
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్‌రావు
సాక్షి, సిటీబ్యూరో : పేటీఎం యాప్‌నకు ప్లే వెర్షన్ అయిన ‘ప్రాంక్ పేటీఎం’ వినియోగించి మాల్స్‌కు టోకరా వేశాడు. ముఠా కట్టి ఐదు ప్రాంతాల్లో కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. ఏడాది కాలంగా దాదాపు రూ.70 లక్షల వరకు స్వాహా చేశాడు. ఈ గ్యాంగ్‌పై సిటీలోని తొమ్మిది ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ముఠాను మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో సూత్రధారి, అతడి రెండో భార్య సహా ఐదుగురు చిక్కారని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్ నమోదుకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
మాల్స్ టార్గెట్...
మొబైల్ వ్యాలెట్ పేటీఎంలో రెండు రకాలు ఉంటాయి. కొందరు వ్యాపారులు వ్యక్తిగతంగా తమ సెల్‌ఫోన్లలో బిజినెస్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇలాంటి దుకాణాల్లో పేటీఎం వినియోగిస్తే, నగదు బదిలీ సమాచారం తక్షణం ఆ యజమానికి వస్తుంది. షాపింగ్‌మాల్స్‌తో పాటు కొన్ని బడా స్టోర్స్‌లో కంప్యూటర్ యాడెడ్ వెర్షన్ ఉంటుంది. ఇక్కడ నగదు చెల్లించింది? లేనిది? వినియోగదారుడి ఫోన్ ద్వారా మాత్రమే తక్షణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. జహనుమ ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకున్నాడు. విజయ్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్ అమన్ అహ్మద్‌తో కలిసి భారీ స్కెచ్ వేశాడు. ప్లేస్టోర్‌లో పేటీఎంకు ప్లే వెర్షన్ ‘ప్రాంక్ పేటీఎం’ అందుబాటులో ఉంటుంది.
దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న ఈ ద్వయం నగరంలో ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న మాల్స్, భారీ షాపింగ్ దుకాణాలకు వెళ్లేది. అక్కడ తమకు అవసరమైన వస్తువుల్ని ఖరీదు చేసేది. బిల్లింగ్ పూర్తయిన తర్వాత కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి నుంచి పేటీఎం ఫోన్ నెంబర్ తీసుకునేది. దీన్ని తమ ఫోన్‌లో ఉన్న ‘ప్రాంక్ పేటీఎం’లో ఎంటర్ చేయడం ద్వారా నగదు చెల్లించినట్లు చూపించేది. ఈ యాప్‌లో జనరేట్ అయ్యే ఓ డమ్మీ ట్రాన్సాక్షన్ ఐడీని సదరు ఉద్యోగికి చెప్పి, నగదు బదిలీ అయినట్లు చూపించి సరుకు పట్టుకుపోయేది. ఆయా మాల్స్‌కు చెందిన వారు ఆడిటింగ్ చేసే వరకు మోసపోయిన విషయం గుర్తించలేకపోయేవి. ఒకసారి వెళ్లిన మాల్‌కు మరోసారి వెళ్లకుండా మోసాలకు పాల్పడిన వీరిద్దరి పైనా ఇప్పటి వరకు నారాయణగూడ, అబిడ్స్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.
నిరుద్యోగులనూ మోసం...
మహ్మద్ అలీ ‘ప్లేటీఎం’ మాత్రమే కాకుండా జాబ్ ఫ్రాడ్స్‌కు పాల్పడ్డాడు. తన రెండో భార్య రేష్మతో పాటు మరో ఐదుగురితో కలిసి ముఠా కట్టాడు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ప్రతి ఆఫీస్ గరిష్టంగా రెండు నెలల మాత్రమే పని చేసేది. ఈ ముఠా సభ్యులైన సయ్యద్ సాధిక్, నరేష్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ అలీలు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలైన విప్రో, అమెజాన్, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి కార్యాలయాల వద్దకు వెళ్లేవారు. అక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వెళ్లి వస్తున్న వారిని గుర్తించేవారు. అదును చూసుకుని వీరితో మాటలు కలిపే గ్యాంగ్ మెంబర్స్ తమకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని దొడ్డిదారిన ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారు.
ఆకర్షితులైన వారికి తమ కన్సల్టెన్సీ చిరునామా చెప్పి అక్కడకు రమ్మని సూచించేవారు. అలా వచ్చిన వారికి రేష్మ ఇంటర్వ్యూలు నిర్వహించేది. ఎంపికయ్యారని చెప్తూ అందినకాడికి వారి నుంచి దండుకునేవారు. వీరికి ఆయా సంస్థ పేర్లతోనే ఈ–మెయిల్స్ రూపంలో ఆఫర్ లెటర్స్, బోగస్ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ పంపడం బీటెక్ మధ్యలోనే ఆపేసిన మహ్మద్ ఫిర్దోష్ బాధ్యత. ఆయా అభ్యర్థులు నగదు చెల్లించి, ఈ లేఖలు తీసుకున్న తర్వాత సదరు సంస్థకు వెళ్లిన తర్వాతే మోసపోయామని గుర్తించేవారు. ఈలోపు ముఠా తమ కేరాఫ్ అడ్రస్‌ను మార్చేసి తప్పించుకునేది. ఇలా దాదాపు 50 మంది నుంచి రూ.50 లక్షల వరకు దండుకున్న వీరిపై సుల్తాన్‌బజార్, మలక్‌పేట, హబీబ్‌నగర్, మాదాపూర్, కేపీహెచ్‌బీ ఠాణాల్లో ఆరు కేసులు నమోదయ్యాయి.
పట్టుకున్న టాస్క్‌ఫోర్స్...
ఈ ముఠా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప తమ బృందాలతో రంగంలోకి దిగారు. అనేక ప్రాంతాల్లో గాలించిన నేపథ్యంలో బుధవారం మహ్మద్ అలీ, ఫిర్దోష్, సాధిఖ్, రేష్మ, నరేష్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.59 వేల నగదు, బోగస్ ఆఫర్ లెటర్లు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం, బంగారు ఆభరణాలు తదితర స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన మహ్మద్ అలీ ఈ ముఠాకు నేతృత్వం వహిస్తూ వ్యూహరచన చేసేవాడని అధికారులు చెప్తున్నారు. ఇతడి రెండో భార్య రేష్మ నెలకు దాదాపు రూ.60 వేల వరకు ఖర్చు చేసేదని గుర్తించామన్నారు. 2013లో జాబ్ ఫ్రాడ్స్ పాల్పడిన నేపథ్యంలోనే అలీని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీన్ని సైతం ఎగ్జిక్యూట్ చేయడానికి నిర్ణయించారు. రేష్మపై నారాయణగూడ, కేపీహెచ్‌బీ ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. ప్రాంక్ పేటీఎం యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాపారులకు సూచించారు.