సీజ్ చేసిన వాహనాలు
నవీపేట(బోధన్): ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేసి, రెండు టిప్పర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం వేకువజామున నాళేశ్వర్ నుంచి నిజామాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండలంలోని జన్నెపల్లి, నాళేశ్వర్, శాఖాపూర్, చిక్లి వాగుల నుంచి కొందరు ఇసుకాసురులు రాత్రి వేళల్లో నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని రెవెన్యూ, పోలీసులకు వివిధ గ్రామాల రైతులు, యువకులు పలుమార్లు ఫోన్‌లో ఫిర్యాదులు చేశారు.
అయితే, వారు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని కొందరు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పగడ్బందీగా దాడులు చేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఇసుక రవాణాలో ముదుర్లుగా పేరున్న గాంధీనగర్, చిక్లి క్యాంప్‌లకు చెందిన ఇరువురు ఎప్పటిలాగే నాళేశ్వర్ వాగు నుంచి నిజామాబాద్ వైపు రెండు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పథకం ప్రకారం నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వాహనాలను వెంబడించి పాల్దా సమీపంలో పట్టుకున్నారు. ఈ రెండు వాహనాలకు రక్షణగా ఉన్న కారును కూడా సీజ్ చేశారు. టిప్పర్లతో పాటు కారును స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment