
చిత్తూరు, సాక్షి: పట్టణంలో జరిగిన దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ కోసం చేసిన ప్రయత్నమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
బుధవారం వేకువ జామున కాల్పుల కలకలంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి ప్రవేశించిన దొంగల ముఠా.. ఆపై పోలీసులు రావడంతో తుపాకులతో హల్‌చల్ చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకోగలిగారు. అనంతరం నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టారు.

ప్రముఖ ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టాలతో బాగా అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో కర్ణాటక, ఉత్తర రాష్ట్రాలకు చెందిన మొత్తం ఆరుగురు దొంగలతో డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ ఉదయం డమ్మీ గన్స్, రబ్బరు బుల్లెట్లతో ఆ ముఠా గాంధీ రోడ్డులోని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సుబ్రహ్మణ్యం డమ్మీ గన్‌తో చంద్రశేఖర్‌ను బెదిరించాడు. అయితే.. చంద్రశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి దొంగలను లోపలే లాక్ చేయగలిగాడు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.
ఆపై బయటకు వచ్చిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అది గమనించిన స్థానికులు వాళ్లపై దాడికి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ దొంగల నుంచి మూడు తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం..బిల్డింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది.
డీఎస్సీ మణికంఠ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్, అక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల భవనాల నుంచి జనాలను ఖాళీ చేయించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పోలీసులు బలగాలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అది గమనించిన దొంగలు పారిపోయే యత్నం చేశారు. ఈ క్రమంలో శివారులో మరో దొంగను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment