
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.
ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్‌ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.
అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్‌ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు.


ముంబై దాడుల్లో భాగస్వాములు
డేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి.
ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్‌లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్‌గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్ డిసస్టట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది.