనం రాకపోతుందా అన్న ఆశతో నాలుగు రోజులపాటు మోసుకు సుదూర ప్రయాణం చేసిందో తల్లి. వాన్కోవర్: బ్రిటీష్ కొలంబియా, విక్టోరియాలోని తీర ప్రాంతం. J35 అనే ఓర్కా తిమింగలం(కిల్లర్ వేల్.. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దది) 17 నెలలుగా ఆ మధుర క్షణాల కోసమే ఎదురు చూసింది. గత మంగళవారం ఉదయం అది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అవి గుంపుగా జీవించే జీవులు కావటంతో.. మిగతావి దాని దగ్గరికొచ్చి బిడ్డను చూసి సందడి చేశాయి. కాసేపు నీటిలో హాయిగా చక్కర్లు కొట్టిన ఆ పిల్ల ఓర్కా.. కాసేపటికే చలనం లేకుండా పోయింది. గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. ఎలాగైనా మళ్లీ ఊపిరి పోయాలన్న ఆలోచనతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం ప్రారంభించింది. అలా గంటలు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల బరువు.. ఏకంగా నాలుగు రోజులపాటు ఏకధాటిగా 185 కిలోమీటర్లు ప్రయాణించింది. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద వేల్ రీసెర్చర్ ‘కెన్ బాల్కోమ్’ J35ను గుర్తించి దాని వ్యధను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ’సాధారణంగా జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే. అయితే ఇన్నిరోజులపాటు ఓపికగా ఎదురు చూడటం బహుశా ఇదే తొలి ఘటన అయి ఉండొచ్చు. ఈ నాలుగు రోజులు అది చాలా అవస్థలు పడింది. తిండికి కూడా దూరంగా ఉంది. ఊపిరి కష్టమైన బిడ్డను తల నుంచి దించలేదు. రోజుకు 60 నుంచి 70 మైళ్ల మధ్య అది ఈదుతూ వచ్చింది. బిడ్డలో కదలిక కోసం అది తీవ్రంగా యత్నించింది. ఈ భావోద్వేగాన్ని షూట్ చేయాలని నిర్ణయించి దాన్ని ఫాలో అయ్యాం. గుండెకు తాకేలా ఉన్న ఈ కథనాన్ని ప్రపంచానికి తెలియజేశాం’ అని బాల్ కోమ్ చెబుతున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... -
వైరల్: నేను రెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు..
రెండేళ్ల వయస్సులోనే యాసిడ్ దాడికి గురైన యువతి స్ఫూర్తిదాయక గాథ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన షబ్బూ రెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు.. ఆమె తల్లిపై తండ్రి యాసిడ్ దాడి చేశాడు. అతడు పోసిన యాసిడ్ సగం ఆమె మొఖంపై పడింది. అనంతరం అనాథగా ఆమె ఓ అనాథ ఆశ్రయంలో పెరిగింది. అక్కడ తరగని ప్రేమానురాగాల మధ్య తాను పెరిగానని పేర్కొన్న ఆమె సాహసోపేతమైన జీవితగాథను 'హ్యుమన్స్ ఆఫ్ బాంబ్వే' ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది. యాసిడ్ దాడికి గురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న ఆమె అసమాన ఆత్మస్థ్యైర్యం నెటిజన్లను కదిలిస్తోంది. ఆమె జీవితగాథను వేలమంది షేర్ చేసుకుంటున్నారు. భయానకమైన యాసిడ్ దాడులు మనుష్యుల శరీరాలపై మచ్చలు మిగిల్చి.. కలల్ని ఛిద్రం చేస్తాయి. కానీ, గతంలో ఎప్పుడో జరిగిన యాసిడ్ దాడి తన ప్రస్తుత జీవితాన్ని అడ్డంకిగా మారకూడదని షబ్బూ నిర్ణయించుకొంది. కాలేజీలో చదివేటప్పుడు కొత్తవారితో స్నేహం చేసేందుకు మొదట తను జంకేది. కానీ, అదంతా మన మనస్సులోని భావనే అని గుర్తించిన షబ్బూ.. తన కలలు నిజం చేసుకొనే దిశగా ధైర్యంగా సాగుతోంది. 'గతంలో జరిగిన ఘటనకు సంబంధించి నన్ను ఇప్పటికీ యాసిడ్ దాడి బాధితురాలిగా ప్రజలు పిలుస్తారు. అది నాకు నచ్చదు. నేను బాధితురాల్ని కాదు. నా ముఖంపై ఉన్న మచ్చలను స్వీకరించి.. జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నా' అని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు నెటిజన్లలో స్ఫూర్తి రగిలిస్తున్నాయి. -
‘బతుకు’ పోరు
అనంపురం ఎడ్యుకేషన్: డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది. నేటికీ ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బతుకు పోరులో ఎన్నో కష్టనష్టాలను వారు చవిచూస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. విద్య, వైద్య వారికి అందని ద్రాక్షగా మారింది. కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారి దరి చేరడం లేదు. ఇలాంటి ఓ కుటుంబంలోని ముగ్గురు.. బుధవారం అనంతపురం నగరంలోని డ్రెయినేజీల్లో ఇనుప ముక్కలు ఏరుకుంటూ ఇలా కనిపించారు. తమకు లభ్యమైన ఇనుప ముక్కలను గుజరీలో విక్రయించి, వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.