
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు
♦ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా
♦ ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో : దొడ్డి దారిన ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన యువకుడు కూడా అదే బాట పట్టాడు. తన స్నేహితుడితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరాలు వేయడం ప్రారంభించాడు. విషయం మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరడంతో ఇద్దరూ అరెస్టయ్యారు. వీరిలో ఓ నిందితుడు ఇటీవల మరో మోసం కేసులో టాస్క్‌ఫోర్స్‌కే చిక్కి జైలుకు వెళ్ళివచ్చాడని అదనపు డీసీపీ సి.శశిధర్ రాజు సోమవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని లాల్ సింగ్ తండకు చెందిన భూక్యా రాము ఎంబీఏ పూర్తి చేశాడు. 2011లో ఉద్యోగం కోసం సిటీకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో దొడ్డి దారిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తిని నమ్మాడు. రూ.2.7 లక్షలు చెల్లించి మోసపోయాడు. నష్టపోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రాము కూడా అదేబాట పట్టాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోటోలిచౌకి ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు సీహెచ్ సత్యనారాయణ ముదిరాజ్‌ను సంప్రదించాడు. ఇతగాడు కాపీ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే బోగస్ సంస్థలో సీనియర్ ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్న ఓ నకిలీ ఐడీ కార్డు కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరూ తొలుత సత్యనారాయణ సోదరుడైన సీహెచ్ మల్లేష్‌కు ఇరిగేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చినట్లు పత్రాలు, గుర్తింపుకార్డు తయారు చేశారు. వీటిని చూపించి ఉద్యోగార్థుల్ని దొడ్డిదారిలో ఉద్యోగాల పేరుతో మోసం చేయడానికి రంగంలోకి దిగారు. సంపత్‌కుమార్, వికేష్ అనే యువకుల్ని రాముకు పరిచయం చేసిన సత్యనారాయణ అతడు సెక్రటేరియేట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఇరిగేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడని నమ్మబలికారు.
వారి నుంచి రూ.2.5 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ పత్రాలు, గుర్తింపుకార్డు అంటగట్టారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్‌కుమార్, జి.తిమ్మప్ప వలపన్ని సోమవారం రాము, సత్యనారాయణలను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ ఆఫరింగ్ లెటర్లు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ లెటర్ హెడ్స్, కంప్యూటర్, రెండు సెల్‌ఫోన్లతో పాటు రూ.75 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వా«ధీనం చేసుకున్నారు. అప్పట్లో కటకటాల్లోకి వెళ్ళిన వారిలో సత్యనారాయణ ముదిరాజ్ సైతం ఉన్నాడు. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన కొన్ని రోజులకే మరో చీటింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు.