Government Job
-
దివ్యాంగుల కోటాలో ఉద్యోగం .. ఆపై హుషారైన స్టెప్టులేసి..
భోపాల్ : ఓ ప్రభుత్వ అధికారిణి హుషారైన స్టెప్పులేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీల్లో డ్యాన్స్‌లు వేయడం,వాటిని వీడియోల రూపంలో పంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే, ట్రెజరీ విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె చేసిన డ్యాన్స్ వీడియోపై వివాదం చెలరేగింది. దీంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగ నియామకంపై, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే ఉద్యోగాల నియామకాలపై అనేక అనుమానాలు,ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ హుషారైన స్టెప్పులేసిన ఆ అధికారిణి ఎవరు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల,మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ పార్టీకి ఉజ్జయిని ట్రెజరీ,అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంకా కదమ్ (Priyanka Kadam)హాజరయ్యారు. ఆ పార్టీలో బ్రేక్ డ్యాన్స్ సైతం వేశారు. ఆమె డ్యాన్స్‌పై ఇతర గెస్ట్‌లు ఆహోఓహో అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వివాదంగా మారింది.మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) నిర్వహించిన 2022 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ప్రియాంకా కదమ్ బోన్ డిజేబుల్ సర్టిఫికెట్తో దివ్యాంగుల కోటా కింద ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారని నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ నాయకుడు రాధే జాట్ ఆరోపణలు చేశారు. తాను దివ్యాంగురాలినని చెప్పుకునే ప్రియాంకా కదమ్ డ్యాన్స్ ఎలా చేశారని ప్రశ్నించారు. ఆమె దివ్యాంగంపై అనుమానం వ్యక్తం చేశారు. 45% दिव्यांग अधिकारी का डांस फ्लोर पर धमाल..MPPSC भर्ती 2022 में दिव्यांग कोटे से चयनित प्रियंका कदम के डांस वीडियो वायरल होने से विवाद खड़ा हो गया है. नेशनल एजुकेटेड यूथ यूनियन ने भर्ती में धांधली का आरोप लगाया, जिसके बाद निष्पक्ष जांच की मांग उठ रही है.#viral #trending… pic.twitter.com/bs5rLMs7Ad— NDTV India (@ndtvindia) February 14, 2025 అంతేకాదు, ఈ పరీక్షలో దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లను అందించేలా భోపాల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు స్పందించలేదు.అయితే, తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రియాంక కదమ్ ఖండించారు. తన నియామకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 2017లో తాను బాత్రూమ్లో జారిపడ్డానని, దీంతో తనకు అవాస్కులర్ నెక్రోసిస్ అనే సమస్య తలెత్తినట్లు చెప్పారు. అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధి కారణంగా రక్త సరఫరా లోపం తలెత్తి ఎముకలు బలహీనమవుతాయి.బోన్ సంబంధిత సమస్యల కారణంగా 45 శాతం దివ్యాంగురాలిగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అయితే తాను నడవగలనని, కొంతమేర డ్యాన్స్ కూడా చేయగలనని స్పష్టం చేశారు. నేను మీకు సాధారణంగా కనిపించవచ్చు. కానీ నా శరీరంలో ఇంప్లాంట్స్ వల్లే నడవగలుగుతున్నాను. కొన్ని నిమిషాలు డ్యాన్స్ కూడా చేయగలుగుతున్నాను. డ్యాన్స్ చేస్తే కొన్నిసార్లు శరీరంలో నొప్పులు తలెత్తుతాయి. మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది’ అని స్పష్టం చేశారు. -
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు
మంచిర్యాల జిల్లా( జన్నారం): కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నస్పూరి సంతోష్. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రా మానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంప తుల కుమారుడు సంతోష్ పదో తరగతి వరకు తపాల పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. బీఈడీ రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.2023లో రైల్వేలో ఉద్యోగాల ప్రకటన రావడంతో పరీక్షలు రాసి పాయింట్‌మెన్ ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే ఈ ఏడాది గురు కు ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యో గాలు సాధించారు. వాటిలో చేరకుండా టీజీపీఎస్సీ వేసిన నోటిఫికేషన్లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని చదివారు. ఈ నెల 27న ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తనను కష్టపడి చదివించిన అమ్మనాన్నల ఆశీర్వాదంతోనే ఇన్ని ఉద్యోగాలు సాధించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న సంతోష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరుతానని వెల్లడించారు.చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం! -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగ్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చదవండి: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్ -
డిసెంబర్ 4న జాబ్ కేలండర్ ఇస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ కేలండర్ పెద్ద జోక్. పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిసీ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం ప్రజలను ఏప్రిల్ ఫూల్స్ చేయడమే, అది పప్పూ కేలండర్’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా నేటికీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలంగాణలో గత పదేళ్లలో ఏటా సగటున 16 వేల చొప్పున 1.60లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు సగటున ఏటా వేయి ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది’అని చెప్పారు. రాహుల్, రేవంత్‌రెడ్డి ఏనాడైనా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు. కేటీఆర్.. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 4న తానే స్వయంగా అశోక్‌నగర్‌కు అధికారులతోపాటు వెళ్లి యువతతో సమావేశమై జాబ్ కేలండర్‌ను రూపొందిస్తామని ప్రకటించారు. చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో? 29న దీక్షా దివస్ ‘స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తన నిరాహార దీక్షతో తెలంగాణ జాతిని ఏకం చేసిన కేసీఆర్ నవంబర్ 29 దీక్షతో ఉద్యమ చరిత్రను మలుపు తిప్పారు. ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టండి అని చెప్పిన ధీశాలి కేసీఆర్. ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ చేసిన దీక్ష తెలంగాణ సమాజంలో సబ్బండ వర్గాలను కదిలించింది. ఢిల్లీ మెడలు వంచడంలో కీలకమైన నవంబర్ 29న పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగరాలి. అనేక రాజకీయ పార్టీలు వచ్చి కనుమరుగైనా ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌దే. 14 ఏళ్లుగా దీక్షా దివస్ జరుపుకుంటున్న రీతిలోనే నవంబర్ 29న అమరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట స్ఫూర్తిని మరోమారు తెలియజేయాలి. విముక్తి పోరాటంలో సమున్నత సందర్భాన్ని చాటేలా దేశ విదేశాల్లో దీక్షా దివస్ నిర్వహించాలి. అమరుడు శ్రీకాంతాచారిని స్మరించుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీతో రేవంత్ లోపాయికారీ ఒప్పందం ‘ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేదు. ఆయనకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉంది. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో బీజేపీ గెలుచుకున్న గోషామహల్‌తోపాటు కరీంనగర్, కోరుట్లలో కూడా బీఆర్ఎస్ గెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు దక్కకుండా గెలిచి తీరుతాం. రైతుబంధు కొత్త పథకం కాకపోయినా అభ్యంతరం చెబుతున్న రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఐటీ దాడులు అన్ని పార్టీల నేతల మీద జరుగుతున్నా కేవలం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని రేవంత్ చెప్పడం విడ్డూరం. బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్‌కు బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది!
పెద్దపల్లి: కూతురు భారం కాదు.. ఆమెను ప్రోత్సహిస్తే కుటుంబానికి అండగా నిలుస్తూ ఇంటికి వెలుతురునిస్తుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునేవారికి ఆ భావన తప్పు అని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. కళలు, క్రీడలు, చదువులు, ఉద్యోగాల్లో రాణిస్తూ మగవాళ్లకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులకు తమను చూసుకునే కొడుకుల్లేరనే బాధను మర్చిపోయేలా చేస్తున్నారు. వారి ఆశలను తీరుస్తూ.. కలలను నిజం చేస్తూ ఇంట్లో ఆనందాన్ని పంచుతున్నారు. నేడు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముగ్గురూ ఉద్యోగులే.. మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మండల కిష్టయ్య–సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సరిత, సవిత, కీర్తి ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సరిత పీజీ, బీఎడ్ పూర్తి చేసి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి, ఇబ్రహీంపట్నం మండలంలో విధులు నిర్వహిస్తోంది. సవిత డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. కీర్తి 2020లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. తాము కూతుళ్లనే కొడుకులు భావించి, ఉన్నత చదువులు చదివించామని, వారు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టాం.. మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. పేద కుటుంబంలో పుట్టాం. అమ్మానాన్న జడల రామస్వామి, లక్ష్మి. నాన్న ఇంటివద్దే దుస్తులు అమ్మి, కుటుంబాన్ని పోషించేవారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకున్నాం. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మమ్మల్ని అమ్మానాన్న ప్రోత్సహించారు. అక్క రాజమణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కరీంనగర్లో పని చేస్తోంది. నేను 2012లో ఐఏఎస్ సాధించా. ప్రస్తుతం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్నా. భర్త శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇద్దరు అహిలన్, అభిషన్ సంతానం. చెల్లెలు జ్యోతి హైదరాబాద్‌లో బ్యాంకింగ్ రంగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. నాలుగు మాసాల క్రితం నాన్న చనిపోవడం తీరని బాధను మిగిల్చింది. కష్టపడి లక్ష్యం చేరుకున్నా.. మాది ప్రకాశం జిల్లా. నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. మేం నలుగురు అక్కాచెల్లెల్లం. నాన్న షేక్ యూసుఫ్ పాషా ఎక్స్ సర్వీస్‌మెన్, తల్లి షబీరా హౌస్ వైఫ్. నలుగురు కూతుళ్లలో నేనే పెద్దదాన్ని. పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంటి వద్దే ఉంటూ వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటివే జీవితం అనుకోలేదు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకున్నాను. 2003లో గ్రూప్–1 రాసి, ఎంపీడీవోగా, 2009లోనూ రాసి, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. 2011లో మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చాను. 2020లో వనపర్తికి కలెక్టర్‌గా వెళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాను. పెద్ద చెల్లెలు నజీబీ లండన్‌లో స్థిరపడగా రెండో చెల్లెలు పర్వీన్ టీఎస్ ఎస్‌లో మంచి పొజిషన్లో ఉంది. చిన్న చెల్లెలు బీఫార్మిసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. అమ్మానాన్న అందరూ ఆడపిల్లలే అని బాధ పడలేదు. చదువుల్లో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉన్నారు. వారి వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి. అమ్మ గర్వపడుతోంది.. మా స్వగ్రామం మేడిపల్లి మండలంలోని తొంబర్రావు పేట. కోరుట్లలో స్థిరపడ్డాం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నాన్న బుచ్చిలింగం గల్ఫ్ కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీ కార్మికురాలు. పిల్లలు ఆడవాళ్లనే భావన ఎప్పుడూ వారిలో చూడలేదు. అందరినీ ఉన్నత చదువులు చదివించారు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివి, వ్యవసాయ అధికారి ఉద్యోగం సాధించాను. చెల్లెళ్లు విశాల, రమ్య పీజీ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. నాన్న గల్ఫ్ నుంచి వచ్చి, అనారోగ్యం బారిన పడినా అమ్మ బీడీలు చుట్టి, మా చదువులు పూర్తి చేయించింది. ప్రస్తుతం ప్రయోజకులుగా మారిన మమ్మల్ని చూసి, మా అమ్మ గర్వపడుతోంది. మా కల నిజం చేసింది.. మాది సిరిసిల్ల. మా అమ్మాయి శివాని పదోతరగతి నుంచి చదువుల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతోంది. పదోతరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 968 మార్కులు సాధించింది. బీటెక్ ఈసీఈ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ కంపెనీలో ఏడాదికి రూ.32 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగిగా పని చేస్తోంది. అమ్మాయి మా కల నిజం చేసినందుకు సంతోషంగా ఉంది. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని.. యువకుడు తీవ్ర నిర్ణయం..!
నల్గొండ: ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలంలోని పొట్లపహాడ్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లపహాడ్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు మేకపోతుల సైదమ్మ, సీతారాములు దంపతుల పెద్ద కుమారుడు మేకపోతుల విక్రమ్(30) బీటెక్ చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. సోమవారం జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష రాసి వచ్చాడు. ఎన్ని పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన విక్రమ్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసిన సూసైడ్ నోట్ మృతుడి వద్ద లభించింది. కాగా విక్రమ్‌కు దామరచర్ల గ్రామానికి చెందిన యువతితో జూలైలో ఎంగేజ్మెంట్ కాగా నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నర్సింగ్ వెంకన్నగౌడ్ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!
‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను నిజం చేశారు వారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని రుజువు చేశారు సామాన్య రైతు కుంటుబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు. పోలీసు కొలువులు సాధించి, ఒకే సారి శిక్షణ పూర్తి చేశారు. వారే కీల్అవదం గ్రామానికి చెందిన ప్రీతి, నిరంజని, వైష్ణవి. వేలూరు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు పోలీసుకొలువు సాధించి, శభాష్ అనిపించు కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,791 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏడు నెలల శిక్షణ కాలం రెండు రోజుల క్రితం ముగిసింది. ఇందులో రాణిపేట జిల్లా కీల్ అవదం గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్లు ప్రీతి, నిరంజని, వైష్ణవి ఒకేసారి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికై, ఒకేచోట శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారి తండ్రి వెంకటేశన్ మాట్లాడుతూ తన భార్య షకీలా మృతి చెందినప్పటి నుంచి తన పిల్లలు ప్రీతి, నిరంజని, వైష్ణవి, కుమారుడు కార్తికేయన్‌ను సక్రమంగా చదివించి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరి్పంచాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఫ్లస్–2 పూర్తి చేశానని, అనంతరం పోలీస్ ఉద్యోగం కోసం ప్రయతి్నంచానన్నారు. అయితే పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయానని చెప్పారు. దీంతో తనకున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు డిగ్రీ పూర్తి చేశారని, కుమారుడు చెన్నైలో చదువుతున్నాడని చెప్పారు. పెద్ద కుమార్తె ప్రీతికి రాజీవ్‌గాంధీ అనే వ్యక్తితో వివాహం జరిగి, ఇద్దరు కుమారులున్నారని, తన మిగిలిన ఇద్దరు కుమార్తెలకు ఇంకా వివాహం కాలేదని తెలిపారు. అక్కాచెల్లెళ్లందరికీ ఒకేసారి పోలీసు ఉద్యోగం రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. వారు ముగ్గురు కొన్నేళ్లుగా పోలీసు ఉద్యో గం కోసం వేచి ఉన్నారని, తనకు రాని పోలీస్ ఉద్యోగం తన కుమార్తెలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారని, ముగ్గురు కుమార్తెలు ఇంట్లోనే చదివి పోలీస్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు ఒకేసారి ఎంపికై ఒకే ప్రాంతంలో శిక్షణ పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం -
తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం
తిరువనంతపురం: ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. కానీ, ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం రావటం చూశారా? అవునండీ.. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందు.. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్ సెంటర్లో చేర్పించారు. రెండు సార్లు ఎల్జీఎస్, ఒకసారి ఎల్డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష్యం ఐసీడీఎస్ సూపర్వైజర్ పరీక్ష అని... ఎల్జీఎస్ బోనస్ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదీ చదవండి: Lucknow Hospital Video: బర్త్ డే పార్టీ పేరుతో ఆసుపత్రిలో విద్యార్థుల హల్చల్.. వీడియో వైరల్! -
అక్షర పూదోటలో విహారం
‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్‌లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు. రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది. నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ. ‘మగాడు’ కథ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది. ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్ మీద కాలేజ్‌కి వెళ్లి ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’. ‘‘మల్లిక్ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ. చేయి చాచవద్దు! ‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె. ‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది. అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు. సరైన నిర్ణయమే! గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్పెక్టేషన్లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్‌గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే. నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది. అక్షరాల మడి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కాలమ్స్ రాస్తున్నాను. నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే. మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. – అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి, జనరల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు
ఛత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్‌ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టులో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. తాను బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్‌ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించలేదు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా! -
బీటెక్ చదువు.. ఆపై ఉద్యోగం, ఎన్నో కలలు.. కానీ..
సాక్షి,పాల్వంచ రూరల్(ఖమ్మం): బీటెక్ చదివినా ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగిన నిరుద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పాల్వంచ మండలం పాండురంగాపురానికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు – శివరాణి దంపతుల కుమారుడు అజయ్‌కుమార్(25) బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఏపీలోని వైజాగ్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసినా నెల రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే, తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని కొన్నాళ్లుగా ఆవేదన చెందుతున్న ఆయన, గత నెల 20న పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా, ఉద్యోగం రావడం లేదనే ఆవేదనతోనే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి మేనమామ ఎం.కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.సుమన్ తెలిపారు. -
మ్యాట్రిమోనీ యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి..
చిత్తూరు అర్బన్: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ ఈ వివరాలను మీడియాకు వివరించారు. అరక్కోణంలో స్థిరపడి మోసాలు చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు. మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్లైన్ సంస్థలు) యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్లోడ్ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్లో చెప్పేవాడు. పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఫలించిన కల.. ఆఫీస్‌బాయ్ నుంచి.. ఏపీపీ స్థాయికి
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలో మారుమూల గ్రామమైన రాయదండికి చెందిన యువకుడు పట్టుదలతో ముందుకెళ్లి అనుకున్నది సాధించాడు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. గ్రామానికి చెందిన అర్ధ చంద్రయ్య, వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు కుమార్. అబాది రామగుండం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి, గోదావరిఖనిలో ఇంటర్, డిగ్రీ చదివాడు. ఖర్చుల కోసం ప్రైవేటు పాఠశాలలో పార్ట్‌టైం ఉపాధ్యాయుడిగా, పేపర్ బాయ్‌గా, కార్యాలయాల్లో గుమాస్తాగా పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ సీటు సాధించాడు. 2004 నుంచి గోదావరిఖని, హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. సహకరించిన అర్ధాంగి కుమార్‌కు పెద్దంపేటకు చెందిన తోట రాంచందర్, భాగ్య కూతురు రజితతో 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. ఎంఎస్సీ పూర్తిచేసిన రజిత 2014లో వీఆర్ఏగా అదే గ్రామంలో ఉద్యోగం సాధించింది. అప్పటినుంచి కుమార్‌ను ప్రోత్సహిస్తోంది. ఆమె సహకారంతో 2021 అక్టోబర్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవేశ పరీక్ష రాశాడు కుమార్. నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ పీపీగా ఎంపికైనట్లు ఉత్తుర్వులు వెలువడ్డాయి. దీంతో అతడి కుటుంబంలో ఆనందం నెలకొంది. పట్టుదలతోనే ముందుకు.. ఏపీపీ ప్రవేశ పరీక్షకు ముందు అనేక జర్నల్స్ చదివా. విజయ శిఖరాలకు చేరినవారిని ఆదర్శంగా తీసుకున్నా. ప్రతిరోజూ 8 గంటలపాటు చదివా. న్యాయవాది వృత్తిలో కొనసాగాలనేది నా కల. పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే ఈ వృత్తిలోకి వచ్చా. – అర్ధ కుమార్ చదవండి: ‘రెండు గుంటలు’.. రెండు హత్యలు -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్‌పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్‌పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!
అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సరిగా చదవకుండా ఏవో సాకులు చెబుతూ కాలక్షేపం చేయడం. సరైన ఉద్యోగం లేక నిరుద్యోగిగా కాలం వెళ్లదీసేవారు కొందరు. కానీ అమృతసర్ అవిభక్త కలలు తమ శారరీక లోపాన్ని అధిగమించి మరీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే...అమృత్‌సర్‌కి చెందిన అవిభక్త కవలలు సోహ్నా, మోహనా న్యూ ఢిల్లీలో జూన్ 14, 2003న జన్మించారు. అయితే వీరికి రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు. కానీ వీరికి ఒకటే కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. అయితే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారిని పరీక్షించి శస్త్రచికిత్స వల్ల ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వేరు చేయకూడదని నిర్ణయించారు. దీనికి తోడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నిరాధరణకు గురయ్యారు. ఈ మేరకు పిగల్వార్ సంస్థ చదువు చెప్పించడమే కాక వీరి బాగోగులను చూసుకుంది. అంతేకాదు వారు తమ శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్)లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. పైగా వారికి ఆ రంగంలో అనుభవం ఉన్నందున వారిని నియమించకున్నట్లు పీఎస్‌పీసీఎల్ సబ్‌స్టేషన్ జూనియర్ ఇంజనీర్ రవీందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆ అవిభక్త కవలలు మాట్లాడుతూ...తమకు ఈ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. పైగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి తమ విద్యనందించిన పింగల్వార్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని అన్నారు. (చదవండి: హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..) -
‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’
చెన్నై: ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జీవితంలో సెటిల్ అయినట్లే. ఉద్యోగ భద్రత ఉంటుంది.. జీతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. ప్రమోషన్‌కు డోకా ఉండదు. అందుకే యువతకు గవర్నమెంట్ జాబ్ అంటే అంత మోజు. దీన్ని ఆసారా చేసుకుని.. క్యాష్ చేసుకునే మోసగాళ్లకు కొదవే లేదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్పిస్తానంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు తమిళనాడుకు చెందిన ఓ కేటుగాడు. ఆ వివరాలు.. (చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం) నిందితుడిని కన్నణ్‌గా గుర్తించారు పోలీసులు. ఇతడు చెన్నై సెక్రటేరియట్ కాంప్లేక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కన్నణ్కి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాధితుడు రంగస్వామితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా తన కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు రంగస్వామి. విషయం తెలుసుకున్న కన్నణ్.. తాను సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోనే అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపాడు. రంగస్వామి కుమారుడి రెజ్యూమ్ ఇవ్వమన్నాడు. దాన్ని పరిశీలించి.. తనకు 30 లక్షల రూపాయలు ఇస్తే.. సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపాడు. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారిగా కన్నణ్ అడిగిన మొత్తాన్ని అతడికి ఇచ్చాడు రంగస్వామి. (చదవండి: పాపం అవినాష్.. కరోనాతో మరణించాక డీఎస్పీ కొలువొచ్చింది) తీరా డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత కూడా జాబ్ ఇప్పించకపోవడంతో.. రంగస్వామి, అతడి స్నేహితుడు కన్నణ్‌ని ప్రశ్నించారు.. తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదు కన్నణ్. ఈ క్రమంలో రంగస్వామి జరిగిన మోసం గురించి పోలీసులను ఆశ్రయించాడు. రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్నణ్‌ని అరెస్ట్ చేశారు. అతడు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కన్నణ్ జైలులో ఉన్నాడు. చదవండి: మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్ -
మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: పారా ఒలింపిక్స్ పతక విజేత మారియప్పన్ తంగవేల్‌కు ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఈ మేరకు నియామక పత్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం అందజేశారు. సేలం జిల్లా పెరియవడకం పట్టి గ్రామానికి చెందిన మారియప్పన్ తంగవేలు రియో పారా ఒలింపిక్స్ హైజంప్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుని తమిళనాట హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. ఇటీవల టోక్యో పారా ఒలింపిక్స్‌లోనూ బంగారం ప్రయత్నం చేసి రజతం దక్కించుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో రెండు సార్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు దక్కించుకున్నా ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదని నెల క్రితం మారియప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం స్టాలిన్ స్పందించారు. కరూర్‌లోని కాగితం పరిశ్రమ విక్రయ విభాగం అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించారు. ఇందుకు తగ్గ నియామక ఉత్తర్వులను బుధవారం సచివాలయంలో మారియప్పన్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కనిమొళి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారియప్పన్ మీడియాతో మాట్లాడు తూ.. తనకు ఉద్యోగం లభించడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడులో పారా క్రీడా అసోసియేషన్‌కు గుర్తింపు కల్పించాలని, తద్వారా తన లాంటి వారు ఎందరో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చదవండి: (వినీషా పవర్ ఫుల్ స్పీచ్ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!) ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు రూ. 196 కోట్లు కరోనా సమయంలో సేవలందించిన వైద్యఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకంగా రూ. 196 కోట్లను ప్రభు త్వం ప్రకటించింది. 24 వేల మంది వైద్య సిబ్బంది, 26 వేల మంది నర్సులు, 6 వేల మంది హెల్త్ అసిస్టెంట్స్, 8 వేల మంది గ్రామ ఆరోగ్య సిబ్బంది సహా మొత్తం 1.05 లక్షల మందికి ప్రోత్సాహకం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 11 మందికి సీఎం స్టాలిన్ ప్రోత్సాహక నగ దు అందజేశారు. అలాగే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నేతృత్వంలో రూ. 170 కోట్లతో 121 పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతులు, గ్రంథాలయాలు, పరిశోధక విభాగాల భవనాలను సీఎం ప్రారంభించారు. మంత్రులు ఎం.సుబ్రమణియన్, అన్బిల్ మ హేశ్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. -
నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం
భద్రాద్రి: ఈ చిత్రంలో కానిస్టేబుల్ డ్రెస్‌లో ఉన్న యువకుడి పేరు ఆనంద్. ఊరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం గ్రామపంచా యతీ పరిధి గుంటిమడుగు. ఈ గిరిజన గ్రామంలో గత 67 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరూ లేరు. తాజాగా బంధం బైరాగి – దుర్గమ్మ దంపతుల కుమారుడు ఆనంద్.. కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. అతడిని స్థానికులు, యువకులు ఘనంగా స్వాగతించి సత్కరించారు. – అశ్వారావుపేట రూరల్ -
పాపం అవినాష్.. కరోనాతో మరణించాక డీఎస్పీ కొలువొచ్చింది
పాట్నా: ప్రస్తుత కాలంలో సర్కారీ కొలువు సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఆ కలను నెరవేర్చుకునేందుకు అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇలా చాలా మంది నిరుద్యోగుల్లాగే బిహార్‌కు చెందిన అవినాష్ కూడా సర్కారీ కొలువు సాధించాలని కలలు కన్నాడు. అయితే, కరోనా మహమ్మారి ఆ యువకుడి కలలపై నీళ్లు చల్లింది. ఉద్యోగాని ఎంపికయ్యాడన్న వార్త తెలీనీకుండానే అతన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల అవినాష్‌కు చిన్నప్పటి నుంచి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో(బీపీఎస్సీ) ఉద్యోగం సాధించాలని కల ఉండేది. దాని కోసం రేయి పగలనకుండా కష్టపడి చదివాడు. బిటెక్ పూర్తి చేసి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజనీర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ తీసుకొని మరీ పరీక్షలు రాశాడు. అయితే పరీక్షలు రాసిన అనంతరం అవినాశ్ కరోనా బారిన పడ్డాడు. కొన్నిరోజుల పాటు డాక్టర్ల సలహాలతో ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే, డిశ్చార్జ్ అనంతరం అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో గత నెల(జూన్) 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృత్యువాత పడ్డాడు. అయితే, జూన్ 30 వ తేదీన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెల్లడించిన ఫలితాల్లో అవినాశ్.. డిప్యూటీ కలెక్టర్(డీసీ) లేదా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) స్థాయి ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. అయితే అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన కల సాకారమైందని సంతోషించడానికి అవినాశ్ లేడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగ ఫలాలు అనుభవించేందుకు తమ బిడ్డ లేడని గుండెలు పగిలేలా ఎడుస్తున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో స్టేట్ సెకెండ్ ర్యాంకర్ అయిన అవినాష్.. క్యాంపస్ సెలక్షన్‌లోనే భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు బంధువులు వెల్లడించారు. -
చనిపోయిన తమ్ముడి సర్టిఫికేట్లతో ఘరానా మోసం..చివరికి
జమ్మూ కాశ్మీర్: చనిపోయిన సోదరుడి సర్టిఫికేట్లను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అన్న బండారం బయట పడింది. దెబ్బతో ఉద్యోగం పోవడమే గాక జైలు పాలైయాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శక్తి బంధు అలియాస్ కాకా జి జమ్మూలోని పోని చాక్ వద్ద నివసిస్తున్నాడు. నిందితుడు గత 30 ఏళ్లుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఐఎంపీఏ) సంస్థలో పని చేస్తున్నాడు. అయితే సదరు వ్యక్తి తొమ్మిదో తరగతి కూడా పాస్ కాకపోయినా చనిపోయిన తమ్ముడి సర్టిఫికేట్లతో, ఇతర అర్హత పత్రాలను సమర్పించి ఎంపీఏ సంస్థ నందు ఉద్యోగం సంపాదించాడు. ఇన్నాళ్ల తరువాత అతని బండారం బయట పడింది. దీంతో ప్రస్తుతం ఐపీసీ లోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి శక్తి బంధుని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో బంధు మరణించిన సోదరుడి సర్టిఫికేట్లను ఉపయోగించి ఐఎంపీఏలో ఉద్యోగంలో చేరాడని రుజువు అయ్యింది. ( చదవండి: జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు ) -
తన కల కోసం కూలీగా మారింది!
తల్లే కూలి పనిచేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. అమ్మే పక్కన నిలబడితే ఏ కూతురి కలైనా తీరకుండా ఉంటుందా?! ఒక కలగంటోంది అనూరాధ. కేయేఎస్ ఆఫీసర్ అవాలి తను! ‘నో’ నువ్వు ఆ కల కనేందుకు లేదు. నీ పెళ్లి గురించి కలగను’ ఆనేశాయి ఆమె ఇంటి పరిస్థితులు. అయితే పరిస్థితుల్నే మార్చుకోవాలని నిశ్చయించుకుంది అనూరాధ. ‘‘ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోకూడదు’’ అని తీర్మానించుకుంది. ఆమె కంటున్న కేయేఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కలకు పేదరికం మరో అవాంతరం అయింది. తనూ సంపాదిస్తేనే ఇంటికి ఇన్ని తిండి గింజలు. కలను పండించుకోడానికి పొలానికి వెళ్లింది. వ్యవసాయ కూలీగా నాలుగు రాళ్లు సంపాదిస్తూ, మిగతా సమయంలో కేయేఎస్ కు ప్రిపేర్ అవుతోంది. ఇరవై రెండేళ్ల అనూరాధ పోస్ట్ గ్రాడ్యుయేట్. పీజీ చేసి, కూలి పనికి వెళ్లేందుకు ఆమె ఏమీ సిగ్గుపడటం లేదు. పొలం నుంచి తిండి గింజలకు మాత్రమే అనూరాధ సంపాదించుకు రావడం లేదు. కొన్ని బుక్స్ కొనాలి. ఖరీదైనవి. కోచింగ్ కూడా అవసరం. ఆ ఖర్చుల కోసం కూడా పొలం పనులు చేస్తోంది. తలపై ఎర్రటి ఎండ. కనురెప్పల మాటున తను కంటున్న కల. కలే ఆమెకు ఆ ఎండలో చల్లదనం, శక్తీ! అడవి అంచుల్లో ఉంది ఆమె గ్రామం. మైసూరు జిల్లా, హెమ్డి కోటె తాలూకాలోని తిమ్మనహోతలహళ్లి. గ్రామంలా ఉండదు. గిరిజన గూడెంలా ఉంటుంది. అక్కడొక చదువుల పువ్వు పూసిందంటే ఏ అండా, ఆశా లేకుండా తనకై తను వికసించిందనే! అలాంటి విద్యాకుసుమం అనూరాధ. తండ్రి లేడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. ఆస్తి లేదు. డబ్బు లేదు. తల్లే కూలి పని చేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. తల్లి మద్దతుతో కేయేఎస్ ప్రిలిమ్స్ పాసైనంతగా సంబరపడింది అనూరాధ. అయితే ఆ అమ్మాయి కేయేఎస్ ఆఫీసర్ అవాలని అనుకుంటున్నది తన కోసమో, తల్లి కోసమో కాదు. గిరిజన గూడేల్లో తనలాంటి ఆడపిల్లలు, ఇంటి బరువు బాధ్యతల్ని తమరొక్కరే మోస్తున్న తల్లులు ఇంకా ఉన్నారు. వారికోసం ఏమైనా చేయాలని అనుకుంది. పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని చదివించే ఆఫీసర్‌గా, వారి తల్లిదండ్రులకు నమ్మకమైన ఒక ఉపాధిని కల్పించగల అధికారిగా తను ఎదగాలని అనుకుంది. ఆ అనుకోవడం లోనే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి పొలం పనులకు వెళ్లి రావడంలోనే పి.ఇ.టి.సి.కి దరఖాస్తు చేసే గడువు తేదీ దాటిపోయాక గానీ ఆమెకు తెలియలేదు! ఐయ్యేఎస్, కేయేఎస్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమమే పి.ఇ.టి.సి. ప్రీ–ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్. సాంఘిక సంక్షేమ శాఖ ఉచితంగా ఈ శిక్షణను ఇస్తుంది. ఆన్లైన్లో ప్రాసెస్ అంతా నడవడంతో దరఖాస్తు సమాచారాన్ని సమయానికి చూడలేకపోయింది అనూరాధ. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు బస వసతి కాకుండా, కేవలం శిక్షణకే 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కూలి పనితో కూడబెట్టగలిగింది కాదు. ఇంకో పని కూడా వెతుక్కోవాలని అనూరాధ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేయేఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అనూరాధ కష్టపడటం అసాధారణమైన విషయమే అయినప్పటికీ అనూరాధ వంటి ఒక నిరుపేద గిరిజన యువతి అసలు పీజీ చేయడం కూడా కేయేఎస్ ఆఫీసర్ అయినంత ఘన విజయమేనని శైలేంద్ర కుమార్ అంటున్నారు. గిరిజన సామాజిక కార్యకర్త అయిన శైలేంద్ర ప్రస్తుతం అనురాధ కోచింగ్ కోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం. పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్‌మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది. -
ప్లాస్మా దాతలకు అస్సాం శుభవార్త
గువాహటి : ఈశాన్య రాషష్ట్రం అస్సాంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. ప్లాస్మాదాతలు కరువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించే విధంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా దాతలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గౌహతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మమాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధిస్తే మొదటగా ప్లాస్మా దాతకే ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రభుత్వం ఆఫర్) ప్రతీ ప్లాస్మా దాతకు ఓ సర్టిఫికేట్ అందిస్తామని.. తద్వారా భవిష్యత్తులో వారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి కూడా రావచ్చని అస్సాం ప్రభుత్వం వారికి స్వాగతం పలుకుందని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడంతో పాటు వారిని ప్రత్యేక అతిథిగా చూసుకుంటామని పేర్కొన్నారు. రాష్ర్టంలో అతి త్వరలోనే వర్చువల్ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమవుతుందని సిల్చార్, దిఫు, దిబ్రుగ సహా 6 ప్రాంతాల్లో ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గువాహటిలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇటీవల గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రోగులకు ప్లాస్మా చికిత్సనందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,754కు చేరుకోగా 12,888 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన) -
ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
పట్నా: ఈ నెల 15న గల్వాన్ వ్యాలీలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం చేసేందుకు బిహార్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాటి ఘర్షణలో అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన అమర జవాన్ల కుటంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును బిహార్ క్యాబినేట్ ఆమోదించింది. చైనాతో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణకు చెందిన కల్నల్ బి సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సంతోష్‌బాబుతో పాటు నాటి ఘర్షణలో చనిపోయిన మిగతా జవాన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ. 10లక్షల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. (వాజ్‌పేయి చాణక్యం.. చైనాకు గుణపాఠం) -
అడుగులెన్నయినా అవలీలగా
ఆమె పేరుకి చిన్నకూతురు... కానీ, వారి ఇంటికి ఆమె పెద్ద దిక్కు. చదువులో సోదరుడికి దక్కిన ప్రోత్సాహం ఆమెకు దక్కలేదు. అయినప్పటికీ కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతేకాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎంత పెద్ద టవరైనా అవలీలగా ఎక్కుతూ.. అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది ‘ట్రాన్స్మిషన్ టవర్ రాణి’ సీత. సీతా బెహెరా స్వస్థలం ఒడిశాలోని సోరన్ గ్రామం. వారి ఇంటిలో చదువుకున్నది కేవలం ఇద్దరే. ఒకరు ఆమె సోదరుడు. రెండు సీత. నలుగురు తోబుట్టువులలో చిన్నది. అయితే అత్యంత ధైర్యవంతురాలు. అన్ని పనుల్లోనూ ముందుండేది. అలాగే చదువులోనూ.. సోదరుడి పుస్తకాల సహాయంతో గ్రామంలోని పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసింది. సాధారణంగా అబ్బాయిల చదువుకు ఇచ్చే ప్రోత్సాహం అమ్మాయికి ఉండదు. సీతకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉన్నత చదువులకు తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. దీంతో కష్టపడి చదివి, దేశంలో రెండో అతిపెద్ద (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఐటీఐలో ఉచిత ప్రవేశ అవకాశాన్ని సాధించింది. ఎటువంటి ఖర్చు లేకపోవడంతో సీత పై చదువులకు వారు సమ్మతించారు. ఈ విధంగా గ్రామంలోనే పైచదువులు చదువుతోన్న మొదటి మహిళగా మారింది. గేలి చేసేవారు సీత కళాశాల యూనిఫాంలో భాగంగా ప్యాంటు, చొక్కా ధరించేది. ఎందుకంటే అక్కడ ఎక్కువ అబ్బాయిలే చదువుకుంటారు. దీంతో ‘అంతమంది అబ్బాయిల్లో ఎలా చదువుతోందో ఏమో’నని కొందరు జాలిగా చూస్తే... కొంతమంది ఆకతాయిలు ’ఐటీఐ..ఐటీఐ’ అంటూ గేలి చేసేవారు. అయితే సీత అవేమీ పట్టించుకోలేదు. కోర్సు పూర్తిచేసి, గ్రామంలో మరో రికార్డును సొంతం చేసుకుంది. అదే గ్రామంలోని మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగి. ఒడిశా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో ఎల్రక్టీషియన్ ఉద్యోగం సంపాదించి సత్తా చాటింది. ప్రస్తుతం సీతే ఆ కుటుంబానికి ఆధారం. అక్కల పెళ్లిళ్ల బాధ్యతలను కూడా తీసుకొని కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అంతేకాదు, ఆడపిల్లే అయినా కర్తవ్య నిర్వహణలో దేనికీ వెనకాడదు. 30 అడుగుల టవర్నైనా సునాయాసంగా ఎక్కి పని పూర్తిచేసేది, సీత ధైర్యసాహసాలను గుర్తించిన ఒడిశా నైపుణ్య అభివృద్ధి అథారిటీ ‘ట్రాన్స్మిషన్ టవర్ రాణి’గా ప్రశంసించి, సత్కరించింది. కాలేజీకి కృతజ్ఞతలు ‘‘నా ఈ విజయానికి ప్రధాన కారణం నా కళాశాల యాజమాన్యమే. నా మొత్తం కోర్సును వాళ్లే స్పాన్సర్ చేశారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కూడా మినహాయించారు. వీటితోపాటు వివిధ రకాల మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి నాకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఇందుకు మొదట కాలేజీకి కృతజ్ఞతలు’’ అని సీత చెప్పింది. – కొండి దీపిక -
ఈ సర్కార్ నౌకరీ మాకొద్దు!
పెద్దపల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సంపాదించామన్న ఆనందాన్ని చాలా మంది ఉద్యోగులు నిలుపుకోలేక వాటికి రాజీనామాలు చేసి ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పదవులను ప్రభుత్వం భర్తీ చేయడంతో అర్హత గల వారంతా ఆయా ఉద్యోగాలను దక్కించుకున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అమలయ్యే నిబంధనలు కఠినతరంగా ఉండడం, విధులు నిర్వహణలో ఒత్తిడి అధికం కావడంతో వాటిని వదులుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 263 పంచాయతీలు ఉండగా, ఇందులో 57 మంది రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీటికి తోడు 198 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. అందులో 20 మంది పంచాయతీ కార్యదర్శులు తమ అవసరాలను బట్టీ పదవులను వదులుకుంటున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రాజీనామా లేఖలను సమర్పించారు. ఆన్లైన్ అనుమతులతో అవస్థలు.. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ పద్ధతినే అనుమతులు ఇవ్వాల్సి ఉండడం కూడా ఇబ్బందులకు కారణంగా పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ జనాభా కొత్తగా ఇళ్లు నిర్మించే స్థలం తదితర వివరాలకు అనుగుణంగా ఆన్లైన్లో అనుమతులను ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయమై జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా చేరిన తమకు అవగాహన పెంచేలా శిక్షణ తరగతుల ను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నా రు. గ్రామంలో వార్డుసభ్యుడు మొదలు సర్పం చ్, ఎంపీటీసీతోపాటు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు తమ తమ అవసరాల నిమిత్తం పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని పెంచి తాము చెప్పినట్టే మసులుకోవాలని హుకూం జారీ చేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామాలు.. పంచాయతీరాజ్ కొత్త చట్టం అమలుతో బాధ్యతలు పెరగడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడిలు విపరీతంగా పెరగడంతో ఈ ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం చూసుకోవడం మేలంటూ కుటుంబీకుల నుంచి సూచనలు అందుతున్న కారణంగానే పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో అనేక రకాల సమస్యలు, సవాళ్లు ఒకేసారి చుట్టు ముట్టుతుండడంతో వాటిని తట్టుకోలేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ స్రవంతి ఉదంతమే ఇందుకు నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు. 20 మంది కార్యదర్శుల రాజీనామా... జిల్లాలో పంచాయతీ కార్యదర్శులుగా చేరిన వారిలో 20 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారిలో చాలా మంది ఇతర శాఖల్లో ఉద్యోగాలు రావడంతో పనిభారం అధికంగా ఉండడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి మండలంబ్రాహ్మణపల్లి, పెద్దబొంకూరు గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ఎలిగేడు మండలంలోని లాలపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం చినరాత్పల్లి, సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి, మంథని మండలం గోపాల్పూర్, నాగెపల్లి, అక్కెపల్లి, కన్నాల, ముత్తారం మండలం దర్యాపూర్, కమ్మంపల్లి, ఓదెల మండలం గుంపుల, గుండ్లపల్లి, కొలనూర్, పాలకుర్తి మండలం జయ్యారం, రామగిరి మండలం సుందిళ్ల, చందనాపూర్, ఆదివరంపేటకు చెందిన కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. శిక్షణ ఇవ్వకుండానే విధులా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చి వాటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులకే కట్టబెట్టడం సమంజసం కాదని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కొత్తగా విధుల్లో చేరిన తమకు తమ విధులు, బాధ్యతల గురించి ఏమాత్రం అవగాహన లేదని, తమకు వృత్యంతర శిక్షణను ఇప్పించి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసం ధాన కర్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలతోపాటు ఉన్నతాధికారులు కూడా తమనే బాధ్యులుగా చేస్తుండడంతో విధి నిర్వహణలో తాము ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. -
మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరు చేసిన మెడికల్ కళా శాలలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళాశాల భవన ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులను పూర్తి చేసిన అధికారులు పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 237 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాలలో 32 విభాగాలు.. మెడికల్ కళాశాలలో 32 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో అటానమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్ఎం, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్‌హెచ్‌టీసీ, యూహెచ్‌టీసీ, సైకియాట్రి, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఓపీటీహెచ్, ఓబీజీ, రేడియో డయాగ్నొస్టిస్, అనస్తీషియా, బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ రికార్డ్, సెంట్రల్‌లైబ్రరీ, మెడికల్ ఎడ్యుకేషన్,సెంట్రల్ ఫొటోగ్రఫిక్ కమ్ ఆడియో విజువల్, సీఎస్ఎస్డీ, లాండ్రీ, సెంట్రల్ వర్క్‌షాప్, హాస్పిటల్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ఈఎండీ, మార్చురి, ప్రిన్సిపాల్ ఆఫీస్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీసుల్లో పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు భర్తీ చేయడానికి జీఎఎంఎస్ నం.77ను ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. దీనికి అవసరమైన అన్ని అనుమతులను ఆర్థికశాఖ నుంచి పొందింది. ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయనున్న పోస్టులు ఔట్సోర్సింగ్ పద్ధతిని నియమించే పోస్టుల్లో ముఖ్యంగా డిసెక్షన్ ఆల్ అటెండెన్స్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెన్స్, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, రికార్డు కీపర్, ఆఫీస్ సబార్డినేట్, వ్యాన్ డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్, డార్క్‌రూం అసిస్టెంట్స్, బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్స్, స్టోర్ కీపర్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్, బుక్ బేరర్, హెడ్ దోబీ, దోబీ, ప్యాకర్, కార్పెంటర్స్, బ్లాక్‌స్మిత్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్ ఫోర్మన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, ఏసీమెకానిక్, మాలి, మానిఫోల్డ్ సూపర్వైజర్, టెలిఫోన్ ఆపరేటర్స్, గ్యాస్ ఆపరేటర్స్, స్ట్రెచర్ బేరర్స్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, వార్డు బాయ్స్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి భర్తీకి త్వరలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు టెండర్లకు కాల్ ఫర్చేసి ఫోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టుల భర్తీకి జరిగే టెండర్లలో పాల్గొనడానికి అనేక ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జూన్‌లో పోస్టుల భర్తీకి అవకాశం.. జూన్‌లో ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు మెడికల్ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభించే అవకాశం ఉండడంతో అంతకు ముందుగానే పోస్టులు భర్తీ చేయనున్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. -
ప్రభుత్వ పరీక్షల సక్సెస్ ‘అడ్డా’ 247
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి లక్ష్యం. కానీ, సాధించేది కొందరే! నిరంతర అభ్యసనం, అదృష్టం రెండూ ఉంటే తప్ప అవి దరిచేరవు. అలాంటిది పాకెట్ మనీ ఖర్చు చేసినంత సులువుగా గవర్నమెంట్ జాబ్‌ను సాధించేలా చేస్తుంది అడ్డా 247. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో 35 వేలకు పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల బాట వేసింది. మరిన్ని వివరాలు కో–ఫౌండర్ అనిల్ నగర్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ధన్‌కౌర్ అనే కుగ్రామం. ఐఐటీ చదవాలన్నది నా కల. కానీ, మా గ్రామంలో సరైన శిక్షణ సంస్థలు, గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేరు. దీంతో చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా ఐఐటీలో సీటు సంపాదించాలని ఢిల్లీకి వెళ్లి కోచింగ్ సెంటర్లో చేరా. ఫలితంగా 1988లో వెయ్యి ర్యాంక్‌తో ఐఐటీ బనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేరా. చదువుతున్న సమయంలో నాకర్థమైనదేంటంటే.. ఉన్నత చదువు కోసం నాలా చాలా మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మెట్రో నగరాలకు వలస వస్తున్నారని! దీనికి పరిష్కారం చూపించేందుకే 2010లో మరొక స్నేహితుడు సౌరభ్ భన్సల్‌తో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్ కెరీర్ పవర్‌ను ప్రారంభించా. 2016లో దీన్ని అడ్డా 247గా పేరు మార్చి ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టాం. త్వరలో యూపీఎస్సీ, సీటీఈటీ, ఎన్డీఏ ప్రస్తుతం అడ్డా 247లో బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్ఎస్సీ) రెండు రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షల్లో శిక్షణ అందిస్తుంది. వీడియో కోర్సులు, ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు, ఈ–పుస్తకాలు, ప్రాక్టీస్ మెటీరియల్స్, సందేహాల నివృత్తి వంటి 360 డిగ్రీల్లో సేవలందిస్తుంది. వీటి ధరలు రూ.400 నుంచి రూ.12 వేల వరకుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి సెంట్రల్ యూపీఎస్సీ, టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటీఈటీ), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల సిలబస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 60 ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్లున్నాయి. 30 కోట్ల వీడియో క్లాస్‌లు.. ప్రస్తుతం అడ్డా 247లో 4 కోట్ల మంది యూజర్లున్నారు. ఇందులో 4 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఇప్పటివరకు 30 కోట్ల వీడియో క్లాస్‌లు, 1380 కోట్ల మాక్ టెస్ట్‌లను నిర్వహించాం. రోజుకు 50 లక్షల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల మంది పెయిడ్ యూజర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఇప్పటివరకు 35 వేల మందికి పైగా అభ్యర్థులు వివిధ ప్రభుత్వ పరీక్షల్లో ఎంపికయ్యారు. హైదరాబాద్ టాప్.. భౌతిక కోచింగ్ సెంటర్లలో 25–26 శాతం మార్జిన్లు ఉంటే.. ఆన్లైన్ కోచింగ్‌తో 50 శాతం వరకు మార్జిన్లుంటాయి. మా మొత్తం యూజర్లు, వ్యాపారంలో హైదరాబాద్ టాప్‌లో ఉంది. ఇక్కడి నుంచి 37 లక్షల మంది యూజర్లున్నారు. మా మొత్తం ఆదాయంలో 10 శాతం వాటా నగరానిది. ఆ తర్వాత పాట్నా, ఢిల్లీ, లక్నోలది. ఐదేళ్లలో రూ.1,000 కోట్లకు.. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.51 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. 2019–20 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.100 కోట్లకు, వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 250 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలోనే పెట్టుబడులను పొందనున్నాం. ఒకట్రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని’’ అనిల్ వివరించారు. -
చేత కాకపోతే చెప్పండి: ఏషియన్ గేమ్స్ విజేత
సాక్షి, లక్నో: క్రీడాకారులు పతకాలు సాధించిన వెంటనే.. ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తాయి. కొద్ది రోజులపాటు మీడియాలో హడావుడి చేసి, కావాల్సిన పబ్లిసిటి వచ్చాక అసలు విషయాన్ని మరిచిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, నగదు కోసం క్రీడాకారులు పోటీల్లో పరుగులు తీసినట్టు ఆఫీసుల చుట్టు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఎదురైంది. ఆసియా గేమ్స్ 2018లో రజతం సాధించిన ఈ క్రీడాకారిణికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముప్పై లక్షల నగదుతో పాటు, క్రీడా శాఖలో అత్యున్నత ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సుధాకు 30 లక్షల చెక్‌ను అందచేయగా.. ఆమె తిరస్కరించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని ఉద్యోగమని సభా వేదికగా డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు, యోగి బుజ్జగించాక చెక్ తీసుకున్నారు. కానీ ఉద్యోగం ఇవ్వకపోతే చెక్ వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. గతంలో కూడా.. 2015లో కూడా అప్పటి ప్రభుత్వం క్రీడా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సీఎంను మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహించారు. తాను రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర క్రీడా శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని, యువ ఆటగాళ్లకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. క్రీడాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన నగదును యువ క్రీడాకారుల శిక్షణ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఇవ్వడం సాధ్యం కాకపోతే చెప్పండి.. తనకు క్రీడా శాఖలో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబితే తను వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటానని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించబోనని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్, ఆసియన్ గేమ్స్‌లో బంగారు, రజత పతకాలు, అర్జున అవార్డు సాధించిన తాను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చదవండి: సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు వద్దు!
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006(నాగరాజు కేసులో) వచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం లేదంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని ప్రకటించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ కోటాపై ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006లో ఎమ్ నాగరాజు కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం డేటా సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది -
అర్హత సాధించినా ఉద్యోగమివ్వరా?
ఖమ్మం సహకారనగర్: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగానికి తాను అర్హత సాధించినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన జాగటి సాంబయ్య కోర్టులో అటెండర్ ఉద్యోగానికి 2012లో దరఖాస్తు చేశాడు. అయితే, అతడికి ఉద్యోగం రాలేదు. కానీ, సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. తాను రెండో సా ్థనంలో ఉండగా, మొదటి, మూడో స్థానంలో ఉన్న వారికి అటెండర్ ఉద్యోగం కల్పించారని తేలింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు ప్రజావాణికి వచ్చాడు. దీంతో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారులు, కలెక్టర్లు గన్మెన్లు అతడిని అడ్డుకుని బయటకు పంపించారు. -
సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం
లక్నో: వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనుంది. 32 ఏళ్ల సుధా... సోమవారం 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం నెగ్గింది. దీంతో ఆమెకు రూ.30 లక్షల ప్రోత్సాహక నగదుతో పాటు గెజిటెడ్ హోదాతో కొలువు ఇవ్వనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే, దీనిపై సుధా సింగ్ ఒకింత నిర్వేదంతో స్పందించింది. ‘నాకెలాంటి సంతోషమూ, నిరుత్సాహమూ లేదు. 2010 ఏషియాడ్‌లోనే స్వర్ణం గెలిచాను. ఆసియా చాంపియన్‌షిప్‌లలో కూడా పతకాలు నెగ్గాను. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించాను. ఈ ఉద్యోగం ఇంతకుముందే రావాల్సింది. క్రీడా కోటాలో నియామకానికి సంబంధించి నాలుగేళ్లుగా నా ఫైల్ అపరిష్కృతంగా ఉంది. అప్పుడు కాకున్నా, ఇప్పుడు ఇవ్వడం కొంతలో కొంత ఉపశమనం. క్రీడా శాఖలో మాత్రమే ఉద్యోగం చేస్తా. ఇతర శాఖల్లో చేయను’ అని పేర్కొంది. సుధా ప్రస్తుతం రైల్వే శాఖ ఉద్యోగి. 2015లో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉంది. దీనిపై మూడుసార్లు నాటి సీఎంను కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె సోదరుడు పర్వేష్ తెలిపాడు. -
ఈ–కుబేర్ కాదు.. ఈ–కుదేల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భరోసా. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతినెలా మొదటి రోజు వేతనాలు వస్తాయనే నమ్మకం. అయితే, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేసేందుకు అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ వ్యవస్థలోని సాంకేతిక సమస్యలు కొందరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారాయి. ఆగస్టు నెల ముగింపునకు వచ్చినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వేతనాలు అందని వారంతా ట్రెజరీ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీ అధికారులు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన వివరాలను సరి చూస్తూ పరిష్కరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను ముగించే ప్రక్రియ ఆలస్యమవు తుండటంతో నెల ముగిసే సమయానికి కూడా అందరికీ వేతనాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ఆగస్టు నెల వేతనాలను చెల్లించే ప్రక్రియ మొదలైంది. సాంకేతిక సమస్యలతో ఆగస్టులో వేతనాలు అందని వారికి, సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ–కుబేర్ కొత్త విధానంలో సాఫ్ట్‌వేర్‌తో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సరిపడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నుంచే... ఉద్యోగుల వేతన చెల్లింపు ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఆర్బీఐ కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ విధానాన్ని దీనికి వర్తింపజేశారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఆర్బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ఒకటో తేదీ ఆదివారం అయినా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. సాంకేతిక సమస్యలు మొదట 2.56 లక్షల మంది పెన్షనర్లకు అమలుచేసిన ఈ–కుబేర్ విధానాన్ని ఆగస్టు ఆరంభం నుంచి ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. మొదట అందరు ఉద్యోగుల ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేసి పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ నంబర్లు తప్పుగా ఉండడంతో వారికి ఈ మొత్తం జమ కాలేదు. ఇలాంటి వాటిని సరిచేసి ఆగస్టు 1న వేతనాలు జమ చేశారు. అయితే ఒక రూపాయి జమ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినా, పూర్తి వేతనాలు ఇచ్చినప్పుడూ ఇదే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పది శాతం మంది ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. ఉద్యోగుల వేతన బిల్లులను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) దశలవారీగా ఆన్లైన్ ద్వారా ఈ–కుబేర్‌కు పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ నెలలో వేతనాలు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా రిజెక్టయిన వారు ఒక్కొక్కరుగా వెళ్లి ట్రెజరీ అధికారులకు విజ్ఞప్తులు చేయడంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి వేతనాలు ఖాతాకు జమచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ఇదే సమస్య రావడంతో పరిష్కారంకోసం ఎక్కువ రోజులు పడుతోంది. - ఈ–కుబేర్ విధానంలో ఒకవ్యక్తికి సంబం ధించిన డబ్బులు ఒకే ఖాతాలో జమ అవుతా యి. ఒక ఉద్యోగికి ఒకటికంటే ఎక్కువ బ్యాం కు ఖాతాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది న వ్యక్తికి వేతనం ఒక బ్యాంకు ఖాతాలో, పెన్షన్ మరో ఖాతాలో జమవుతుంది. - పోలీసు శాఖలో విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బందికి వారి రిటైర్మెంట్ వయస్సు వరకు పూర్తి వేతనం అదే ఖాతాలో జమ అవుతుంది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుడు ఉద్యోగం పొందితే ఆ వేతనం వేరే ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు వస్తున్నాయి. -
సర్కార్ కొలువుకి గవర్నర్ సిఫార్సు.. రచ్చ
అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత రోయ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి బీజేపీ నేత పేరును ఆయన సిఫార్సు చేశారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సర్వదామన్ రాయ్‌కు అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పించాంటూ కోరుతూ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు స్వయంగా గవర్నర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు రావటంతో తీవ్ర దుమారం చెలరేగింది. ‘సర్వదామన్తో నేను బీజేపీలో పని చేశా. ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్‌లో నిపుణులు. పలు ప్రముఖ కంపెనీలో పని చేశారు. ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని భావిస్తున్నా’ అని తథాగత రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ బయటకు పొక్కటంతో అసలు వ్యవహారం మొదలైంది. ప్రతిపక్ష సీపీఎం.. గవర్నర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఈ లేఖ గురించి తెలీదని చెబుతుండగా.. సీఎం కార్యాలయం మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది. చివరకు తథాగత రోయ్ ట్వీటర్లో స్పందించారు. ‘ఆ లేఖను నేనే రాసింది. ఓ ఉద్యోగం కోసం సత్ప్రవర్తన కింద ఆ లేఖ ఇచ్చాను. ఆ మాత్రం దానికే కొలంబస్ అమెరికాను కనిపెట్టి మీరు భావిస్తున్నారు. అలాగైతే మిమల్ని మీరు వెధవలను చేసుంటూ ముందుకు సాగినట్లే’ అంటూ ఓ ట్వీట్లో ఆయన చురకలంటించారు. ఇక ఈ లేఖపై కథనాలు ప్రసారం చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్‌పైనా ఆయన మండిపడ్డారు. కాగా, తథాగత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఆయన ఓ గవర్నర్ మాదిరి కాకుండా.. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ సీపీఎం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. Of course I wrote that letter! It isn’t even confidential because it is a normal recommendation for a perfectly bona fide purpose. But,as I said,if you are feeling the way Columbus felt on discovering America,go ahead and make bigger fools of yourselves — Tathagata Roy (@tathagata2) 28 April 2018 -
ఆర్మీలో ఐదేళ్లు చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణరంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిటీ తెలిపింది. ఈ సమస్య తీవ్రతను రక్షణశాఖ డీవోపీటీ దృష్టికి సరిగ్గా తీసుకెళ్లలేకపోయిందని ఆక్షేపించింది. ప్రస్తుతం భారత ఆర్మీలో 7,679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్డ్ అధికారులు, నేవీలో 1,434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. -
ఒకే సంవత్సరంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు
చిత్తూరు, మదనపల్లె:మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రమణ, సావిత్రి దంపతులకు శిరీషా, జ్యోత్స ఇద్దరు కుమార్తెలు. రమణ వ్యవసాయం చేస్తుండగా, సావిత్రి నిమ్మనపల్లెలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె శిరీషా. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో మెరిక. ఈ క్రమంలో ఎంటెక్ పూర్తి చేసింది. అదే ఏడాది ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి, ఉద్యో గం సాధించింది. మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తోంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు 2017లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన అన్ని ఉ ద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసింది. ఫిబ్రవ రి, ఏప్రిల్‌లో రాసిన పరీక్షల్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ విభాగాల్లో ఏఈ పోస్టులు, జెన్కో ఏఈ గా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా 2018 జనవరిలో జరిగిన గ్రూప్స్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. జన్మభూమిపై మమకారంతో.. కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జిల్లా అధికారిగా నెలపాటు ఉద్యోగం చేసిన శిరీషా జన్మభూమిపై మమకారంతో ఆ ఉద్యోగాన్ని వ దులుకుని, మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్వి రాన్మెంట్ ఏఈగా పనిచేస్తోంది. మా నాన్నే నాకు స్ఫూర్తి.... ఆడపిల్లల చదువులకు ఎందుకు అన్న బంధువులు మాటలు వినకుండా, పిల్లలే నా సర్వస్వం అనుకున్నాడు మా నాన్న. మా ఉన్నతి చూసి మురిసిపోయిన మా నాన్నే నాకు స్ఫూర్తి. – శిరిషా -
అభాగ్యులకు అభయం
వాడి విడిచిన దుస్తులకు అతుకులు వేయడం. వేకువజామున నమాజ్‌కు వెళ్లే వేళ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి దానం చేయడం. తండ్రి చేస్తున్న ఈ సేవ నా మనసులో ముద్రవేసుకుపోయింది. ఆయన స్వేదంతో కష్టిస్తూనే నేను డిగ్రీ పూర్తి చేశాను. ఆ తరువాత వివాహం. అంతే నా మనసు అంతరాల్లో ఉన్న మాధవసేవకు పుల్‌స్టాప్ పడిందనుకున్నా. భర్తతో చెబితే కాదనకుండా భుజం తట్టి ప్రోత్సహించారు. పీజీ చేశా. అదే స్ఫూర్తితో సైకాలజీ, ప్రత్యేక ప్రతిభావంతులపై పీహెచ్డీ చేసి బంగారు పతకం సాధించా. ఆ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా నాలో ఏదో వెలితి. రెండేళ్లలోనే ఉద్యోగానికి రాజీనామా చేశా. అమెరికాలో ఉన్న నా స్నేహితులు నన్ను అక్కడికే పిలిపించుకోవాలనే చూశారు. డాలర్స్‌పై నాకు డ్రీమ్స్ లేవనే చెప్పాను. సమయం రానే వచ్చింది. శారీరక, మానసిక వికలాంగులనే చేరదీసి వారికి అమ్మను అయ్యాను. వారి సేవలో ఉన్న సంతప్తి మరెక్కడా లేదని అభయ క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎస్ఏ.తస్లీమ్ తన భావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దిగాలు అనిపించింది... డిగ్రీ తరువాత రైల్వే ఉద్యోగి సయ్యద్ లతీఫ్‌తో వివాహం జరిగింది. మా చిన్ననాటి నుంచి నాన్న చేసిన సేవలు మదిలో మెదలగానే సేవ చేయాలనే ఆలోచనకు పులుస్టాప్ పడిందని అనిపించింది. కొంతకాలం తరువాత చదువుకోవాలనే నా కోరికను గౌరవించిన నా భర్త లతీఫ్ ప్రోత్సాహంతో చిన్న పనులు చేస్తూనే సైకాలజీలో పీజీ చేశా. ప్రపంచంలోని అసాధారణ ప్రతిభావంతులపై చేసిన పీహెచ్‌డీకి బంగారు పతకం వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నేనే ఎస్వీయూలో ఫస్ట్ ర్యాంక్ సాధించా. డాలర్‌డ్రీమ్స్.. డిగ్రీ నుంచి నాతో కలిసి చదువుకున్న అమ్మాయిల్లో నా స్నేహితులు దాదాపు 20 మంది వరకు అమెరికాలో ఉన్నారు. ‘నీ తెలివికి, ప్రతిభకు ఇక్కడ ఊహించని జీతం వస్తుంది’ అని డాలర్లపై మోజు పెంచుతూ అనేక విధాలుగా చెప్పారు. డబ్బు సంపాదనకు అమెరికా వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి కూడా సంపాదించవచ్చు. కానీ నా ఆలోచన వేరు. నాన్న కష్టాల్లో అడుగులు వేయిస్తే, భర్త నడక నేర్పించారు. వారి కష్టం, ప్రోత్సాహం సార్థకం చేయాలనేది నా ముందున్న కర్తవ్యం. ఆ క్రమంలో నా ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలని తర్జనభర్జనల్లో ఉండగానే, డిప్యూటీ డీఈఓగా డిపెప్‌లో వరంగల్ జల్లా హసన్‌పర్తిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ రెండేళ్లు ఉద్యోగం చేశా. కానీ ప్రభుత్వ పరంగా లక్ష్యాలు సాధించడం, జీతం తీసుకోవడం ఇదేమీ నన్ను సంతృప్తి పరచలేదు. అంతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశా. స్వచ్ఛంద సేవలు.. మానసిక, శారీరక వికలాంగుల సేవే మాధవ సేవగా నేను భావించా. నాకున్న అవగాహన, అనుభవం మేళవించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో సేవలు అందించా. ఇక్కడ నేనేమీ ఆశించలేదు. తీసుకోలేదు. సొంతంగా 2003 ఆగస్టు 26వ తేదీ మదర్‌థెరిస్సా పుట్టిన రోజున రేణిగుంటలో అభయ క్షేత్రం ప్రారంభించారు. మానసిక, శారీరక వికలాంగులకు ఇది పునరావాస కేం ద్రం. ముగ్గురితో ప్రారంభించా. ఆ సంఖ్య ప్రస్తుతం 176కు చేరింది. ఎందరో అభాగ్యుల కు ఆశ్రయం ఇవ్వడం, వారికి సేవలు చేయడం ద్వారా ఉన్నత వర్గాలనే కాదు.. పేద మధ్య తరగతి వారిని కూడా కదిలించింది. ఎవరికి తోచిన రీతిలో వారు ఇక్కడ ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సాయం అందిస్తున్నారు. మా కుటుంబీకులూ మమేకం.. వీధిలో వారిని మెప్పించే ముందు ఇంట్లో వారిని కూడా సంతప్తిపరచాలి. ఇది అక్షరాలా సత్యం చేశాననే సంతప్తి నాకు ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన విషయం మీకు చెబుతా. మా పెద్ద అక్క రజియా కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. ఆమె కుమార్తె వివాహానికి ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు ఇక్కడ నా వారందరినీ వదిలి వెళ్లి రాలేనని చెప్పా. ఇందుకు వారు కూడా నిజమే అన్నారు. పెళ్లి పేరుకే అక్కడ నిర్వహించి, రిసెప్షన్ మాత్రం అభయ క్షేత్రంలోని ప్రతిభావంతుల మధ్య నిర్వహించారు. నా కుటుంబ సభ్యులు, అమెరికాలో ఉన్న స్నేహితులను కూడా మెప్పించా. వారందరూ ఏదో ఒక రూపంలో సాయం అందిస్తూనే ఉన్నారు. మానాన్న అజీస్ టైలర్. అమ్మ ప్యారుబీ గృహిణి. రేణిగుంటలో మాది మధ్య తరగతి ముస్లిం కుటుంబం. ఆరుగురం అన్న, తమ్ముడు, అక్కాచెల్లెళ్లం. అన్న మహబూబ్‌బాషా ఇప్పుడు లేరు. రజియా,షాహినా, ముంతాజ్, నేను ఆ తరువాత తమ్ముడు మస్తాన్. మా అందరినీ నాన్న దర్జీ పని చేస్తూనే చదివించారు. అందరూ ఇంటర్, ఆ లోపు చదువుకే పరిమితమయ్యారు. కుమార్తెల్లో నేను చిన్నదాన్ని కావడంతో కాస్త ఎక్కువగానే గారాబం చూపారు. రూ.50 రైలు పాసుతో తిరుపతిలో బీఏ చదివాను. చదువుపై ఉన్న కష్టాలు పెద్దగా బాధించలేదు. ఎందుకంటే మా పరిస్థితి తెలుసు. మా పిల్లలు కూడా.. ఒక విషయం మాత్రం స్పష్టం సార్.. మా కుటుంబానికి పరదాలతో బంధనాలు వేయలేదు. చదువు, సేవలో మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబంలో పడిన కష్టాలు మరిచిపోలేదు. లతీఫ్‌తో నాకు వివాహం అయిన పదేళ్ల వరకు పిల్లలు లేరు. చదువు. ఉద్యోగం. స్వచ్ఛంద సంస్థల్లో సేవలతో కాలం సాగదీశాం. మాకు ఒక కుమారుడు ఉమర్ (9వ తరగతి), కుమార్తె రూబి(ఇంటర్) చదువుతున్నారు. వారిద్దరినీ అభయక్షేత్రంలోని పిల్లల సేవలో మమేకం చేస్తుంటాం. ఎందుకంటే పిల్లలకు ఉగ్గుపాలతో ఏది నేర్పినా, మనసులో ఉండిపోతుందని నమ్ముతాను కాబట్టే. నా తమ్ముడు మస్తాన్ కూడా ఇదే క్షేత్రంలో సేవల్లోనే ఉన్నారు. -
ఇదేమి ఉద్యోగంరా బాబూ!
విజయనగరం గంటస్తంభం: వారికేం ప్రభుత్వ ఉద్యోగం.. ఆఫీస్‌కు ఇలా వెళ్లి అలా వచ్చేస్తే చాలు... నెలయ్యేసరికి జీతం బ్యాంకు ఖాతాలో పడుతుంది.. ఇదీ సాధారణ జనాల్లో ఉద్యోగులపై ఉన్న భావన. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తీసుకున్నది జీతమే అయినా పగలు, రాత్రనకు పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు వెళ్తే రాత్రి 10 గంటలైనా ఇంటికి చేరలేకపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబ జీవనం గతి తప్పి సతమతమవుతున్నారు. సెలవు రోజూ విధులు..! మూడేళ్లగా ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వరుసగా ఏదో ఒక పని చెప్పడం, లక్ష్యాలు నిర్వేశించి పని చేయాలని ఆదేశించడం, గడువులు విధించడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చి నెలాఖరులోగా ప్రటించాలని ప్రభుత్వం లక్ష్యం విధించడం, కలెక్టర్ అంతకంటే ముందే డిసెంబర్ నాటికి చేయాలని అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తేవడంతో అధికారులు సెలవులు, పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారు. ఓ విధొంగా చెప్పాలంటే చేయడం లేదు... అధికారులే చేయిస్తున్నారు. ఆదివారం సెలవు దినమని అందరికీ తెలిసిన విషయమేనైనా ఉదయం టెలికాన్ఫరెన్స్, సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్సు పెట్టడంతో మండల స్థాయి అధికారులు మండలాల్లో గడాపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకరోజూ లక్ష్యాలపై నివేదికలు కోరడంతో పగలంతా గ్రామాల్లో ఉంటున్న అధికారులు రాత్రిపూట నివేదికలు, సాధారణ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 9, 10 గంటల వరకు ఇంటికి చేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులు, సిబ్బందికి సైతం సమయంలో మినహాయింపు లేదు. ప్రస్తుతం గృహనిర్మాణశాఖ అధికారులకు కూడా లక్ష్యాలు విధించడంతో పరుగులు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ, వెలుగు శాఖల సిబ్బంది పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఈ ప్రభుత్వంలో ఇంతే..! తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు సుఖముండదు. ఇదీ సాధారణంగా ఉద్యోగుల్లో నెలకొన్న భావన. 2004కు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఇలాగే రాత్రి పగలు పని చేయించారు. ఫలితంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాస్త సేద తీరారు. అలాగని వారి హయాంలో కూడా ఒత్తిడి లేదని చెప్పలేం. అయితే, అది సాయంత్రం వరకు పని వేళలకు పరిమితమయ్యేది. అయితే, ఏడాదిలో ఎప్పుడో వారం పదిరోజులు మాత్రమే రాత్రి వరకు పని చేయాల్సి వచ్చేది. దీంతో అప్పట్లో ఉద్యోగుల్లో ఇంత వ్యతిరేకత లేదు. అయితే 2014లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కంటే సర్వేలు ఎక్కువ కావడం, పూటకో నివేదిక కోరడం పరిపాటిగా మారింది. అంతా క్షణాలు, రోజులు, నెలల్లో అయిపోవాలని భావించడంతో భారం ఉద్యోగులపై పడుతుంది. తీవ్ర ఆవేదన... ప్రభుత్వం, ఉన్నతాధికారులు వైఖరిపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల విషయంలో టార్చర్ అనుభవిస్తున్నామని ఒక ఎమ్పీడీవో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఉద్యోగులు పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మూడురోజుల కిందట కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ నిరసన తెలిపారు. వ్యవస్థను చూసి బాధగా ఉందని, ఇదేం వ్యవస్థ అని ఒక ఇంజినీరింగ్ అధికారి నిట్టూర్చడం విశేషం. ఇకపోతే అందరూ ఉద్యోగులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాలు విధించడంతో తమ కుటుంబాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కొంచెం ఆలోచించి ప్రభుత్వం విధించిన సమయాల్లో పని చేయించాలని కోరుతున్నారు. -
ఆ మాట...భద్రతకు భరోసా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ ఉద్యోగమంటేనే భద్రత. పింఛన్ వారికొక భరోసా. కానీ 2004 నుంచి అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ శాపంగా మారింది. ఇప్పుడా స్కీమ్‌పై ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. నూతన సంస్కరణలని చెప్పి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాసి, సామాజిక భద్రతను హరించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని గొంతెత్తి అరిచినా పాలకులు పట్టించుకోవడం లేదు. దానిపై రోడ్డెక్కితే అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యోగుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులకు బాసటగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాసటగా నిలిచారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉద్యోగుల కష్టాలను కళ్లారా చూసి, వారి జీవితాలను చీకటి మయం చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఆశలు రేకెత్తించారు. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఒక్కటే ఆందోళన. ఎక్కడికెళ్లినా అదే చర్చ. ఎవరిని కదిపినా అదే ఆవేదన. ఉద్యోగులకు అశనిపాతంగా మారిన సీపీఎస్ విధానాన్ని తలుచుకుని గుబులు చెందుతున్నారు. తమను రోడ్డున పడేసేలా ఉందని గోడు వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ (సీపీఎస్) గుర్తు చేసుకుని మానసిక అశాంతికి లోనవుతున్నారు. పాత విధానమే మేలు... ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కోసం పింఛన్‌ను ఒక హక్కుగా 1982లో న్యాయస్థానం కల్పించింది. దీని ద్వారా సంక్రమించిన పాత పింఛన్ విధానంలో అయితే ఉద్యోగి నుంచి నెల వేతనంలో పైసా చెల్లించనక్కర్లేదు. ఉద్యోగి చివరి నెల వేతనానికి అనుగుణంగా ముందుగానే స్పష్టత వస్తుంది. కనీసం రూ. 6500లకు తక్కువ కాకుండా ఏడేళ్ల సర్వీసులో ఉన్న ఉద్యోగికి 30 శాతం, దాటిన వారికి 50 శాతం వేతనంలో ఉంటుంది. మొండికేస్తున్న సర్కార్ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలు ఆ మధ్య పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాక తలొగ్గినట్టు ప్రభుత్వం కనిపించింది. చనిపోయిన సీసీఎస్ ఉద్యోగి వారసులకు ఫ్యామిలీ పింఛన్ ఇస్తామన్న జీవోను 2017జూలైలో విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగి చనిపోయేంతవరకూ సేకరించిన సొమ్ముకు అంతే మొత్తం ప్రభుత్వం కలిపి ఆ మొత్తానికి పింఛన్ బీమా రూపంలో వేసి పింఛన్ ఇస్తామని చెప్పుకొచ్చింది. ఇది అకాల సమయంలో చనిపోయిన సీసీఎస్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. . అయితే ఈ జీవో విడుదలై నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సరికదా కనీసం విధి విధానాల రూపకల్పన చేయలేదు. దీనివల్ల ఇంతవరకూ చనిపోయిన సిబ్బంది కుటుంబాల జీవితాలు దుర్బరంగా మారాయి. నిజానికి తిరిగి పాత పద్దతిని తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. మధ్యప్రదేశ్ ప్రభ్వుం ఇటీవల సీసీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేసింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోవడం లేదు. ఉద్యోగులకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ ప్రకటన సీపీఎస్ విధానంతో కుంగిపోతున్న ఉద్యోగులకు నేనున్నానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని పాదయాత్ర ప్రారంభంలోనే ప్రకటించారు. దీంతో ఉద్యోగ వర్గాలకు కాసింత ధీమా చేకూరినట్టయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయనా ప్రతిపక్ష నేత స్పందించి, తమకు అండగా నిలిచారని ఉపసమనం పొందారు. ఉద్యోగ సంఘాలన్నీ జగన్ ప్రకటనకు హర్షం వ్యక్తం చేశాయి. సీపీఎస్ అంటే... నూతన సంస్కరణల పేరిట 2004 జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో 2004 నుంచి నియమితులైన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగి తన బేసిక్, డీఏల్లో 10 శాతం చొప్పున ప్రతి నెలా తమ వాటాగా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో 10శాతం జమ చేస్తుంది. పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని అమలు చేస్తుండగా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ రికార్డుల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఉద్యోగి వాటా, ప్రభుత్వం వాటా కలిపి పింఛన్ బీమా పేరుతో షేర్ మార్కెట్లో పెడతారు. రిటైర్ అయిన సమయంలో మార్కెట్ విలువ, సంబంధిత పింఛన్ బీమా నిబంధనల మేరకు పింఛన్ వర్తిస్తుంది. సీపీఎస్‌తో నష్టాలు షేర్ మార్కెట్ ఒడిదొడుకులపైనే పింఛన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. నిర్ణీత మొత్తంలో పింఛన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లు దెబ్బతింటే, వచ్చే పింఛన్ తగ్గిపోతుంది. ఒక్కోసారి అసలేమీ రాకపోవచ్చు. అంటే ఉద్యోగికి పింఛన్ ఎంత మొత్తం వస్తుందో రిటైరైన తర్వాతే తెలుస్తుంది. మధ్యలో అకాల మరణం చెందిన వారి వారసులకు అప్పటికి షేర్ మార్కెట్లో పెట్టిన తక్కువ మొత్తం పింఛన్ బీమా పద్ధతిలో వస్తుంది. చనిపోయిన సీపీఎస్ ఉద్యోగి వారసులకు కారణ్య ఉద్యోగాలు గాని, పింఛన్లు గాని ఇవ్వడం లేదు. ఒకవేళ పింఛన్‌దారుడు చనిపోతే అతనిపై ఆధారపడ్డ భార్య, పెళ్లికాని ఆడపిల్ల, 25 ఏళ్లు నిండని నిరుద్యోగి కుమారుడికి ఎటువంటి పింఛన్ రాదు. అంటే పింఛన్‌దారుడు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండదు. పింఛన్‌తోపాటు గ్రాట్యూటీ రద్దు చేయడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగుల జీవితానికి భద్రత కూడా కొరవడుతుంది. ఈరకంగా రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు లక్షా 73 వేల మంది ఉండగా జిల్లాలోని అన్ని శాఖలు కలుపుకుని 16400 మంది ఉన్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు బాధితులే. 2004 నుంచి అమలవుతున్న సీపీఎస్ విధానంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 223 మంది అకాల మరణం చెందారు. వీరిలో జిల్లాకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆధారమేదీ? కాకినాడ జగన్నాథపురంలో నివశిస్తున్న సింగిరెడ్డి కమలాదేవి 2016 డీఎస్సీలో ఉద్యోగం సంపాదించింది. ఏడాది తిరగకుండానే ఆమెను కామెర్ల వ్యాధి బలితీసుకుంది. చదువులో బాగారాణిస్తూ ఎంఏబీఈడీ చేసిన ఆమె వివాహం కాకుండానే ఉద్యోగం వచ్చిన ఏడాది తిరగకుండా మరణించడంతో ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. మరణించిన తరువాత రావల్సిన పింఛన్గానీ, గ్రాట్యుటీ గానీ, ఇతర సదుపాయాలు కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా దక్కలేదు. ఆమెనే నమ్ముకున్న తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ ఆవూరి చిన్నమ్మ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సీపీఎస్ పరిధిలోకి రావడంవల్లే ఆమె కుటుంబం ఎలాంటి ప్రభుత్వపరమైన ప్రతిఫలాలను అందుకోలేకపోయింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘం మాత్రం రూ.20 వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేసింది. అండగా ఉంటాడనుకున్నారు... కష్టపడి చదివించి ప్రయోజకుణ్ని చేశారు. ఉద్యోగంలో స్థిరపడి కష్టాలను తీర్చి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఉప్పలగుప్తం మండలం మునిపల్లి గ్రామానికి చెందిన దోనిపాటి మిలింద్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్‌గా చేస్తూ రోడ్డు ప్రమాదంలో గత ఏడాది జూన్ 29న మృతి చెందాడు. 2011 తరువాత ఉద్యోగంలో చేరిన మిలింద్‌కుమార్ నాలుగేళ్లకే ప్రమాదం బారినపడి మృతి చెందాడు. సీపీఎస్ విధానం ఫలితంగా మిలింద్ కుమార్ కుటుంబానికి రావల్సిన రాయతీలు అందకుండా పోయాయి. తల్లిదండ్రులు అనంతలక్ష్మి, సత్యనారాయణతోపాటు భార్య శిరీషలు ఆధారం కోల్పోయారు. కూలీ పని చేసుకుంటూ జీవించే అనంతలక్ష్మి, సత్యనారాయణలు అందివచ్చిన కొడుకు తమ కష్టాలు తీరుస్తాడనుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. ఈ విధానాన్ని పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలు అమలు చేయడంలేదు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు. ప్రస్తుత సీపీఎస్ విధానం వల్ల ప్రస్తుతం ప్రతి ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ. 5 నుంచి 6 వేలు వరకు తీసుకుంటున్నారు. మా సొమ్మునే తిరిగి మాకు ఇస్తామనడం ఎంత వరకు సమంజసం? – కుసుమ మునిప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం మొండి వైఖరి విడనాడాలి సీపీఎస్ అమలుపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి. దాదాపు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలు అందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేశాక పింఛన్, గ్రాట్యుటీ వంటి సదుపాయాలు అందుకోకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వం నిరంకుశ విధానం విడనాడి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్ విధానంలో ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులు జారీ చేసినా అవి ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. – ఎం.రవికుమార్, జిల్లా అధ్యక్షుడు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
ఉద్యోగం రాలేదని.. ఉరేసుకున్నాడు
సాక్షి, ఆసిఫాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు నిరాశకులోనై ఉరేసుకున్నాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన హనుమయం సందీప్ (27) బీఈడీ పూర్తిచేసి, పలు పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఎన్ని పరీక్షలు రాసినా తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదన్న మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పట్టణ సీఐ అరె వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మోసపోయి అదే బాట!
♦ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా ♦ ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో : దొడ్డి దారిన ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన యువకుడు కూడా అదే బాట పట్టాడు. తన స్నేహితుడితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరాలు వేయడం ప్రారంభించాడు. విషయం మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరడంతో ఇద్దరూ అరెస్టయ్యారు. వీరిలో ఓ నిందితుడు ఇటీవల మరో మోసం కేసులో టాస్క్‌ఫోర్స్‌కే చిక్కి జైలుకు వెళ్ళివచ్చాడని అదనపు డీసీపీ సి.శశిధర్ రాజు సోమవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని లాల్ సింగ్ తండకు చెందిన భూక్యా రాము ఎంబీఏ పూర్తి చేశాడు. 2011లో ఉద్యోగం కోసం సిటీకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో దొడ్డి దారిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తిని నమ్మాడు. రూ.2.7 లక్షలు చెల్లించి మోసపోయాడు. నష్టపోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రాము కూడా అదేబాట పట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోటోలిచౌకి ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు సీహెచ్ సత్యనారాయణ ముదిరాజ్‌ను సంప్రదించాడు. ఇతగాడు కాపీ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే బోగస్ సంస్థలో సీనియర్ ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్న ఓ నకిలీ ఐడీ కార్డు కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరూ తొలుత సత్యనారాయణ సోదరుడైన సీహెచ్ మల్లేష్‌కు ఇరిగేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చినట్లు పత్రాలు, గుర్తింపుకార్డు తయారు చేశారు. వీటిని చూపించి ఉద్యోగార్థుల్ని దొడ్డిదారిలో ఉద్యోగాల పేరుతో మోసం చేయడానికి రంగంలోకి దిగారు. సంపత్‌కుమార్, వికేష్ అనే యువకుల్ని రాముకు పరిచయం చేసిన సత్యనారాయణ అతడు సెక్రటేరియేట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఇరిగేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడని నమ్మబలికారు. వారి నుంచి రూ.2.5 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ పత్రాలు, గుర్తింపుకార్డు అంటగట్టారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్‌కుమార్, జి.తిమ్మప్ప వలపన్ని సోమవారం రాము, సత్యనారాయణలను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ ఆఫరింగ్ లెటర్లు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ లెటర్ హెడ్స్, కంప్యూటర్, రెండు సెల్ఫోన్లతో పాటు రూ.75 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వా«ధీనం చేసుకున్నారు. అప్పట్లో కటకటాల్లోకి వెళ్ళిన వారిలో సత్యనారాయణ ముదిరాజ్ సైతం ఉన్నాడు. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన కొన్ని రోజులకే మరో చీటింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. -
గ్రూప్స్‌పై గురి
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం గ్రూప్స్‌లో సక్సెస్.. తద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవడం.. ఖాళీలు వందల్లో ఉంటే... పోటీ లక్షల్లోనే! ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో గ్రూప్-2 పోస్టులు 439.. 5,64,431 దరఖాస్తులు.. తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు పోటీ ఏ మేరకు ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘ఇంత పోటీని తట్టుకొని విజయం సాధించడం కష్టమే’ అంటూ నిట్టూరుస్తున్న ఔత్సాహికులకు టీఎస్పీఎస్సీ తీపి కబురు అందించింది. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు పూర్తిస్థాయి ప్రిపరేషన్‌కు మరింత సమయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త సిలబస్‌పై కసర త్తు, గ్రూప్స్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పరీక్షల్లో రాణించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విజయానికి చేరుకోవడమెలా? అనే దానిపై ‘అష్ట’ సూచనల సమాహారం.. 1. పటిష్ట ప్రణాళిక పోటీ పరీక్షలో విజయానికి పటిష్ట ప్రణాళిక అవసరం. గ్రూప్స్ ఔత్సాహికులు రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోవాలి. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ వంటి అంశాలను రోజూ చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే పూర్తిచేయాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది విజయానికి చేరువ చేస్తుంది. రోజుకు పది గంటలు ప్రిపరేషన్‌కు అందుబాటులో ఉంటే ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటలు కేటాయించాలి. ఇప్పటికే సిలబస్ పూర్తిచేసి ఉంటే, మరోసారి క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు సిద్ధపడాలి. 2. అనుసంధానత స్మార్ట్ ప్రిపరేషన్‌ను అలవరచుకోవడం ప్రధానం. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసే దిశగా ఆలోచించాలి. గ్రూప్1, 2 సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి, వాటిని ఒకేసారి అధ్యయనం చేయాలి. ఇలా అనుసంధానించుకుంటూ చదవడం వల్ల సమయం ఆదా అవుతుంది. దాంతో పాటు సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. ఉదాహరణకు తెలంగాణ సిలబస్‌ను పరిగణలోకి తీసుకుంటే.. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్‌లో ‘తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం’ అంశాలున్నాయి. అదే విధంగా పేపర్-2 సిలబస్‌లో ప్రాచీన తెలంగాణలో సాంఘిక-సాంస్కృతిక పరిస్థితులు అనే అంశాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 3. సొంత నోట్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్‌నోట్స్‌ను తయారు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలాముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన భావనలపై పట్టు సాధించేందుకు షార్ట్‌నోట్స్ దోహదపడుతుంది. 4. రివిజన్ పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి. ఇంకా తేదీలు ప్రకటించకపోయినా, వాటి గురించి ఆలోచించకుండా సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. 5. మోడల్ పేపర్ల ప్రాక్టీస్ చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం పూర్తయ్యాక పేపర్ల వారీగా మోడల్ టెస్ట్‌లు రాయాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనంగా ఉన్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపైనా పట్టు సాధించాలి. పరీక్షకు ముందు వీలైనన్ని గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మరవొద్దు. టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో వివిధ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించింది. వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2 ప్రీవియస్ పేపర్స్‌ను పరిశీలించడం మేలు చేస్తుంది. 6. గ్రూప్ స్టడీ పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించడానికి గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. వీలైన సమయాల్లో అభ్యర్థులు తమ స్నేహితులతో కలిసి చదవాలి. వివిధ అంశాలపై చర్చించాలి. ఒకరికి తెలియని అంశాలను మరొకరితో పంచుకోవాలి. ఇలా చర్చించిన అంశాలు చాలా కాలం పాటు గుర్తుంటాయి. మెటీరియల్ పరంగా లోటుపాట్లు ఉంటే అవి గ్రూప్ స్టడీ వల్ల తొలగిపోతాయి. 7. సమకాలీన అంశాలు గ్రూప్స్‌లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలి. వాటిని సిలబస్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. 8. స్వీయ విశ్లేషణ సబ్జెక్టులను ప్రిపేరవుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా.. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి, నివృత్తి చేసుకోవాలి. సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి తెలంగాణ గ్రూప్స్ ఆశావహులు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అంశాలపై దృష్టిసారిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జీఎస్ పేపర్లో తెలంగాణ ప్రత్యేక అంశాల నుంచి దాదాపు 40 ప్రశ్నలు వచ్చినట్లు అర్థమవుతోంది. ఏపీ ఔత్సాహికులు దీర్ఘ కాలిక ప్రిపరేషన్ వ్యూహాలను అనుసరించాలి. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
ఇదెక్కడి పింఛన్ విధానం!
రాయవరం : వేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏది కోరుకుంటారని చదువుకున్న వారిని అడిగితే..ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ప్రతి ఒక్కరూ ఠక్కున సమాధానమిస్తారు. మంచి జీతం, పదవీ విరమణ తర్వాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులైనా అందరికీ సమానమైన పింఛన్ విధానం అమలు కావడం లేదు. ఇది ఒక రకంగా ఉద్యోగుల మధ్య అంతరానికి దారితీస్తోందని చెప్పవచ్చు. ప్రభుత్వాలపైనా వ్యతిరేకతను పెంచుతుంది. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానంతో పింఛన్ వస్తుందన్న నమ్మకాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారు. దీనిపై సీపీఎస్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ అంశమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన అజెండాగా మారనుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే .. 2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. పథకాన్ని పీఎఫ్ఆర్డీ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూల వేతనం, కరువుభత్యంలో పింఛన్ కోసం మినహాయించిన పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలొస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 14,457 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సుమారు ఏడు వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటుతో ఒక గొడుగు కిందకు వచ్చారు. వీరంతా లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నారు. వీరికి బాసటగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఉద్యోగులకు నష్టమిలా .. పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగులు గ్రాడ్యుటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్లో కొంత భాగాన్ని కముటేషన్ చే సుకునే అవకాశం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛను వచ్చే సదుపాయం పాత విధానంలో ఉండగా, కొత్తగా లేదు. వృద్ధాప్యంలో అభద్రత పార్లమెంట్లో పీఎఫ్ఆర్డీ బిల్లును ఇటీవలే ఆమోదించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం ఉండదు. దీని వల్ల సామాజిక భద్రత లేకుండా పోతోంది. 30 ఏళ్లు సర్వీసు ఉన్నా పింఛను లేక పోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవు. - కె.మునిప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నేత, కరప పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి.. పింఛన్ విధానాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. కొత్త పింఛన్ విధానంలోకి వచ్చిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా మళ్లీ పాత విధానంలోకి వెళ్లేందుకు యోచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. - దొంతంశెట్టి సతీష్, టీచర్, మాచవరం, రాయవరం మండలం -
ఉద్యోగం కోసం కన్నవారిని కడతేర్చాడు!
సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్) : ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని సైతం పొట్టనబెట్టుకున్న నిందితుడికి యావజ్జీవ కారగార శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా జడ్జి ఎంవీ రమణ నాయుడు తీర్పు చెప్పారు. మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్ పరిశ్రమలో సుధాకర్ రెడ్డి ఉద్యోగం చేస్తూ టౌన్ షిప్లో జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి చిల్లరిగా తిరుగుతూ అప్రయోజకునిగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని స్నేహితులు సలహా ఇచ్చారు. దీంతో ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు రకరకాల ప్లాన్లు వేశాడు. ఏవీ పారకపోవటంతో చివరికి తండ్రిని చంపేసి ఆయన ఉద్యోగంలో చేరిపోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం 2013 అగస్టు 28న తల్లిదండ్రులు, మేనల్లుడు మణికంఠరెడ్డి ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బయటకు రాకుండా తలుపులకు గడియ వేశాడు. చనిపోయారని భావించిన తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసు విచారణలో తేలాయి. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
ప్రభుత్వ ఉద్యోగమంటే.. బానిస బతుకేనా ?
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఐదు అంకెల జీతం.. ఎనిమిది గంటల పని.. కావాల్సిన సెలవులు.. దర్జాజీవితం.. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారిపోతున్నాయి. సుడి ఉంటే కానీ.. దక్కదనే ప్రచారం ఉన్న సర్కారు కొలువు ఇప్పుడు సుడిగుండం కంటే.. భయంకరంగా తయారవుతోంది. పైస్థాయిల్లో ఉండే కొందరు రాబందుల కంటే.. ఘోరంగా తమ అధీనం లోని ఉద్యోగులను వేధిస్తుండడంతో వారు ఒత్తిడికి గురై.. నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు ఏకంగా తనువే చాలిస్తున్నారు. చిత్తూరు (అర్బన్): అనంతపురం జిల్లాకు చెందిన భగీరథరెడ్డి పట్టుపరిశ్రమ శాఖ ఉద్యోగి. హిందూపూర్‌లో పనిచేస్తున్న ఈయన ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం మదనపల్లెలోని హార్సిలీహిల్స్‌కు వెళ్లి 3 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి సమాచారశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసాద్ రోజులో కుటుంబంతో గడిపేది 8 గంటలే. మిగిలిన 16 గంటలు అధికారులకే కేటాయించేశాడు. అయినా సరే శాంతించని ఏడీలు ఇతన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలివి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, వాటి పర్యవేక్షణ బాధ్యతను దర్జాగా అధికారులపై వేసేస్తోంది. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేయలేక.. ఉన్నతాధికారి సూచనలు పాటించలేక చాలా మంది ఉద్యోగులు లోలోపల కుమిలిపోతున్నారు. ఒకరిద్దరు ధైర్యంగా ముందుకొచ్చి అధికారుల వేధింపులకు ఎదురు నిలుస్తున్నారు. కానీ లక్షలాది మంది ఉద్యోగులు తమ బా ధల్ని బయటకు చెప్పుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయోనని తీవ్ర ఆవేదనకు గురవుతున్నా రు. ఈ ఆవేదనంతా గుండెల్లో దాచుకుని చి వరకు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కింది స్థాయి ఉద్యోగుల్ని వేధింపులకు గురిచేసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఇదే పరిస్థితి. వేధింపులు భరించలేకున్నారు.. మానసిక, శారీరక వేధింపులంటే మొట్ట మొదట గుర్తుకొచ్చేది పోలీసుశాఖ.కానిస్టేబుళ్లకు ఎనిమిది గంటల పని వి ధానం అమల్లోకి వచ్చి ఏడాది దాటుతు న్నా జిల్లాలో ఎక్కడా ఇది కని పించదు.ఇక కొందరు సీఐలు ఎస్సైలను బూతులు తిట్టడం, అదే తీరులో ఎస్సైలు కింది స్థాయి వాళ్లపై విరుచుకుపడటం జరుగుతోంది.హోంగార్డుల పరిస్థితి అయితే మరీ దారుణం.. మొహంపై ఉమ్మేసినా ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. జిల్లాలో తమ శాఖపై ఓ ఉన్నతాధికారి కక్షసాధింపులకు దిగారంటూ అక్టోబర్ లో రెవెన్యూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో తన భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేదని ఇటీవల ఓ మహిళ కార్యాలయం ఎదుటే ధర్నా చేశారు. వ్యవసాయశాఖలో ఓ ఉన్నతాధికారి వెకి లి చేష్టలు భరించలేకున్నామని ఇటీవల ఉద్యోగులంతా తీవ్ర ఒత్తిడికి లోనై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమ య్యారు. ఇవి బయటపడ్డ కొన్ని మాత్రమే. జిల్లాలో ప్రతి శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రూపంలో ఉన్నతాధికారుల నుంచి వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగమంటే ఏమిటి..? ప్రభుత్వ ఉద్యోగం.. ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేయడానికి కావాల్సిన ప్రధాన అర్హత ప్రభుత్వ ఉద్యోగి .. రోజుకు 8 గంటలు పనిచేసి హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు ప్రభుత్వ జీతం.. అబ్బో ఒకటో తేదీ వస్తే టపీమంటూ డబ్బు బ్యాంకులో పడిపోతుంది. రిటైర్డ్ ఉద్యోగి... 60 ఏళ్లలో రూ.లక్షలకు లక్ష ల డబ్బు. నెలపెడితే పెన్షన్ సదుపాయం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు.. ►అధికారుల కింద కట్టుబానిసగా బతకాల్సిందే. ►ఉన్నతాధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ల కాళ్ల దగ్గర వాలిపోవాలి. కుటుంబాన్ని మరచిపోవాలి. ►నెలకు వేలల్లో వచ్చినా కుటుంబ పోషణకు లక్షల్లో అప్పులు చేయడం ►చచ్చినా కుటుంబం కోసం చేసిన అప్పులు తీరక, మళ్లీ అదే బావిలోకి నా అన్నవాళ్లను నెట్టడం.. -
భద్రత ఉద్యోగ లక్షణం!
సర్కారులో చిన్న కొలువుకూ సై అంటున్న యువత ఉద్యోగ భద్రతకే పట్టభద్రుల పెద్దపీట ప్రైవేటు రంగంలో ఉన్నత ఉద్యోగానికే మొగ్గు ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్: పీజీలు, పీహెచ్‌డీలు చేసినా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది నేటి యువత. సర్కారు కొలువైతే ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తుండటమే దీనికి కారణం. అందుకే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగాలకే వారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వీలుకాకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగమైతేనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్కు ఎంపికైన తీరు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిపై వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వారి రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ భద్రతనిచ్చే చిన్న ప్రభుత్వ ఉద్యోగానికే యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఆర్థిక సంక్షోభం దెబ్బకు... 2009 లో సంభవించిన అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రైవేటు ఉద్యోగాల పట్ల విద్యార్థుల్లో భయాన్ని సృష్టించినట్లు వీరి అధ్యయనంలో తేలింది. అప్పటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలంటే గాలిలో దీపం అని యువత భావిస్తోంది. 2001-08 మధ్య కాలంలో యువత ఎక్కువగా ఐటీ వైపు దృష్టి సారించేది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి మరి సాంకేతిక కోర్సులు నేర్చుకుని ఐటీ రంగంలో అడుగుపెట్టారు. అయితే ఆర్థిక సంక్షోభం దెబ్బతో పరిస్థితి మారింది. 2009 తర్వాత ఉద్యోగాల ఎంపికలో యువత తీరు మారింది. ప్రైవేటు ఉద్యోగం కంటే ప్రభుత్వంలో చిన్న కొలువున్నా సరే చేరి పోవాలనే నిర్ణయానికి వచ్చారు. చిన్న ఉద్యోగాలకూ భారీగా పోటీ.. గ్రూప్-1, గ్రూప్-2 లాంటివే కాకుండా వీఆర్ఓ, వీఆర్ఏ వంటి చిన్న సర్కారు ఉద్యోగాలకు సైతం యువత భారీగా పోటీపడుతోంది. సర్కారు కొలువులకు చదువుకునేవారు అవసరమైన వాతావరణం ఉంటుందనే భావనతో ఎక్కువగా వర్సిటీలో చే రేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో వర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కంపెనీల వర్సిటీ బాట.. మరోవైపు గత ఐదేళ్ల నుంచి అనేక కంపెనీలు ఓయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నాయి. గతేడాది వరకు దాదాపు 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. కంపెనీల సంఖ్యతో పాటు ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే అభ్యర్థుల సంఖ్య, కొలువులు సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగాల వైపే వెళుతున్నారు. ప్రైవేటులో చిన్న ఉద్యోగాలైతే ఆఫర్లు కాదనుకొని క్యాంపస్‌లోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు జాబ్ వచ్చినా చేరరు.. కొన్నాళ్లుగా ఓయూలో ఇంజనీరింగ్ తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారే ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాల్లో చేరారు. అలా చేరని వారు ప్రైవేటు ఉద్యోగాలను కాదని నెట్, జేఆర్ఎఫ్, గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. ఇక ఆర్ట్స్ కోర్సులు చేసిన వారు ప్రైవేటులో చిన్న ఉద్యోగాలకు ఆఫర్లు వస్తున్నా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. -
ఆ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటాం
న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణాన్ని కవర్ చేస్తూ.. అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్షయ్ సింగ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు. జర్నలిస్టు అకాల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన ఇరు నేతలు అక్షయ్ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా జర్నలిస్టు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని సమాచారం. కాగా సాక్షుల, నిందితుల వరుస మరణాలతో వ్యాపమ్ కుంభకోణం మరణ మృదంగం మోగిస్తూ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ సింగ్ ఇంటికి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా వెళ్లి పరామర్శించారు. -
సాక్షి కథనానికి స్పందన, నాగరాజుకు ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో రెండు కాళ్లు, చేయి పోగొట్టుకున్న పిడమర్తి నాగరాజుకు సర్కారు అండగా నిలిచింది. ప్రభుత్వ సహాయం అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంకు చెందిన నాగరాజుపై ‘అందరికీ భారమై బతుకుతున్నా..’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బుధవారం నాగరాజుకు వ్యక్తిగతంగా రూ. లక్ష ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని నాగరాజు కోరడంతో వెంటనే అందుకు మంత్రి అంగీకరించారు. మిర్యాలగూడలోని మార్కెట్‌యార్డులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు సాక్షితో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా రెండు కాళ్లు, చేయి కోల్పోయాను. అప్పుడు నా వద్దకు ఎంతో మంది వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కనబడకుండా పోయారు. ప్రభుత్వ సహాయం కోసం హైదరాబాద్ వచ్చి.. సచివాలయం చుట్టూ తిరిగా.. ఇక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు చచ్చిపోవాలనుకున్నా... కానీ, ‘సాక్షి’ నా గోడును సర్కారుకు తెలియజేసింది. నాకు న్యాయం జరిగేలా చేసిన ‘సాక్షి’కి రుణపడి ఉంటా..’’ అంటూ గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో తన మాదిరిగా వికలాంగులైన వారు చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కూడా సర్కారు ఆదుకోవాలని కోరారు. -
యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం
హైదరాబాద్ సిటీ: ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన యాసిడ్ బాధితురాలు పి.ఆషా జ్యోతికి ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. అయితే, ఈ ఒక్క కేసును ప్రత్యేకమైనదిగా భావిస్తూ ప్రభుత్వోద్యోగం ఇస్తున్నామని, దీన్ని ఆసరాగా ఇతర బాధితులకు ప్రభుత్వోద్యోగం పొందే హక్కు ఉండదని సోమవారం విడుదలచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కందుకూరు కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ఆషా జోతిపై నలుగురు దుండగులు 2011 నవంబర్ 6న యాసిడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆషా జ్యోకితి అత్యాచార నిరోధక చట్టం, పౌరహక్కుల పరిరక్షణ చట్టాల కింద అప్పట్లో రూ.50వేలు పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత ఆషా జ్యోతి తనకు ప్రభుత్వోద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆషాజ్యోతి విద్యార్హతలకు అనువైన ప్రభుత్వోద్యోగం ఇవ్వమని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. -
కట్నం చాలలేదని..కల్యాణం వద్దన్నాడు..!
వరుడి ఇంటి ఎదుట వధువు, బంధువుల ధర్నా కరీంనగర్ క్రైం: తమకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని, రూ.10లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు అమ్మారుు తల్లిదండ్రులు. మే 2న వివాహం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. పెళ్లి కుమారుడు ఈ వివాహం తనకు ఇష్టం లేదని వర్తమానం పంపించాడు. ఇదేంటని అడిగితే.. ఇంకా కట్నం కావాలని అతడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి బైఠాయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన అప్పాల రాజిరెడ్డి రెండో కూతురు బీటెక్ చదివింది. ఆమెకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన అన్నమరాజు సందీప్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. సందీప్ తన కుటుంబంతో కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో యూడీసీగా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం కావడంతో కట్నం కింద రూ.పది లక్షలు డిమాండ్ చేయగా అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. మార్చి 22న ఘనంగా ఎంగేజ్మెంట్ చేశారు. అదే రోజు వరకట్నం కింది రూ.5 లక్షలు, బంగారం కోసం మరో రూ.2లక్షల ముట్టచెప్పారు. మే 2న వివాహం జరిపించడానికి లగ్నపత్రిక రాసుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని సందీప్‌కుమార్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మధ్యవర్తుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు సమాచారం పంపించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి బంధువులను నిలదీయగా ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి తమకు ఇంకా కట్నం కావాలంటున్నారు. దీంతో అమ్మాయి, తల్లిదండ్రులు, బంధువులు మహిళా సంఘాల సహకారంతో బుధవారం సాయంత్రం సందీప్‌కుమార్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
వైకల్యం వంగి సలాం చేసింది
నీరు తీస్తానన్న వైద్యుడు కన్నీరు మిగిల్చాడు. అమ్మకు ఆసరాగా ఉందామనుకున్న తనకే ఆసరా అవసరమయ్యే పరిస్థితి. అయినా వెన్ను చూపలేదు. ప్రభుత్వోద్యోగం సాధించాలనే పట్టుదల, విధి చేతిలో పావులా మారానన్న కసి చదరంగంలో పావుల్ని నేర్పుగా కదిలించింది. లోపాన్ని లోకానికి వదిలేసి అనుకున్నవన్నీ సాధిస్తూ, అనూహ్యంగా రాణిస్తున్న ఆ యువకుడి ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. వంగి సలాం చేసింది. - ఎస్.సత్యబాబు వైద్యపరిభాషలో ‘కిఫోసిస్’, వాడుకలో ‘గూని’గా వ్యవహరించే వైకల్య బాధితుడు అమర్నాథ్ (37). సాయం అడగాల్సిన తన శారీరక స్థితి గురించి మర్చిపోయి ఎందరో తమ కాళ్లమీద తాము నిలబడేందుకు సాయంగా మారిన ఆయనను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అంతేకాదు... చదరంగంలో ఆయన సాధించిన విజయాలు అనూహ్యం. ఆయన కథలో ఒక యువకుని ఒంటరిపోరాటం ఉంది. చుట్టూ ఉన్న సమాజంతో పెనవేసుకున్న అనుబంధంలో స్ఫూర్తినింపే సేవాభావముంది. వెన్నులో నీరు తీస్తాడనుకుంటే... ‘‘పుట్టి పెరిగింది నెల్లూరు. నాన్న చిన్నతనంలోనే పోతే చిరుద్యోగి అయిన అమ్మ చేతుల మీదుగా కష్టాల నీడలోనే అక్కయ్య, అన్నయ్య, నేను పెరిగాం’’ అంటూ ప్రారంభించారు అమర్. నాన్న లేరు, అమ్మ ఉద్యోగంతో రోజంతా కుస్తీ, బంధువులు ఆదరించలేదు... చదువు సరిగా ఒంటబట్టని అమర్ తప్పుతూ, పాసవుతూ...10వ తరగతి పూర్తి చేశాననిపించాడు. ఆ సమయంలో బాగా బొద్దుగా ఉండే అమర్‌ను చూసిన ఒక డాక్టరు... ‘‘మీ పిల్లాడు మరీ లావుగా ఉన్నాడు. పెద్దయితే కష్టం’’ అని భయపెట్టి ఆపరేషన్‌తో వెన్నులో నీరు తీసేసి సన్నగా చేస్తానని నమ్మించాడు. ఆ ఆపరేషన్ వికటించి అమర్ వీపునకు కుడి వైపు దేహాన్ని పూర్తిగా కుంగదీసి గూనికి దారి తీసింది. దీంతో అమర్ మరింత నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లల బాగుకోరిన ఆ తల్లి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా... ‘‘కుటుంబ పోషణలో అమ్మకు ఆసరాగా ఉండాలనిపించినా, వీలు లేకుండా ఈ వైకల్యం అడ్డుపడింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు అమర్. స్పోర్ట్స్‌కోటాలో ప్రభుత్వోద్యోగం సంపాదించడానికి చిన్నప్పుడు ఊసుపోక ఆడిన చదరంగాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాడు. అందులో ప్రావీణ్యం సాధించి జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విజ యాలు సాధించాడు. అయినా స్పోర్ట్స్ కోటాలో వికలాంగులకు ఉద్యోగం ఇవ్వం పొమ్మన్నారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, వైకల్యం సాకుతో నిరాకరించడం... ఇలా ఎన్నో మార్లు జరిగింది. రైల్వే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా పట్టు వీడలేదు. ప్రభుత్వంతో పోరాడాడు. 9నెలల పాటు హైదరాబాద్‌కు, ఒంగోలుకు మధ్య చక్కర్లు కొడుతూ అధికారులకు అర్జీలపై అర్జీలు పెడుతూ పోరాడి చివరకు గెలిచాడు. వికలాంగుడై ఉండీ స్పోర్ట్స్‌కోటాలో రైల్వే ఉద్యోగం పొందినవారిలో ప్రథముడిగా నిలిచి, మరెందరో వికలాంగులకు స్ఫూర్తినిచ్చాడు. నేనున్నానని... ఒకరి గొడవ ఒకరికి పట్టని హైదరాబాద్ లాంటి అ‘భాగ్య’నగరాల్లో ఉద్యోగార్థ్ధుల బాధలు మరింత వర్ణనాతీతంగా ఉంటాయి. ‘‘ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఈ సిటీకి వచ్చి వెళ్లేపుడు సరైన వసతి లేక, కట్టే స్థోమత లేక పడిన బాధలే... మరి కొంత మందికి చేయూతని అందించేలా ప్రోత్సహించాయి’’ అని వివరించారు అమర్. నగరానికి సినిమా, టీవీ... వంటి రంగాలలో ప్రతిభకు తగ్గ ఉపాధిని ఆశిస్తూ వచ్చే ఎందరో యువతీయువకులకు నీడనిచ్చేందుకు ఓ పదేళ్ల నుంచి నగరానికి ఉద్యోగార్థులై లేదా మరేదైనా రంగంలో కెరీర్ వెతుక్కుంటూ వచ్చే వారికి ఉచిత వసతి కల్పించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అమర్‌కు చెందిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో రెగ్యులర్‌గా అరడజనుకు తక్కువ కాకుండా అవసరార్థులు ఆశ్రయం పొందుతుంటారు. ‘‘ఒక్కోసారి ఎవ్వరూ రానపుడు నిమ్స్, ఎల్వీప్రసాద్ ఆసుపత్రుల దగ్గర ఫుట్‌పాత్ మీది రోగులనో వారి బంధువులనో పిలుచుకువస్తాను’’ అని చెప్పారు అమర్. తన ఫ్లాట్‌ను పంచుకునే వారికి చాపలు, దుప్పట్లు, దిండ్లుతో పాటు అన్నం వండుకోవడానికి బియ్యం సమకూరుస్తున్నానని, తన జీతంతో పాటు స్నేహితులు అందిస్తున్న చేయూతతో ఇది సాధ్యమవుతోందని అమర్ అంటున్నారు. అంతేకాదు... అనాథ పిల్లలకు హోమ్‌లలో ఆశ్రయం కల్పించడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, నిరుపేద రోగులకు సహకారం అందించడం వంటి సదుద్దేశాలతో ‘‘నేనున్నాను ఫౌండేషన్’’ (www.nenunnanu.org)ను ఏర్పాటు చేశారాయన. చెస్‌లో... ఆర్బిటర్‌గా... ప్రస్తుతం రైల్వేలో కమర్షియల్ క్లర్క్‌గా పనిచేస్తున్న అమర్...మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక పాప. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మాత్రమే కాదు చదరంగంలోనూ ఆయన చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నారు. రాష్ట్ర. జాతీయస్థాయిలో ట్రోఫీలు గెలిచారు. అంతేకాదు... క్రికెట్లో అంపైర్ తరహాలో చెస్‌లో విధులు నిర్వర్తించే ఆర్బిటర్ హోదాను ఆయన అందుకుని ఈ హోదాను దక్కించుకున్న ఏకైక వికలాంగుడిగా నిలిచారు. అలాగే పోలెండ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ చెస్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఎంపికయ్యారు. ‘‘మిగిలినవారి కన్నా డిజేబుల్డ్ పర్సన్స్‌కే స్పోర్ట్స్ చాలా అవసరం’’అంటారు అమర్. అందులోనూ చెస్ లాంటి ఆటల విషయంలో వికలాంగుల్ని బాగా ప్రోత్సహించాల్సి ఉందంటున్న అమర్ అందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నగరంలో డిజేబుల్డ్ పర్సన్స్, చిల్డ్రన్‌కి ఆశ్రయం పొందే చోటకు స్వయంగా వెళ్లి వారికి ఉచిత చదరంగం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డిజేబుల్డ్కు చెస్‌ను చేరువ చేయడమే తన జీవితాశయం అనీ, వీలున్నంత వరకూ సమాజ సేవ చేస్తూనే ఉంటానంటున్న అమర్ ఆశయం సిద్ధించాలని కోరుకుందాం. -
నగదు రహిత వైద్యం ఏమైంది ?
-
ఉద్యోగం ఇప్పిసానని టోకరా..!
దేవరకొండ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు... ప్రతిఫలంగా రూ. 5.50 లక్షలు డిమాండ్ చేశాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఓ నకిలీ జాయినింగ్ ఆర్డర్ తయారు చేసి ఇచ్చారు. దీనికి తోడు ముఖ్యమంత్రే స్వయంగా వీఆర్వో జాబ్ ఇవ్వాలని సూచించినట్లు ఆ కార్యాలయం నుంచి ఒక రికమండేషన్ లెటర్ కూడా తయారు చేసి ఇచ్చారు. కాని ఉద్యోగానికెళ్తే ఆ యు వకుడికి చేదు అనుభవమే ఎదురైంది. బాధితుడు తెలి పిన వివరాల ప్రకారం..దేవరకొండ పట్టణానికి చెందిన జెల్దా వేణు స్థానికంగా ఓ లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నాడు. అతడికి తెలిసిన ఓ వ్యక్తి ద్వారా ఉద్యోగం వస్తుందని తెలపడంతో ఆశ పడా డడు. ఈక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోధనపల్లి విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడింది. అతను తనకున్న పరిచయాలతో వీఆర్వో ఉద్యో గం ఇప్పిస్తానన్నాడు. అందుకు ప్రతిఫలంగా డిమా ండ్ చేసిన అయిదున్నర లక్షలను వేణు గత జనవరిలో విజయభాస్కర్‌రెడ్డికి ముట్టజెప్పాడు. ఇందు కు భరోసాగా విజయభాస్కర్‌రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట గల రూ. 5లక్షల చెక్కులను వేణుకు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం గురిం చి భాస్కర్‌రెడ్డిని అడగటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రికమండేషన్ లెటర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ల్యాం డ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మునగాల మండలం రంగాపురం వీఆర్వోగా నియామకమైనట్లు బోగస్ జాయినింగ్ ఆర్డర్ కూడా వేణుకు ఇచ్చాడు. దీంతో వేణు గత అక్టోబర్ 29న ఉద్యోగంలో చేరడానికి ఆ మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అవి నకిలీవని తేల్చిచెప్పడంతో నివ్వెరపోయాడు. అయితే కొంత కాలంగా తన డబ్బు తన కు ఇవ్వాలని విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుండగా తప్పించుకుని తిరుగుతుండటంతో వేణు బోరుమంటున్నాడు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ విషయమై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వేణు పేర్కొన్నాడు. దీనిపై సీఐని వివరణ కోరగా తమకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు అందితే విచారిస్తామన్నారు. -
బాబూ.. జాబేది?
కర్నూలు (జిల్లా పరిషత్) : ప్రభుత్వ ఉద్యోగం.. నేటి యువత లక్ష్యం. ఎంటెక్, ఎమె్మీ స్స.. ఇలా ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ ఉద్యోగం చిన్నదైనా చాలనుకునే వారు నేడు చాలా మంది ఉన్నారు. వీరంతా పల్లెలను విడిచి పట్టణాల బాట పడుతున్నారు. కోచింగ్ సెంటర్లలో తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. ఉద్యోగంతోనే ఊరికి వెళ్లాలని దీక్షతో చదువుతున్నారు. అయితే వీరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. అది ఇదిగో అంటూ.. నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా 12 వేల మందికి పైగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారిలో ఐదు శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన వారిలో 50 శా తం ఎటూ వెళ్లలేక స్థానికంగానే అర్హతకు తగని చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి పోతున్నారు. అందులోనూ మిగిలిన వారు ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ల కోసం శిక్షణ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్, ఎక్సైజ్, ఎస్ఐ, వీఆర్ఏ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి వంటి పోస్టుల కోసం కర్నూలులోని శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా సగటున ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 91 వేల మంది నిరుద్యోగులు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అక్టోబర్ 31వ తేదీ వరకు 91 వేల మంది అభ్యర్థులు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతీ సంవత్సరం 8 వేల నుంచి 12 వేల మంది ప్రొఫెషనల్ కోర్సులు మినహా వివిధ రకాల విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు రిజిస్టర్ చేసుకుంటున్నారు. 2012లో 10,228 మంది రిజిస్టర్ చేసుకోగా 2013లో 6,301 మంది, 2014లో అక్టోబర్ 31 వరకు 8,340 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం టెన్త్ పూర్తి చేసిన వారు 31,600, ఇంటర్ పూర్తి చేసిన వారు 21,568, డిగ్రీ పూర్తి చేసిన వారు 7,400, టైపిస్ట్ పూర్తి చేసిన వారు 3 వేలు, బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన వారు 7 వేలు, డిప్లమా కోర్సులు పూర్తి చేసిన వారు 6 వేలు, ఐటీఐ చేసిన వారు 10,600 మంది జిల్లాలో ఉన్నారు. వీరు గాక ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోని వారు రెండింతలు ఉంటారని అంచనా. ఉపాధి ఁకల్పన* శాఖ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే 20 ఏళ్ల క్రితం చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అభ్యర్థులు పేరు నమోదు చేసుకునే వారు. ప్రభుత్వంలో ఏర్పడే ఖాళీలను అనుసరించి ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను ఆయా శాఖలకు పంపించేవారు. ఆ మేరకు ఆయా శాఖల నుంచి నేరుగా అభ్యర్థుల ఇళ్లకు కాల్ లెటర్లు వచ్చేవి. ఈ విధానానికి వ్యతిరేకంగా అప్పట్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లకు రిజిస్టర్ చేసుకున్న వారే కాకుండా ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని 1994లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఉపాధి కల్పనా కార్యాలయంలో రిజిస్టర్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ శాఖ జాబ్‌మేళాలు నిర్వహించేందుకు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పర్యవేక్షణకు పనిచేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ ఉద్యోగశ్రీ పేరిట చేపట్టే ప్రైవేటు నియామకాలు సైతం ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ద్వారా జరిగేవి. గత ప్రభుత్వ హయాం నుంచి రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి ఉపాధి కల్పన శాఖ పాత్ర కూడా లేకుండా చేశారు. కోచింగ్‌కు లక్షన్నర ఖర్చయ్యింది నేను హైదరాబాద్‌లో ఎంఎస్సీ మైక్రోబయాలజి పూర్తి చేశాను. గ్రూప్ వన్‌కు రెండుసార్లు, గ్రూప్-2కు రెండు సార్లు పరీక్ష రాశాను. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. గత సంవత్సరం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన మల్టీ టాస్కింగ్ పరీక్ష కూడా రాసి క్వాలిఫై అయ్యాను. అయినా పోటీ ఎక్కువున్న కారణంగా బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు అన్ని పరీక్షలకు శిక్షణ కోసం రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యింది. -వందనారాణి, ఎంఎస్సీ మైక్రోబయాలజి ఉద్యోగం లేదని గేలి చేస్తున్నారు నేను 2011లో బిఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఆర్ఆర్సీ, వీఆర్వో పరీక్షలు రాసినా క్వాలిఫై కాలేదు. బీఈడీ వారికి ఎస్జిటీ పోస్టులు తక్కువగా ఉన్నాయి. మరోవైపు పాతికేళ్లు వచ్చినా ఇంకా తండ్రిపై ఆధారపడుతున్నానన్న భావన మనసులో తొలచివేస్తోంది. ఊళ్లోనూ ఉద్యోగం లేదని గేలి చేస్తున్నారు. దీంతో ఎలాగైనా బ్యాంక్ ఉద్యోగం సాధించాలని శిక్షణ తీసుకుంటున్నాను. -బి. నరసింహ, ఆలూరు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా 2011లో నేను దూరవిద్య ద్వారా ఎంఎస్సీ పూర్తి చేశాను. కొన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్‌గా పనిచేశాను. 2012లో డీఎస్సీ, ఆర్ఆర్బి క్లర్క్ పోస్టులకు పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. మళ్లీ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తాత్సారం చేస్తోంది. - రామకృష్ణగౌడ్, జూపాడుబంగ్లా నోటిఫికేషన్లు రావడం లేదు మా వద్ద బ్యాంకింగ్ పోస్టులకు శిక్షణ కోసం వచ్చే వారిలో 50 శాతం మంది బీటెక్, మిగిలిన 50 శాతంలో బీఈడీ, జనరల్ డిగ్రీ చేసిన వారు వస్తున్నారు. సాఫ్ట్వేర్ బూమ్ తగ్గడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు బ్యాంకింగ్ రంగంవైపు చూస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -కె. రోశిరెడ్డి, శ్రీ సాయిక్రిష్ణ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ పారిశ్రామిక కారిడార్ వెంటనే ఏర్పాటు చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఔట్సోర్సింగ్ ద్వారా ఇచ్చే ఉద్యోగాలకూ ఉపాధి కల్పనా కార్యాలయం లేదా యువజన సర్వీసుల శాఖ ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేయాలి. సీఎం ప్రకటించినట్లుగా జిల్లాలో పారిశ్రామిక కారిడార్ త్వరగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఊరట కలుగుతుంది. -ఎస్.రాజశేఖర్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్, కర్నూలు జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం జాబ్‌మేళాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారితో పాటు బయటి వారికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పాలిటెక్నిక్, పారామెడికల్, ఐఐటీ వంటి ఉపాధి కల్పించే కోర్సులను అభ్యసించాలని కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లో విద్యార్థులకు చెబుతున్నాం. వారికి కెరీర్ గెడైన్స్ ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు 1ః20 నిష్పత్తిలో అభ్యర్థులను పంపిస్తున్నాం. అయితే ఓపెన్ కాంపిటీషన్లో ఎందరికి ఉద్యోగాలు వస్తున్నాయో తెలియడం లేదు. -పి. ప్రతాపరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి -
మీ త్యాగం వృథాకాదు..
మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించింది. ప్రత్యేకరాష్ట్ర సాధన కోసం జిల్లాలో ప్రాణాలర్పించిన 17మంది అమరుల కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం మంజూరుచేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు నిర్ణయించింది. వారిలో కావలి సువర్ణ (మిరాసిపల్లి, కొత్తకోట మండలం), దాసరి నరేష్ (కొత్తకోట), శంకర్(నాగపూర్, గోపాల్పేట మండలం), వీరసాగర్ (పెద్దమందడి), ఇప్పటి నాగరాజు (లంకేశ్వరం అమ్రాబాద్), బాలస్వామి (ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీసీ కాలనీ), మల్లేష్ (రంగాపూర్ జడ్చర్ల), కృష్ణయ్య (విద్యానగర్‌కాలనీ కల్వకుర్తి), వెంకటేష్ (దేవునిపడాకల్), కొప్పు వాసు (ఇప్పలపల్లి), అనిల్‌కుమార్‌రెడ్డి (మహబూబ్‌నగర్, కొమ్ము యాదయ్య (బూర్గుల), కరుణాకర్ (పాపిరెడ్డిగూడం), పాపగంటి శేఖర్ (షాద్‌నగర్), ప్రేమ్‌రాజ్ (ఎక్లాస్‌ఖాన్‌పేట), వెంకటయ్యగౌడ్ (మదలాపూర్), సత్యమ్మ (ఘణపూర్)కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది. -
ప్రభుత్వ ఉద్యోగం కన్నా స్వయం ఉపాధి మిన్న
అధునాతన మిషన్ల సాయంతో పాల సేకరణ సాక్షి, బళ్లారి : నేటి యువత మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వశక్తితో ముందుకు వెళుతూ పలువురికి మార్గదర్శకంగా నిలిచాడు ఒక ఇంజనీరింగ్ పట్టుభద్రుడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా గుండుముణుగు గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అనంతరం మరొకరి కింద ఎందుకు పని చేయాలనుకుని ఉద్యోగానికి స్వస్తి చెప్పి తనకున్న పొలంలో వ్యవసాయంపై దృష్టి పెట్టారు. పండ్ల తోటల పెంపకంతోపాటు పాడి పరిశ్రమపై మరింత దృష్టి సారించాడు. రూ.40 లక్షలతో పాడి పరిశ్రమను స్థాపించాడు. 20 జర్సీ ఆవులతో పాడి పరిశ్రమను ఏర్పాటు చేశాడు. అందుకు అధునాతన షెడ్లు, యంత్రాలు ఏర్పాటు చేసి పాలు పితకడానికి ప్రత్యేక మిషన్లు ఏర్పాటు చేశారు. ఆవు పేడతో గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆవు పేడతో వచ్చిన గ్యాస్ వల్ల విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశాడు.తద్వారా రెండు మోటార్లు ఆడే విధంగా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి రోజు 200 నుంచి 300 లీటర్ల పాల ఉత్పత్తితోపాటు ఈ సందర్భంగా న్యూస్‌లైన్‌తో తిప్పేస్వామి మాట్లాడుతూ రైతే రాజు అని నిరూపించేందుకు తాను 20 ఆవులను పెంచి ప్రతి రోజు 300 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నానన్నారు. నలుగురు కూలీలు, మేత, దాణా ఖర్చు పోను నెలకు లక్ష రూపాయలు మిగులుతోందన్నారు. పాడిపరిశ్రమ వల్ల పాలు పితికే యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నానని, దీని వల్ల పని ఒత్తిడి తగ్గిందన్నారు. -
తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం
ఆర్డీఓ బాపిరెడ్డి విచారణ రేగులచెలక (సీఎస్‌పురం), న్యూస్‌లైన్ : తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం పొంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై ఆర్డీఓ టి.బాపిరెడ్డి గురువారం విచారణ చేపట్టారు. రేగులచెలక గ్రామానికి చెందిన వ్యక్తిగా కక్కా వెంకటరమణయ్య పేరున ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తి పూణేలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక పంపించాలంటూ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ఆర్డీఓ రేగులచెలక గ్రామంలోని ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో విచారణ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో స్థానిక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తులను పిలిపించి విచారణ చేశారు. కక్కా ఇంటి పేరుగల వారు తమకు తెలిసినంత వరకూ గ్రామంలో ఎవరూ లేరనీ, గతంలో ఇక్కడ ఉండే వారేమో తమకు తెలియదని ఎస్టీలు వివరించారు. గ్రామ పెద్దలు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. గ్రామంలో ఉన్న కుక్కా ఇంటి పేరు గల వారిని కూడా ఆర్డీఓ విచారణ చేశారు. అనంతరం ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలోని అడ్మిషన్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 1976లో కుక్కా వెంకటరమణయ్య (తండ్రి సోమయ్య) పేరుతో 474 సీరియల్ నంబర్లో అడ్మిషన్ రాసి ఉంది. 1989లో ఆ సీరియల్ నంబర్‌తో కక్కా వెంకటరమణయ్య పేరుతో స్టడీ సర్టిఫికెట్ పొందినట్లుగా రికార్డులో నమోదై ఉంది. విచారణ వివరాలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.ఏడుకొండలు, ఆర్ఐ మధుసూదన్‌రావు, వీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్సీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లూర్దు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెరికె బలిజకు బీసీ సర్టిఫికెట్ ఇప్పించాలని వినతి తమ గ్రామంలో ఉన్న పెరికె బలిజ కులస్తులకు బీసీ సర్టిఫికెట్లను ఇప్పించాలని రేగులచెలక గ్రామస్తులు ఆర్డీఓ బాపిరెడ్డికి విన్నవించారు. గ్రామానికి వచ్చిన ఆర్డీఓను గ్రామస్తులు కలిశారు. పెరికె బలిజలకు గతంలో బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవారనీ ఇటీవల బీసీగా ఇవ్వడం లేదని వివరించారు. పెరికె బలిజలకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి చెంచా రమేష్, పలువురు గ్రామస్తులు ఆర్డీఓను వేడుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి వీఆర్ఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీఓ బాపిరెడ్డి ఆదేశించారు. తహశీల్దారు కార్యాలయంలో గురువారం వీఆర్ఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. -
ఒక్కో పోస్టుకు 657
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో లక్షలాది మంది నిరుద్యోగులు వరుసగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో దాదాపు లక్ష మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. మరో 13 రోజుల్లోనే పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. వీఆర్వో పోస్టుల తరహాలోనే జిల్లాలో ఈ పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... జిల్లాలో ఉన్న 88 పోస్టులకు 57,878 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 657 మంది పోటీ పడుతున్నారు. ఇటీవలే జరిగిన వీఆర్వో పరీక్షలకు ఒక్కో పోస్టుకు సగటున వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డ విషయం విదితమే. కార్యదర్శి పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తుల సంఖ్య కూడా అదే తీరు పోటీని తలపిస్తోంది. వీఆర్వో పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులే ఎక్కువ మంది కార్యదర్శి పోస్టుకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలనే నిబంధన ఉండటంతో కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల సంఖ్య కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది. షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 23న పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో 165 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఏపీపీఎస్సీకి పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గత ఏడాది డిసెంబరు 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 88 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. గత నెల 26న దరఖాస్తుల గడువు ముగిసింది. రిజర్వేషన్ల వారీగా అన్ని జిల్లాల్లోని ఖాళీల వివరాలను నోటీఫికేషన్లోనే పొందుపరిచింది. పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నేరుగా భర్తీ చేస్తారు. -
అపూర్వ ఉపాధ్యాయులు!
=చదువు, శిక్షణ, బోధన ఒకే చోట =వీరి భార్యామణులదీ అదే బాట కవగుంట (రావికమతం), న్యూస్‌లైన్: ఆ యువ ఉపాధ్యాయులిద్దరూ చిన్నప్పట్నుంచి మంచి మిత్రులు. ఒకే ఊరు, ఒకే స్కూలు, ఒకే బెంచిపై కలిసి చదువుకున్నారు. కలిసి ఆడుకున్నారు. ఉన్నత చదువులు చదివారు. కలిసే బీఈడీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం పొందారు. యాధృచ్ఛికంగా వారు చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మిత్రులంటే వీరే అన్న చందంగా గ్రామస్తులు, సాటి ఉపాధ్యాయులుచే గుర్తింపు పొందారు. కవగుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పులపర్తి రామచందర్‌రావు, కొమ్మోజు భాస్కరరావు చిన్న నాటినుంచి మంచి స్నేహితులు. ఇద్దరిదీ వారు పనిచేసే పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉన్న కింతలి గ్రామం. కవగుంట పాఠశాలలో చదువుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారు. తరగతుల్లో చదువులోనూ పోటీపడేవారు. చదువుపై వీరికి గల మక్కువను గుర్తించిన వీరి గురువు వంటాకు సూర్యనారాయణ మరింత సహాయ సహకారాలందించడంతో ఒకొక్కటిగా పైచదువులు చదివారు. తూర్పుగోదావరి జిల్లాలో బీఈడీ పూర్తి చేశారు. ఆపై 2008 డీఎస్సీలో ఒకేసారి పోస్టింగ్ కొట్టేశారు. వీరి స్నేహ బంధాన్ని దూరం చేయకూడదనుకున్నట్టుగా విధి కూడా వారికి సహకరించింది. అనూహ్యంగా ఇద్దరూ తాము చదివిన కవగుంట పాఠ శాలలోనే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. కాకతాళీయంగా జరిగిందో, అదృష్టం వరించిందో, కష్టానికి ప్రతిఫలమో కాని వారిద్దరూ మిత్రులగానే కాకుండా మంచి ఉపాధ్యాయులుగానూ పేరు తెచ్చుకుంటున్నారు. సతీమణులు సైతం... మరో విశేషమేమిటంటే... వీరి సతీమణులు సైతం భర్తలనే అనుకరిస్తున్నామన్నట్టుగా టీటీసీకి ఎంపికయ్యారు. రామచంద్రరావు సతీమణి మాధవి, భాస్కరరావు భార్య నాగలక్ష్మి ఇద్దరూ గుంటూరులోనే టీటీసీలో శిక్షణ పొందుతున్నారు. -
కొలువుల జాతర
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. సర్కారీ కొలవుల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల కానున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 210 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకానికి బుధవారం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమీప భవిష్యత్తులో వీఆర్ఓ, వీఆర్ఏ, పోలీసు కానిస్టేబుల్, ఉపాధ్యాయుల నియామకాల కోసం ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ కార్యదర్శి పోస్టుకు అర్హతలు డిగ్రీతో పాటు 18-36 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. డిగ్రీలో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు. డిగ్రీ పూర్తయిన ఏడాది నుంచి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున 10 మార్కులు అదనంగా కేటాయిస్తారు. కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు డిగ్రీ అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి సర్వీసు కాలానికి ఏడాదికి మూడు మార్కులు చొప్పున గరిష్టంగా 15 మార్కుల వరకు కేటాయిస్తారు. నవంబర్1వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 29వ తేదీన నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు జిల్లాలో ఖాళీగా ఉన్న 152 వీఆర్ఓ పోస్టులతో పాటు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్న వీఆర్ఏ పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాగం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ పోస్టుల నియామకాలకు అనుమతి కోరుతూ నెల రోజుల కింద జిల్లా కలెక్టర్ కార్యాలయం సీసీఎల్ఏ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపించింది. అయితే సమ్మె కారణంగా సీమాంధ్ర జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందలేదు. అక్కడి నుంచి కూడా ప్రతిపాదనలు అందితే వీఆర్ఓ, వీఆర్ఏల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించనుందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. అదే విధంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 936 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లా విద్యాశాఖ ఈ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 150 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో ప్రకటన విడుదల చేస్తామని నిజామాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ సరిగ్గా నెల రోజుల కింద ప్రకటించారు. దీనిపై కసరత్తు కొనసాగుతోందని పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
అయోమయం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నవారంతా మొదట ఉపాధ్యాయ వృత్తిపైనే దృష్టి పెడుతుంటారు. రెండు పదుల వయస్సు నిండక ముందే సర్కారు కొలువులో స్థిరపడవచ్చన్నది వీరి ఆశ. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇటీవలి కాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో ఆ స్థాయి బోధన జరగడం లేదు. ఇంటర్ పూర్తిచేసి కొండంత ఆశతో డీఎడ్ కోర్సులో చేరిన విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. పరీక్షల సమయం ముంచుకొచ్చినా సగానికిపైగా సిలబస్ పెండింగ్‌లో పెట్టి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాయచోటి డైట్ మినహాయిస్తే జిల్లాలో ప్రస్తుతం 49 ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు నడుస్తున్నాయి. ఒక్క కడప పట్టణంలోనే 12 కళాశాలలు ఉండగా, ప్రొద్దుటూరులో 9, రాజంపేటలో 8, రైల్వేకోడూరులో 4, రాయచోటి, బద్వేలు ప్రాంతాల్లో ఆరేసి ఉన్నాయి. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్క కాలేజీ ఉంది. వీటిల్లో సగానికి పైగా కళాశాలలు 2012-13 విద్యా సంవత్సరం నుంచే పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం బీఎడ్ విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. అసలు సమస్య ఇక్కడే.. : 2012-13 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి అనుమతి పొందిన డీఎడ్ కళాశాలలు, తగిన ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఉండటంతో నామమాత్రపు అధ్యాపకులతో తూతూ మంత్రంగా తరగతులు నిర్వహించారు. వాస్తవానికి డీఎడ్ సబ్జెక్టులను బోధించడానికి ఎంఎడ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అయితే బీఈడీ లేదా సాధారణ పీజీ చేసిన వారితో పాఠాలు చెప్పించి మమ అనిపిస్తున్నారు. అన్నింటా నిర్లక్ష్యం : 2012 డైట్ సెట్ నిర్వహణ ఆది నుంచి ఆలస్యం కావడం, కౌన్సిలింగ్లో మరింత జాప్యం జరగడంతో మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యేసరికి 2013 ఫిబ్రవరి వచ్చేసింది. ఈ ఏడాది వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని ఆయా కళాశాలలకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. పేరుకు మాత్రం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆ స్థాయిలో విద్యాబోధన చేయలేకపోయాయి. చాలా కాలేజీల్లో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడంతో ఒకట్రెండు పీరియడ్లలో మాత్రమే బోధన జరిగేది. దీంతో జులై చివరి నాటికి సగం కూడా సిలబస్ పూర్తి చేయలేకపోయారు. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం... విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనడంతో బోధన ముందుకు సాగలేదు. నవంబర్‌లో పరీక్షలు : డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు త్వరలో తేదీలు ఖరారయ్యే అవకాశముంది. బహుశా నవంబర్ మూడవ వారంలో ఉండవచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు తత్వశాస్త్రం, విద్య మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రాథమిక విద్య, సమ్మిళిత విద్య, సామర్థ్య నిర్మాణం... అనే ఐదు పరీక్షలను రాయాల్సివుంది. కడప పట్టణంలోని ఓ పేరొందిన కళాశాలలో ఇప్పటివరకు ప్రాథమిక విద్య, సమ్మిళిత విద్య సబ్జెక్టులను అస్సలు మొదలుపెట్టలేదు. మిగిలిన మూడు సబ్జెక్టులు కూడా సగంలో ఆగిపోయాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే ఇక మండల కేంద్రాల్లోని కళాశాలల్లో విద్యాబోధన ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..? : డీఎడ్ కళాశాలల్లో తరగతులు ఎలా జరుగుతున్నాయి? అర్హులైన అధ్యాపకులున్నారా? సిలబస్ సకాలంలో పూర్తవుతున్నదా? తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విద్యాశాఖ అధికారులు కళాశాలల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. కళాశాల యాజమాన్యాలు సంపాదనే పరమావధిగా భావించి భావి ఉపాధ్యాయుల భవితను మంటగలుపుతున్నారన్నది నిర్వివాదాంశం. ఉపాధ్యాయ శిక్షణలోనే ఇంతటి నిర్లక్ష్యాన్ని చవిచూస్తున్న భావి అయ్యవార్లు ప్రభుత్వ కొలువుల్లోకి వెళితే ఏ మేరకు పాఠాలు చెబుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
వారానికి ఐదు రోజులే విధులు
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను తగ్గించేందుకు పరిపాలన విభాగం సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహించేలా రూపొందించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కార్యాలయానికి పంపింది. అయితే ఒక్క రోజు పనిదినాన్ని తగ్గించి ఐదు రోజుల పనిదినాలలో ఒక గంట ఎక్కువ పనిచేసేలా సర్దుబాటును చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రెండో, నాలుగో శనివారం సెలవు ఉంది. మొదటి, మూడో, ఆ నెలలో ఐదో శనివారం వస్తే కార్యాలయాలు తెరిచే ఉంటాయి. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులతో జీవనం సాగించే ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ఉండాలని కొన్ని సంవత్సరాలుగా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారానికి రెండు రోజులు కార్యాలయానికి సెలవు ఉంటే ఇంధనం, విద్యుత్, నీరు, అధికారుల పర్యటన కోసం వాహనాలకయ్యే ఖర్చులు ఇలా అనేక రకాల పొదుపు ఉంటాయని పేర్కొన్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయని అన్నారు సదరు ప్రతిపాదన ముఖ్యమంత్రి చవాన్‌కు పంపించినట్లు సామాన్య పరిపాలన విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎస్.మీనా అంగీకరించారు. అయితే అంతకుముందు 1986, 87లో ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేశారు. అపుడు అదనంగా గంట పనిచేయాలనే నిబంధన విధించారు. తర్వాత వారానికి ఆరు రోజులు పని దినాలు చేసినప్పటికీ అదనంగా పెంచిన గంట మాత్రం తగ్గించలేదు. ఆ నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు ఇప్పటికీ ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రూపొందించిన ప్రతిపాదనలో వారానికి ఐదు రోజుల పనిదినాలు చేయాలంటే రోజుకు అదనంగా ఒక గంట పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటలు కార్యాలయాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించిన తరువాత మంజూరు కోసం కేబినెట్ ముందుకు రానుంది. బహుశా ఈ ప్రతిపాదనను 2014 జనవరి నుంచి అమలుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది దూర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే ఉద్యోగులకు ఊరట కలిగించనుంది. కనీసం వారానికి రెండు రోజులు కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుకలగనుంది. నగరంలో ఇళ్ల ధరలు చుక్కలను తాకడంతో సామాన్య ఉద్యోగులు అత్యధిక శాతం శివారు ప్రాంతాలకు తరలిపోయారు. వారు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగించాలంటే రోజు కనీసం నాలుగైదు గంటలు వృథా అవుతోంది. పైగా ట్రాఫిక్ జాంలో సమయానికి కార్యాలయానికి చేరుకోవడం ఉద్యోగులకు ఒక అగ్నిపరీక్షగా మారింది. కానీ కొత్త ప్రతిపాదన అమలైతే పనివేళల్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 9.50 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉదయం 9.20 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఎంత ఆలస్యంగా వస్తే అంత ఎక్కువ సేపు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అత్యవసరం కోసం నెలకు కేవలం గంట మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు మినహాయింపు ఇవ్వనున్నారు. -
ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య
జన్నారం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఉద్యోగం రాదనే బెంగతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తపాలపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పొన్నం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తపాలపూర్ గ్రామానికి చెందిన గుంటుకు భరత్(24) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవని, భవిష్యత్ పాడవుతుందని కుటుంబ సభ్యులతో మదనపడేవాడు. మనస్తాపం చెందిన భరత్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి తల్లిదండ్రులు గంగన్న, భారతి, ఇద్దరు సోదరులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భార్య మందలించిందని భర్త.. దండేపల్లి : మండలంలోని మాకులపేట, లక్ష్మీకాంతపూర్ గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాకులపేట గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీనివాస్(40) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. భార్యకు తెలియకుండా రూ.2వేలు అప్పు చేశాడు. మద్యంమత్తులో వాటిని పడేశాడు. కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక బాధపడుతుంటే తాగుడు మానకుండా అప్పు ఎందుకు చేశావని భార్య సత్తవ్వ అతడిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుం డగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఆయనకు భార్య సత్తవ్వ, కూతురు శ్రుతి ఉన్నారు. తండ్రి మందలించాడని కొడుకు.. మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామానికి చెందిన జెల్లపెల్లి స్వామి(22) గొర్రెలు మేపేందుకు వెళ్లకపోవడంతో తండ్రి లింగయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వామి గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి లక్సెట్టిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సమయంలో చనిపోయాడు. స్వామికి భార్య మల్లవ్వ, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ వివరించారు. జీవితంపై విరక్తితో.. కుభీర్ : మండలంలోని బెల్గాం గ్రామానికి చెందిన ఆదేపువాడ్ శంకర్(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై టి.సంజీవ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌కు భార్యాపిల్లలు, అన్నదమ్ములు లేకపోవడంతో ఇతర గ్రామాల్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం చేనులో పురుగుల మందు తాగి చనిపోయాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్సకు డబ్బుల్లేక.. ఆదిలాబాద్ రూరల్ : జైనథ్ మండలం రోడ్ మేడిగూడ గ్రామానికి చెందిన జె.ఆనంద్‌రావు(30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జైనథ్ ఏఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌రావు కొన్నేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. డబ్బులు లేకపోవడంతో రెండోసారి చికిత్సకు తీసుకెళ్లలేదు. దీంతో వ్యాధి తీవ్రం కావడం, చికిత్సకు డబ్బులు లేకపోవడంతో గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.