Task force
-
నకిలీ విత్తనాలు.. దాడులు..
సాక్షి నెట్వర్క్: పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలుచోట్ల అధికార యంత్రాంగం దాడులు, తనిఖీలు చేపట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఓ దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. లూజ్ విత్తనాలను వివిధ కంపెనీల పేరిట ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దాని యజమాని రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన గోదాముల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇక్కడి తాంసి బస్టాండ్ సమీపంలోని నిఖిల్ ఫర్టీలైజర్ షాపులో స్టాక్ ఉన్నా డీలర్ నోస్టాక్ బోర్డు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. నిఖిల్ ఫర్టీలైజర్ షాపు వద్ద ఇన్చార్జ్గా ఉన్న ఏఈఓ శివచరణ్‌ను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ ఏఓ భగత్ రమేశ్‌ను బదిలీ చేశారు. ఇక విత్తనాలు గోదాంలో అందుబాటులో ఉన్నా, డీలర్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాశీ–659 డిస్ట్రిబ్యూటర్ వామన్‌రావుపై కేసు నమోదు చేశారు. ⇒ ఖమ్మంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశా రు. ఆ సమయంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతు లతో మాట్లాడారు. అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకటేనని, ఏవైనా దిగుబడి బాగానే వస్తాయని చెప్పారు. ⇒ మరోవైపు జనుము, జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జీలుగ విత్తనాల కోసం బారులుతీరారు. -
ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే!
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్టైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు దీనితోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు.. ‘‘రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్ఐబీ చీఫ్‌గా నియమించింది. తమ కులంతోపాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసున్నారు. వివిధ విభాగాలు, జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నారు. అందులో నల్లగొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్‌రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్‌రావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు తరచుగా కలు స్తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌లో వెస్ట్‌జోన్‌కు 2021 వరకు ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టుమల్లును రాధాకిషన్‌రావు సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టుమల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ల్లోని మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వీరి అక్రమాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా ప్రభాకర్‌రావు బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది. వారంతా కేవలం వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారు. ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు తన నమ్మినబంటు ప్రణీత్‌రావును స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) నిర్వహణ కోసమే తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి నేతలతోపాటు వారి అనుచరులనూ టార్గెట్ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరేలా చేయడం వంటివే వారి టార్గెట్. నగదు రవాణాను గుర్తించి.. ప్రభాకర్‌రావు, ఆయన బృందం ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణాపై దృష్టి పెట్టింది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భవ్య సిమెంట్ కంపెనీకి చెందిన ఆనంద్ ప్రసాద్ పోటీచేశారు. ఆ సమయంలో ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు రంగంలోకి దిగి.. ఆనంద్ ప్రసాద్ సంబందీకుల నగదు రవాణాపై నిఘాపెట్టారు. ఆ వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు అందించారు. ఈయన ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్యారడైజ్ వద్ద రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్‌రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంబందీకులపై నిఘా పెట్టి వివరాలను రాధాకిషన్‌రావుకు చేరవేశారు. ఫలితంగానే సిద్దిపేటలో చిట్‌ఫండ్ కంపెనీ నిర్వహించే రఘునందన్‌రావు బంధువు నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. 2022 అక్టోబర్ రెండోవారంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధీకులపై ప్రణీత్‌రావు సాంకేతిక నిఘా ఉంచారు. నగదు రవాణా అంశాన్ని గుర్తించి రాధాకిషన్‌రావుకు తెలిపారు. ఈయన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసి.. కోమటిరెడ్డి అనుచరులైన జి.సాయికుమార్‌రెడ్డి, ఎం.మహేందర్, ఎ.అనూ‹Ùరెడ్డి, వి.భరత్‌ల నుంచి రూ.3.5 కోట్లు స్వా«దీనం చేసుకుంది’’ అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రాధాకిషన్‌రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ప్రతిపక్షాలతోపాటు విమర్శించే వారిపైనా.. ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్‌రావు తన బృందమైన రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌రావు, తిరుపతన్నలకు స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబం«దీకులు, మద్దతిచ్చే వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైనా ప్రభాకర్‌రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు.. ఆ పార్టీ నాయకులు కొందరిపైనా నిఘా వేశారు. రాధాకిషన్‌రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసినా.. కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా రెండుసార్లు అవకాశమిచ్చారు. హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు. -
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
9 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొమ్మిది మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఐపీఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, నాన్ కేడర్ ఎస్పీల బదిలీలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ వేర్వేరుగా జీఓలు జారీ చేశారు. ► హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు. ► ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన వరంగల్ మాజీ సీపీ రంగనాథ్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు. ► ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్ఎం విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా.. ఇప్పటివరకు వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు. ► మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డీసీపీగా నియమించారు. ► సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–1 డీసీపీగా నియమించారు. ► టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక పంత్, గజరావు భూపాల్, చందనాదీప్తి తదితర అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదుగురు నాన్‌కేడర్ ఎస్పీలు బదిలీ.. ► వెయిటింగ్లో ఉన్న అధికారి ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ► రాచకొండ కమిషనరేట్‌లో రోడ్డు భద్రత విభాగం డీసీపీగా ఉన్న శ్రీబాలదేవి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమితులయ్యారు. ► మాదాపూర్ డీసీపీగా ఉన్న జి.సందీప్‌ను రైల్వేస్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న జె.రాఘవేందర్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్ ►టీఎస్పీఎస్ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి ►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు ►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్ ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ ►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు ►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ -
నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు!
● చండూరు పట్టణంలో కేంద్రంలో అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఓ నాయకుడు ఫిర్యాదు చేశాడు. అధికారులు నిర్మాణదారుడికి ముందుగా నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుంటామని చెప్పే లోపే (ఏడాది సమయంలో) ఆ భవన నిర్మాణం పూర్తయింది. ● పట్టణంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా మూడు ప్లోర్ల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ● ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ ముందు అనుమతి లేకుండా రెండు విగ్రహాలు ఏ్పాటు చేస్తున్నారని పట్టణ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. చండూరు : చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టణంలోని సెంటర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు మొదలుకుని పెద్ద భవనాలు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు ఇలా చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. అక్రమ నిర్మాణం చేసుకునే వారికి నోటీలిస్తున్న అధికారులు వారిపై చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలుకుబడి ఉన్న వారు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. పేదలకు మాత్రం అనుమతులు అడుగుతూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 100 వరకు అక్రమ నిర్మాణాలు.. చండూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 ఇళ్ల వరకు అనుమతిలేనివిగా అధికారులు గుర్తించా రు. వీరికి గతంలో నోటీసులు సైతం అందజేసి.. చ ర్యలు తీసుకోవడం మరిచారు. అధికారులు గుర్తించనవి మరో వంద వరకు ఉంటాయని కౌన్సిలర్లే చెప్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు ఫిర్యాదు చేస్తున్నాం చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు అందించాం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తదుపరి చర్యలకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – మొయిజుద్దీన్, కమిషనర్, చండూరు మున్సిపాలిటీ నిబంధనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం కోసం బీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముందుగా అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ ఆర్ఐ లాగిన్ వెళ్తే ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ (టీపీఎస్)కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే టీపీఎస్ నుంచి నేరుగా అనుమతులు ఇస్తారు. అనుమతుల కోసం ఇంటి గజాలను బట్టి ఆన్లైన్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా అనుమతుల ప్రక్రియ పట్టణంలో సాగడం లేదు. -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్‌ఫోర్స్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్‌పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్‌వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్‌ను ఓ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్‌ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్‌ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్‌ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్‌ను సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
చంటి లోకల్! అనే సినీ డైలాగ్‌తో వసూళ్లు..నివ్వెరపోయిన పోలీసులు
సాక్షి, వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపేది టాస్క్‌ఫోర్స్.. కానీ ఆ విభాగంలోని అధికారుల్లో కొందరు అవే అక్రమాలకు పాల్పడడం... విచారణలో తెలిసిన విషయాలు చూసి నివ్వెరపోయిన పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం కమిషరేట్‌లో కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.నరేష్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్ బి.సృజన్‌లు బియ్యం దందాతోపాటు మ రికొన్నింట్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ సీపీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 3న పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు వారే సూత్రధారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ ఏర్పడినప్పటినుంచి కొంతమంది సిబ్బందికి ఎలాంటి బదిలీలు లేవు. దీంతో శాఖలోని లొసుగులను ఆసరా చేసుకుని వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి టాస్క్ ఫోర్స్‌ను అడ్డుపెట్టుకుని సస్పెన్షన్‌కు గురైన ఓ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా లక్షల రూపాయల వసూళ్లకు పా ల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కానిస్టేబుల్‌కు రూ.10వేల కంటే తక్కువ ఇస్తే వాటిని ముఖంపై విసిరికొట్టేవాడని చెబుతుండేవారు. కొంతకాలంగా వీరిపై వస్తున్న వసూళ్ల ఆరోపణలపై దృష్టి సారించిన సీపీ రంగనాథ్ ఆ దిశగా విచారణ జరిపారు. కొందరు అధికారుల అవినీతి బయటపడుతుందని ఆశించిన వారికి టాస్క్‌ఫోర్స్‌లో అది వెలుగుచూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు బృందాల్లోని టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా పనిచేసిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఒకేసారి సస్పెండ్ కావడం చూస్తుంటే ఏ స్థాయిలో వసూళ్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల విచారణ...నలుగురిపై వేటు పీడీఎస్ బియ్యం దందాపై జరిగిన విచారణలో భా గంగా హసన్పర్తికి చెందిన ఓ బియ్యం వ్యాపారి, మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలో ఉండే మరో వ్యాపారి, ఓ రిపోర్టర్‌ను వారం రోజులపాటు విచారించడంతో నిజాలు వెలుగుచూసినట్లు తెలిసింది. మామూ ళ్ల వసూళ్లలో కమిషనరేట్‌కు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. వరుస సస్పెన్షన్ వేట్లతో ఉరికిస్తున్న సీపీ.. రానున్న రోజుల్లో ఎవరిపై చర్యలు హాట్‌టాపిక్‌గా మారింది. చంటి లోకల్.. వసూళ్ల సూత్రధారి ఓ రిపోర్టర్ వేటుపడిన టాస్క్‌ఫోర్స్ అధికారి ఉన్నతాధికారుల ముందు ‘చంటి లోకల్...అధికారులు వస్తారు...పోతారు’ అనే సినిమా డైలాగ్‌ను పదేపదే చెప్పడంతోపాటు తనకు ఓ ఎమ్మెల్యే అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయరనే ధైర్యంతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతినెలా లక్షల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వరంగల్ ప్రాంతంలో ఓ యూ ట్యూబ్ రిపోర్టర్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. (చదవండి: మానవత్వంలో ‘రాజా’రాం... ) -
‘టాస్క్‌ఫోర్స్’ తీసేసినా.. నియంత్రణ ఫోర్స్ అంతే!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల సాధన (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం కోసం విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని తాత్కాలికంగా నిలిపివేసినా... మరో రూపంలో తెచ్చే యోచనలోనే అధికారులున్నారు. కాకపోతే ‘టాస్క్‌ఫోర్స్’అన్న ఘాటైన పదాన్ని మాత్రమే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతమైనా అత్యంత వివాదాస్పదమైన ఈ నిర్ణయంపై కొంతమంది అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గొద్దన్న ధోరణిలో ఉన్నారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా వందకు వంద శాతం విద్యార్థుల్లో అభ్యసన మెరుగుపర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ కార్యక్రమాలను ఉపాధ్యాయులు తేలికగా తీసుకుంటున్నారని, అందుకే గట్టి పర్యవేక్షణ అవసరమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులపై వేటు పడితేనే ఎఫ్ఎల్ఎన్పై శ్రద్ధ పెరుగుతుందని ఆమె అన్నట్టు ఓ సీనియర్ అధికారి ఉపాధ్యాయ సంఘాలతో చెప్పారు. అయితే, టాస్క్‌ఫోర్స్ పేరుపై మంత్రి కూడా కొంతమేర అభ్యంతరాలు తెలిపినట్టు తెలిసింది. ఈ కారణంగా దీని పేరు మార్చినా విధివిధానాల్లో మార్పు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. మరింత కఠిన నిబంధనలు టాస్క్‌ఫోర్స్ కమిటీలో స్థానిక ఎన్జీవో సంస్థల భాగస్వామ్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక రాజకీయాలు ఇందులో ప్రభావం చూపే అవకాశముందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1–5వ తరగతి ఉండే పాఠశాలల్లో స్థానిక నేతల పెత్తనం ఉంటుందని, వారి కనుసన్నల్లోనే ఎన్జీవోలు ఉంటాయని, దీనివల్ల తాము నష్టపోయే ప్రమాదం ఉందని టీచర్లు చెబుతున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదని తెలిసింది. ఎన్జీవోల స్థానంలో స్థానిక సంస్థలు ప్రతిపాదించిన ఓ వ్యక్తిని కమిటీలో నియమించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఎఫ్ఎల్ఎన్ నిర్వహణపై నివేదికలు ఇచ్చేలా చర్యలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి టాస్క్‌ఫోర్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో ఎంఈవో, డైట్ లెక్చరర్, మండల, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, ఎన్జీవో లను సభ్యులుగా చేర్చారు. విద్యార్థులకు టీచర్లు ప్రతీ వారం పరీక్షలు నిర్వహించాలి. 15 రోజులకోసారి అధికారులకు నివేదికలు పంపాలి. ప్రతీనెల ఉన్నతాధికారులు వీటిని సమీక్షిస్తారు. ఇదే క్రమంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్కూళ్లకు వెళ్లి విద్యార్థి సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుల బోధనను పరిశీలిస్తుంది. సరిగా బోధించని ఉపాధ్యాయులపై, ఫలితాలు సాధించని స్కూళ్లపై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే వీ లుంది. టాస్క్‌ఫోర్స్‌ను నిలిపివేయడంతో కొత్తగా ఏర్పాటు చేసే వ్యవస్థలోనూ విద్యాశాఖ అధికారుల ప్రమేయం కన్నా, స్థానిక సంస్థలకే ఎక్కువ అధికారాలు ఇచ్చే యోచనలో అధికారులున్నారు. ఇది మరో వివాదానికి తెరతీసే ఆస్కారం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి రూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. టాస్క్‌ఫోర్స్ అధికారుల ఎంట్రీతో..: టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్‌వని, లారీల్లో ఉన్నవి రేషన్ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్ చేశారు. -
పరిశ్రమల్లో తనిఖీలకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్‌కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు. -
తీరు మారలేదు... చోరీలు మానలేదు
చిలకలగూడ : పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. పీడీయాక్టుపై శిక్ష అనుభవించాడు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలై తన స్నేహితుడితో కలిసి ఆరుచోట్ల పంజా విసిరాడు. చివరకు పోలీసులకు చిక్కి మరోమారు కటకటాల పాలయ్యాడు. ఇరువురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి రూ. లక్షల నగదు, నగలు స్వాదీనం చేసుకున్నట్లు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా తెలిపారు. సంతోష్‌నగర్‌కు చెందిన మెహబూబ్‌ఆలీ అలియాస్ కుస్రూ హోటల్ కుక్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. 1996 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండ కమిషనరేట్ల పరిధిలో 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన వెంటనే చోరీలకు పాల్పడటం పోలీసులకు పట్టుబడడం పరిపాటిగా మారింది. సంతోష్‌నగర్ ఠాణా పోలీసులు 2020లో అతడిపై పీడీయాక్టు ప్రయోగించారు. ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. భవానీనగర్ తలాబ్‌కట్ట రాజాగల్లీకి చెందిన స్నేహితుడైన పాత నేరస్తుడు మహ్మద్ ఫిరోజ్‌తో కలిసి చిలకలగూడ, నల్లకుంట, నల్గొండ ఠాణాల పరిధిలో ఆరుచోట్ల ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులు మెహబూబ్‌అలీ, మహ్మద్ ఫిరోజ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, ఎస్ఐలు శ్రీశైలం, నరేందర్, షేక్‌బురాన్, నర్సింహులు, చిలకలగూడ సీఐ నరేష్‌లతోపాటు సిబ్బందిని సౌత్‌జోన్ టాస్‌్కఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా అభినందించి రివార్డులు ప్రకటించారు. (చదవండి: ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు: కేటీఆర్) -
ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ రియాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ అడ్మిన్ బీఎన్ఎస్ రెడ్డి, ఐటీ ఇన్స్పెక్టర్ రమేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్ బైక్స్ ప్రత్యేకతలివే: ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, కళ్లద్దాలు, ఎల్ఈబా బాటన్ తదితర వస్తువులు ఉంటాయి. టాస్క్‌ఫోర్స్ ప్యాట్రోలింగ్ ఇక్కడే.. ►మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ– లెమన్ ట్రీ– మైండ్ స్పేస్ ►కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 – ఐటీసీ కోహినూర్ టాస్క్‌ఫోర్స్ విధులు ఏంటంటే.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి బైక్‌లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏఎస్) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్ చేయడం, నో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి. లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్ స్నాచింగ్‌లు జరిగినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు. -
మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ భేటీలోనే మంకీపాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనికి నేతృత్వం వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధి.. 16వేల మందికి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
రూ 3.14 కోట్ల మద్యం ధ్వంసం
నెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ, ఐదు సివిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన రూ 3.14 కోట్ల విలువైన మద్యాన్ని మంగళవారం ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి తన సిబ్బందితో ధ్వంసం చేయించారు. కొత్తూరు సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్డు రోలర్ ద్వారా సీసాలను తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై ఎస్ఈబీ, పోలీసులు దాడులు ముమ్మరం చేశారన్నారు. 2,774 కేసుల్లో పట్టు బడిన రూ.3,14,37,980 విలువజేసే 74,574 మద్యం బాటిళ్లను (15,719 లీటర్లు) ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఇన్చార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి,పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
టార్గెట్ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం
సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ 2024 ను సోనియా గాంధీ మంగళవారం వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించగా.. అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి స్థానం దక్కింది. కాగా, చింతన్ శిబిర్‌లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలు చేయాలని ఒక్కసారిగా డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలో ప్రియాంకకు స్థానం దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ-23)కు సైతం చోటుదక్కడం విశేషం. మరోవైపు.. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర(భారత్ జోడే యాత్ర) చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ సమస్యను హైలెట్ చేయాలని నిర్ణయించింది. భారత్ జోడే యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ కమిటీని ప్రకటించారు. కమిటీల్లో సభ్యులు వీరే.. పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. - రాహుల్ గాంధీ - గులాంనబీ ఆజాద్ - దిగ్విజయ్ సింగ్ - మల్లికార్జున ఖర్గే - కేసీ వేణుగోపాల్ - అంబికా సోనీ - ఆనంద్ శర్మ - జితేంద్ర సింగ్. టాస్క్‌ఫోర్స్ 2024 కమిటీ.. - ప్రియాంక గాంధీ - కేసీ వేణుగోపాల్ - రణదీప్ సూర్జేవాలా - చిదంబరం - ముకుల్ వాస్నిక్ - జయరాం రమేశ్ - అజయ్ మాకెన్ - సునీల్ కనుగోలు భారత్ జోడే పాదయాత్ర కమిటీ - శశి థరూర్ - సచిన్ పైలట్ - దిగ్విజయ్ సింగ్ - కేజే జార్జ్ - రంవీత్ సింగ్ బిట్టూ - ప్రద్యుత్ బోల్‌దోలోయీ - జీతూ పట్దారి - సలీమ్ అహ్మద్ ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. ఎస్పీజీ కంట్రోల్లో ఐఎస్బీ! సోషల్ మీడియా జల్లెడ -
పత్తి టాస్క్ఫోర్స్పై దళారుల ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ స్తబ్దుగా ఉండటం, ఇప్పటివరకు ఎలాంటి టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు ఈ విత్తనాలు చేరినట్టు సమాచారం. నిజానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విస్తృతంగా టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి, దాదాపు 200 మంది విత్తన దళారులపై కేసులు పెట్టారు. నకిలీ విత్తనాలను కొంతవరకు అరికట్టగలిగారు. కానీ ఈసారి దళారులు, కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక.. రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేసినా.. గతేడాది సాధారణం కంటే తక్కువగా 46.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 75 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు కూడా ఈసారి పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్లో తొలి వర్షం పడగానే పత్తి నాట్లు మొదలవుతాయి. ఈ క్రమంలో 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు సన్నాహాలు చేసుకున్నాయి. విత్తన దళారులు ఇదే అదనుగా భావించి నకిలీ పత్తి విత్తనాలను రంగంలోకి తెచ్చారు. కొన్ని సంస్థలు నిషేధిత హెచ్‌టీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు తరలించి జిల్లాల్లో తమ దళారులకు అప్పగించినట్టు తెలిసింది. పలుచోట్ల ఇప్పటికే ఈ విత్తనాలను రైతులకు అంటగట్టారు. టాస్క్‌ఫోర్స్ ఏదీ? గత ఏడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విస్తృతంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను, దళారులను పట్టుకుంది. ఇంతచేసినా ఆరేడు లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలు, హెచ్‌టీ పత్తి సాగయింది. రైతులు భారీగా నష్టపోయారు. అయితే టాస్క్‌ఫోర్స్ దాడుల వల్ల నష్టపోయిన నకిలీ విత్తన మాఫియా ఈసారి ముందుగానే వ్యవసాయశాఖలోని కొందరు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చిందని.. భారీగా ముడుపులు సమర్పించుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలకు సంబంధించి ఇప్పటివరకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. భారీగా వెనకేసుకునేందుకు.. విత్తన డీలర్లకు ఒక పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ.25–30 వరకే లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను రైతుకు విక్రయిస్తే రూ.500 దాకా.. అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 దాకా మిగులుతుంది. ఈ క్రమంలోనే డీలర్లు, విత్తన వ్యాపారులకు నకిలీ విత్తన మాఫియా ఎర వేసి.. వారి ద్వారా రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు పెట్టుబడికి డబ్బులు లేక.. డీలర్ల వద్ద అప్పుగా విత్తనాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యాపారి ఇచ్చిన నకిలీ విత్తనాలు తీసుకోవాల్సి వస్తోంది. -
పుష్పరాజ్‌లపై ‘సెబ్’ నిఘా
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తెస్తూ రూపొందించిన వ్యూహం విజయవంతమవుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ డీఐజీ పర్యవేక్షణలో ‘సెబ్’ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేస్తోంది. పటిష్ట నిఘా.. ముమ్మర కూంబింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ‘సెబ్’ బహుళ అంచెల వ్యవస్థను నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారంతో పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లను గుర్తించి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. మన రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల నరికి వేతలో పాల్గొంటున్న కూలీలు, రవాణా వాహనా లను సమకూర్చే వారిని గుర్తించింది. స్మగ్లర్లపై హిస్టరీ షీట్స్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసింది. కనీసం రెండు పార్టీలు నిరంతరం కూంబింగ్ చేసేలా షెడ్యూల్ రూపొందించింది. అటవీ, రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ శాఖల సహకారంతో దాడులు తీవ్రతరం చేస్తోంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దశాబ్దం తరువాత తొలిసారిగా.. రెండేళ్లుగా సెబ్ బృందాలు పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నాయి. 520 కేసులు నమోదు చేసి 2,546 మందిని అరెస్టు చేశారు. 18,033 ఎర్రచందనం దుంగలు, 345 వాహనాలను జప్తు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టడం దశాబ్దం తరువాత ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తండ్రి ఎస్సై..కొడుకు 18 కేసుల్లో నిందితుడు
సాక్షి, రాంగోపాల్‌పేట్: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్‌లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని బతుకమ్మ ఘాట్‌వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్‌కుమార్ తాను టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్–1 లోని కమల్ వాచ్ షోరూమ్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్‌ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని నేరుగా నెక్లెస్‌రోడ్‌కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై బాధితులు రాంగోపాల్‌పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, బీఫిట్ లింక్ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో బెదిరింపులు.. నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై నాన్‌బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్‌కుమార్ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్‌పై పోలీస్ స్టిక్కర్‌తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది)