
ఆడబిడ్డ పుట్టిందని ఏ చెత్తకుప్పల్లోనో, గుడిమెట్ల మీద వదిలేసే ఘటనలు చూసే ఉంటారు. కానీ, ఇక్కడ ఓ నాన్నమ్మ వద్దనుకోవడంతోనే ఆగిపోలేదు. అతికర్కశంగా.. తన కొడుకుకు పుట్టిన బిడ్డను గొంతు కోసి చెత్తకుప్పలో పడేసింది. అయితే.. తుంచిన ఆ పసిమొగ్గకు వైద్యులు మళ్లీ ఊపిరిపోసి పునర్జన్మ ప్రసాదించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో.. నెలరోజుల కిందట అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు కోసి చెత్తకుండీలో పడేసింది ఆమె నానమ్మ. రక్తపుమడుగులో చలనం లేని స్థితిలో పడి ఉన్న బిడ్డ దేహాన్ని పోలీసులు భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్ర స్రావం కావడంతో బతకడం కష్టమేనని వైద్యులు భావించారు. అయితే.. పెద్ద అద్భుతమే జరిగింది!.
పాప గొంతు కోసినా కీలకమైన ధమనులు, సిరల తెగలేదు. దీంతో పలు శస్త్రచికిత్సలు చేసి ఆమెను బతికించగలిగారు వైద్యులు. మొత్తంగా.. ఆ బిడ్డకు నెల రోజులపాటు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. పైగా ఆ పాపకు పీహూ అని పేరు పెట్టారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో మృత్యువును జయించిన పీహూను రాజ్‌గఢ్‌లోని ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్ తెలిపారు.
మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదుకాగా, నాన్నమ్మ, ఆ పసికందు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ లాంటి ఘటనల్లో దేశంలోనే ముందుంది. నవజాత శిశువుల్ని రోడ్డున పడేస్తున్న కేసులు అక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ(జాతీయ నేర గణాంకాలు) నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment