ఆ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటాం
న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణాన్ని కవర్ చేస్తూ.. అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్షయ్ సింగ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు.
జర్నలిస్టు అకాల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన ఇరు నేతలు అక్షయ్ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా జర్నలిస్టు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని సమాచారం.
కాగా సాక్షుల, నిందితుల వరుస మరణాలతో వ్యాపమ్ కుంభకోణం మరణ మృదంగం మోగిస్తూ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ సింగ్ ఇంటికి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా వెళ్లి పరామర్శించారు.