రూ.100 పేటీఎం లావాదేవీ.. రూ.6 కోట్ల దోపిడీ దొంగలను పట్టించింది! | Rs 100 Paytm Transaction Led To Arrest Men Who Looted Rs 6 Crore | Sakshi
Sakshi News home page

రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు!

Published Sat, Sep 3 2022 9:19 PM | Last Updated on Sat, Sep 3 2022 9:19 PM

Rs 100 Paytm Transaction Led To Arrest Men Who Looted Rs 6 Crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దొంగతనాలను పోలీసులు చాలా తెలివిగా ఛేదిస్తుంటారు. ఎంత తెలివైన దొంగలైనా ఎక్కడో ఒకచోట చిన్న తప్పు చేస్తారని, దాంతోనే పట్టుబడతారని చాలా కేసుల్లో రుజువైంది. ఇప్పుడు అలాంటి కేసునే ఛేదించారు ఢిల్లీ పోలీసులు. రూ.100 పేటీఎం లావాదేవీని ఆసరాగా చేసుకుని రూ.6 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాల దోపిడీకి పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. ఢిల్లీలోని ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలో జరిగిన దోపిడీకి సంబంధించి శుక్రవారం రాజస్థాన్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సోమ్‌వీర్‌ అనే వ్యక్తి చండీగఢ్‌లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన సహోద్యోగితో కలిసి గత బుధవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పహాడ్‌గంజ్‌లోని సంస్థ కార్యాలయం నుంచి పార్సిళ్లను తీసుకొని వెళ్తున్నారు ఇరువురు. కొద్ది దూరంలో అప్పటికే ఇద్దరు యువకులు కాపు కాచి ఉన్నారు. అందులో ఒకరు పోలీసు యూనిఫాం ధరించాడు. తనిఖీల పేరిట వారిని అడ్డుకున్నారు దుండగులు. అంతలోనే.. మరో ఇద్దరు నిందితులు వారితో కలిశారు. ఈ క్రమంలో దుండగులు బాధితుల కళ్లలో కారం చల్లి.. విలువైన బంగారు ఆభరణాలు ఉన్న పార్సిళ్లతో పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సంఘటనాస్థలం, పరిసరాల్లో దాదాపు 700 సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి సమీపంలో నలుగురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వారు ఓ క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడటం కనిపించింది. అందులో ఒకరు చాయ్‌ తాగేందుకు లిక్విడ్ క్యాష్‌ కోసం పేటీఎం ద్వారా క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.100 ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు గుర్తించారు. ఆ లావాదేవీని విశ్లేషించగా.. నిందితులు ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌వాసులుగా తేలింది. దోపిడీ అనంతరం వారు రాజస్థాన్‌కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో జైపూర్‌ వెళ్లిన ఓ పోలీసు బృందం శుక్రవారం నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు నగేశ్‌ కుమార్‌(28), శివం(23), మనీశ్‌ కుమార్‌(22)లుగా గుర్తించారు. వారి నుంచి సుమారు రూ.ఆరు కోట్ల విలువైన మొత్తం 6,270 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, ఐఐఎఫ్‌ఎల్‌లో డిపాజిట్‌ చేసిన 500 గ్రాముల బంగారం, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొకరిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దోపిడీకి సూత్రధారి అయిన నగేష్.. తన స్నేహితులు, మామతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని డీసీపీ వెల్లడించారు.

ఇదీ చదవండి: యువతులే అతని టార్గెట్‌.. వెలుగులోకి నిత్య పెళ్లి కొడుకు లీలలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement