సహజ సంఘటనల ఆధారంతో సినిమాలు తీస్తున్నారా లేక సినిమాలు చూసి అదే కోవలో దోపిడీకి పాల్పడుతున్నారా అనే ప్రశ్నకు జవాబు దొరకదు. గుడ్డు ముందా? కోడి ముందా? అని ప్రశ్నించినట్లే అవుతుంది. ఇటీవల విడుదలైన ‘ధీరన్’ తమిళ చిత్రంలోని సన్నివేశాలను అచ్చుగుద్దినట్లుగా తలపించే రీతిలో చోటుచేసుకున్న సంఘటనలు ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను బలిగొన్నాయి. మరో ఇన్‌స్పెక్టర్, ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలతో రాజస్థాన్ ఆçస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు పోలీసు శాఖను గగుర్పాటుకు గురిచేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సాక్షి, చెన్నై: నగర శివారు ప్రాంతం కొళత్తూరురెట్టేరి సమీపంలోని లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యువెలరీ, కుదువ వ్యాపారం దుకాణం ఉంది. దుకాణ యజమాని ముకేష్‌కుమార్ గత నెల 16న మధ్యాహ్నం 1గంటకు షట్టర్‌కు తాళం వేసి భోజనానికి వెళ్లాడు. సాయంత్రం 4గంటలకు తిరిగి దుకాణానికి వచ్చిన అతను దొంగలు దోచుకున్న సంగతిని గుర్తించాడు. 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు చోరీకి గురైంది. ఈ దోపిడీపై రాజమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుకాణానికి పై భాగంలో వస్త్రవ్యాపారం పెట్టుకుంటామని యజమానిని నమ్మించి అద్దెకు చేరిన రాజస్థాన్‌కు చెందిన పాత నేరస్థులు నాధూరాం, దినేష్ చౌదరి ముఠాగా గుర్తించారు. చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే.విశ్వనాథన్ ఆదేశాల మేరకు మధురవాయల్ శాంతిభద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ పెరియపాండి, కొళత్తరు ఇన్‌స్పెక్టర్ మునిశేఖర్ నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందం గత నెల 18వ తేదీ నుంచి రాజస్థాన్‌లో దుండగుల కోసం గాలిస్తున్నారు. దోపిడీతో సంబంధం ఉన్న జెన్‌రాం (60), శంకారీ (40), ధనరాం (55), టిక్కారాం (49)లను ఒక పోలీసు బృందం అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకొచ్చింది.
వీరి నుంచి ప్రధాన నిందితుడి వివరాలు సేకరించి రిమాండుకు పంపారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమైన సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్లు పెరియపాండి, మునిశేఖర్ అదే రోజు విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. పల్లి జిల్లా జయధరన్ పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపూర్‌కలన్ గ్రామంలో నాధూరాం దాక్కుని ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో బుధవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల ప్రాంతంలో దుండుగులు దాక్కొని ఉన్న ఇంటిని చుట్టుముట్టి లోనికి చొరబడ్డారు. లోపల ఉన్న దొంగలు పోలీసులపై తూటాల వర్షం కురిపించారు.
ఇన్‌స్పెక్టర్ పెరియపాండియన్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరో ఇన్‌స్పెక్టర్ మునిశేఖర్, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అనూహ్యరీతిలో సాగిన ఎదురుదాడి నుంచి తమిళనాడు పోలీసులు తేరుకునే లోగా నాథూరాం, దినేష్ చౌదరి వారి అనుచరులు తప్పించుకు పారిపోయారు. రాజస్థాన్ పోలీసులు గాయపడిన తమిళనాడు పోలీసులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమాచారం అందుకున్న చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ సహాయ కమిషనర్ ముకేష్‌కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్‌కు పంపారు. పెరియపాండి భౌతికకాయాన్ని చెన్నైకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాల్పులకు పాల్పడిన ముఠాపై కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు గాలింపు చేపట్టారు.
పరామర్శల వెల్లువ: దొంగల ముఠా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్‌స్పెక్టర్ పెరియపాండి కుటుంబ సభ్యులను బుధవారం పలువురు పరామర్శించారు. చెన్నై కమిషనర్ ఏకే.విశ్వనాథన్, డీఎంకే నేత స్టాలిన్ బుధవారం ఉదయం నేరుగా వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.కోటి సహాయాన్ని ప్రకటించారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్‌కోవిల్‌కు చెందిన పెరియపాండి 1969 మార్చి4వ తేదీన జన్మించారు. 2000 మే 22వ తేదీన పోలీస్‌శాఖలో ఏఎస్‌ఐగా చేరి ఆ తరువాత ఎస్‌ఐగా, 2014 జనవరి 21వ తేదీన ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ ఏడాది అక్టోబర్ 10న మధురవాయల్ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పెరియపాండికి భార్య భానురేఖ (40), రూపన్ (17), రామన్ (14) ఇద్దరు కుమారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment