దివ్యాంగుల కోటాలో ఉద్యోగం .. ఆపై హుషారైన స్టెప్టులేసి.. | Disabled Priyanka Kadam Caught Dancing in Viral Video | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల కోటాలో ఉద్యోగం .. ఆపై హుషారైన స్టెప్టులేసి..

Published Mon, Feb 17 2025 7:26 PM | Last Updated on Mon, Feb 17 2025 8:20 PM

Disabled Priyanka Kadam Caught Dancing in Viral Video

భోపాల్‌ : ఓ ప్రభుత్వ అధికారిణి హుషారైన స్టెప్పులేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీల్లో డ్యాన్స్‌లు వేయడం,వాటిని వీడియోల రూపంలో పంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే, ట్రెజరీ విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోపై వివాదం చెలరేగింది. దీంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగ నియామకంపై, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే ఉద్యోగాల నియామకాలపై అనేక అనుమానాలు,ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ హుషారైన స్టెప్పులేసిన ఆ అధికారిణి ఎవరు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు.

ఇటీవల,మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ పార్టీకి ఉజ్జయిని ట్రెజరీ,అకౌంట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంకా కదమ్ (Priyanka Kadam)హాజరయ్యారు. ఆ పార్టీలో బ్రేక్‌ డ్యాన్స్‌ సైతం వేశారు. ఆమె డ్యాన్స్‌పై ఇతర గెస్ట్‌లు ఆహోఓహో అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. డ్యాన్స్‌ చేస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వివాదంగా మారింది.

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) నిర్వహించిన 2022 పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ప్రియాంకా కదమ్ బోన్ డిజేబుల్ సర్టిఫికెట్‌తో దివ్యాంగుల కోటా కింద ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారని నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ నాయకుడు రాధే జాట్  ఆరోపణలు చేశారు. తాను దివ్యాంగురాలినని చెప్పుకునే ప్రియాంకా కదమ్ డ్యాన్స్‌ ఎలా చేశారని ప్రశ్నించారు. ఆమె దివ్యాంగంపై అనుమానం వ్యక్తం చేశారు.  

 

అంతేకాదు, ఈ పరీక్షలో దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లను అందించేలా భోపాల్‌ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు స్పందించలేదు.

అయితే, తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రియాంక కదమ్‌ ఖండించారు. తన నియామకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 2017లో తాను బాత్‌రూమ్‌లో జారిపడ్డానని, దీంతో తనకు అవాస్కులర్‌ నెక్రోసిస్‌ అనే సమస్య తలెత్తినట్లు చెప్పారు. అవాస్కులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి కారణంగా రక్త సరఫరా లోపం తలెత్తి ఎముకలు బలహీనమవుతాయి.

బోన్ సంబంధిత సమస్యల కారణంగా 45 శాతం దివ్యాంగురాలిగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అయితే తాను నడవగలనని, కొంతమేర డ్యాన్స్ కూడా చేయగలనని స్పష్టం చేశారు. నేను మీకు సాధారణంగా కనిపించవచ్చు. కానీ నా శరీరంలో ఇంప్లాంట్స్ వల్లే నడవగలుగుతున్నాను. కొన్ని నిమిషాలు డ్యాన్స్ కూడా చేయగలుగుతున్నాను. డ్యాన్స్‌ చేస్తే కొన్నిసార్లు శరీరంలో నొప్పులు తలెత్తుతాయి. మెడిసిన్‌ తీసుకుంటే తగ్గిపోతుంది’ అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement