
3,300 క్యారెట్ల వజ్రాలు సహా సొత్తు అపహరణ
20 గంటల్లోనే కేసు ఛేదించిన నగర పోలీసులు
నాగ్‌పూర్‌లో ముగ్గురు నిందితుల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు.
కుమార్తె పెళ్లి పనుల కోసం..
రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్‌లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది.
నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో..
సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు.
దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.
మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు...
మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.
చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ
దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.

ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాం
రోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment