Mumbai 26/11
-
కుటుంబ పార్టీలతో పెద్ద ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి రాజకీయ పార్టీలే పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై ఒకే కుటుంబానికి చెందిన తరతరాల నేతలు పెత్తనం చెలాయించడం మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాల్లో మోదీ ప్రసంగించారు. ‘కుటుంబం కోసం పార్టీ, కుటుంబంతో పార్టీ ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది అంబేడ్కర్ గౌరవానికి, మన రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన వేడుక అని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీల కారణంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా దేశం ఒక రకమైన సంక్షోభం వైపు పయనిస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది సొంత ప్రతిభ, ప్రజల ఆశీర్వాదాలతో ఒక పార్టీలో చేరి రాణిస్తే అది వంశపారంపర్య పార్టీ కాబోదన్నారు. కానీ, పార్టీపై ఒకే కుటుంబం తరతరాలుగా స్వారీ చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ముంబైలో 26/11 ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ప్రధాని నివాళులర్పించారు. అవినీతిపరులను కీర్తిస్తారా? భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. వలసవాద మనస్తత్వం కలిగిన శక్తులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఇవి పార్లమెంట్ వేడుకలు: ఓం బిర్లా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పార్లమెంట్‌కు చెందినవని, ప్రభుత్వానివి కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షాలు పాల్గొంటే బాగుండేదని అన్నారు. ఉభయ సభల్లో జరిగిన చర్చల డిజిటల్ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్డ్ కాపీ డిజిటల్ వెర్షన్, అన్ని సవరణలతో కూడిన రాజ్యాంగ ప్రతిని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ బిర్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి: రాష్ట్రపతి కోవింద్ రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి మా ట్లాడారు. ఏ పార్టీకి చెందిన సభ్యులైనా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, విధాన సభ, పార్లమెంట్‌కు ఎంపికయ్యే ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. 15 పార్టీలు గైర్హాజరు రాజ్యాంగ దినోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ తదితర 15 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు బిజూజనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ, టీడీపీ పాల్గొన్నాయి. ఆదర్శాల ప్రకటనే రాజ్యాంగం: వెంకయ్య సంభాషణలు, చర్చల ద్వారా చట్టసభలు దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగం అనేది విలువలు, ఆలోచనలు, ఆదర్శాల ప్రకటన అని అన్నారు. సోదరభావం స్ఫూర్తితో అం దరికీ న్యాయం, స్వేచ్ఛ కల్పించిందని తెలిపా రు. జాతీయ ఐక్యత కోసం ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు ప్రజా ప్రతినిధులందరూ కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీది నిరంకుశ ధోరణి: కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినం కార్యక్రమాల్లో తాము పాల్గొన లేదని కాంగ్రెస్ తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. పార్లమెంట్ పరిశీలనతో నిమిత్తం లేకుండానే చేసే చట్టాలు వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రేరేపిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రేరేపిత, లక్ష్యంగా చేసుకొని సాగించే దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఓ పెద్ద కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని చెప్పారు. న్యాయవాదులు అబద్ధాలకు వ్యతిరేకంగా, నిజం వైపు నిలవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎన్వీ రమణ మాట్లాడారు. ‘‘న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తులకు, వ్యవస్థకు సహకరించాలి. మనమంతా ఓ పెద్ద కుటుంబంలో సభ్యులం. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ఎవరూ మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. -
రూ.9,201 కోట్ల సాయాన్ని నిలిపివేస్తాం
వాషింగ్టన్ : పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరగాలని పోరాడుతోన్న భారతదేశానికి తాము అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఉగ్ర దాడులు జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృతిచెందారు. బాధితుల పక్షాన పోరాడుతోన్న భారత్‌కు తోడుగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని గెలవనీయం. కనీసం గెలుపు దగ్గరికి కూడా వారిని రానీయం’అని ట్రంప్ ట్వీట్ చేశారు. ‘తీవ్రవాదాన్ని అంతమొందించడంలో పాక్ మాకు సహకరించడం లేదు. అందుకే ఇక నుంచి పాకిస్తాన్‌కు ఏటా ఇస్తున్న రూ. 9,201 కోట్ల మొత్తాన్ని ఇకపై ఇవ్వబోము’ అని పేర్కొన్నారు. ఇక.. 26/11 ఉగ్రదాడి సూత్రధారుల గురించి గానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి గానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. On the ten-year anniversary of the Mumbai terror attack, the U.S. stands with the people of India in their quest for justice. The attack killed 166 innocents, including six Americans. We will never let terrorists win, or even come close to winning! — Donald J. Trump (@realDonaldTrump) November 26, 2018 కాగా గతేడాది ఆగస్ట్‌లో.. ట్రంప్ దక్షిణాసియా విధానం వెల్లడించిన అనంతరం అమెరికా, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు అందిస్తున్న భారీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని కూడా ట్రంప్ నిర్ణయించారు. పాక్ ప్రభుత్వం తమ భూభాగంలో ఉగ్ర సంస్థ అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌కు ఆవాసం కల్పించిందని ఆరోపించారు. ఇందులో తాను కొత్తగా చెబుతోంది ఏమీ లేదని, ఈ విషయాలన్నీ బహిరంగ రహస్యమేనని గత వారం ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. -
‘అమితాబ్ కోసం వస్తే 26/11 దాడుల్లో ఇరికించారు’
ముంబై : ‘నేను అమితాబ్ బచ్చన్‌కి పెద్ద ఫ్యాన్‌ని.. ఆయన బంగ్లా చూడటానికి ఇండియా వచ్చాను. కానీ ‘రా’ అధికారులు నా పాస్ పోర్ట్ లాక్కుని నన్ను అరెస్ట్ చేశారు’.. ఇవి కరుడు కట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కోర్టు ముందు చెప్పిన కట్టుకథ. ముంబై 26/11 ఉగ్ర దాడులు జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ దాడి తాలుకా గాయం నేటికి పచ్చిగానే ఉంది. దాదాపు 166 మంది అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యావత్ దేశాన్ని భయకంపితం చేసిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే వీరిలో అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఉగ్రదాడుల తరువాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు కసబ్‌ని విచారించిన నాటి పోలీసు అధికారి రమేష్ మహలే. ముంబై 26/11 దాడుల కేస్ విచారణాధికారిగా నియమితులయ్యారు మహలే. అప్పటి విషయాలను తల్చుకుంటూ.. ‘కసబ్ చాలా తెలివిగలవాడు. పోలీసులను బురిడి కొట్టి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలు సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే అబద్దాలు చెప్పడం కసబ్ ప్రవృత్తి. కానీ నేర విచారణ విభాగంలో నాది దాదాపు 25 ఏళ్ల అనుభవం. నేను రాకేష్ మరియా, దేవెన్ భార్తి వంటి అనుభవజ్ఞులైన అధికారులతో కలిసి పని చేశాను. ఆ అనుభవం నాకు 26/11 కేసు విచారణ సమయంలో బాగా ఉపయోగపడిందంటూ చెప్పుకొచ్చారు మహలే. ‘పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకోవడానికి ముందు కసబ్ పలు అసాధరణమైన అబద్దాలు చెప్పాడు. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చాక అతడి అబద్దాలు మరింత ముదిరాయి. కోర్టులో ఏకంగా అమితాబ్ బచ్చన్ పేరును వెల్లడించాడు. తాను అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానినని తెలిపాడు. కేవలం బిగ్‌బీ నివాసం చూడటం కోసమే తాను ఇండియా వచ్చానని.. కానీ రా అధికారులు తన మీద తప్పుడు కేసు నమోదు చేశారంటూ కసబ్ కోర్టులో ఆరోపించాడు. రా అధికారులు తన దగ్గరకు వచ్చి తన పాస్‌పోర్టును లాక్కుని.. చించివేశారని.. తరువాత తనను 26/11 దాడులు జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారంటూ’ కసబ్ వాదించాడని మహలే గుర్తు చేసుకున్నారు. ‘అయితే కసబ్ చెప్పేవన్ని అబద్దాలే. వాటన్నింటికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకే 47 తుపాకీ పట్టుకుని ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గర నిల్చున్న కసబ్ ఫోటో అక్కడ ఉన్న సీసీటీవీలతో పాటు.. జర్నలిస్ట్‌ల దగ్గర కూడా ఉంది. దాంతో కసబ్ వాదనలు ఏ కోర్టులో నిలవలేదు. ఆ తరువాత నెమ్మదిగా కసబ్ ఈ దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించడం ప్రారంభించాడు. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. ‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’.. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి 2008 నవంబరు 26న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. -
‘వారు బిర్యాని తినిపిస్తే.. మేం తూటాలు తినిపించాం’
జైపూర్ : కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది కాబట్టే దేశంలో 26/11 దాడులు జరిగాయంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మండిపడ్డారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్రానాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది. అందువల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యాని పెట్టి పోషిస్తే.. నేడు తాము అదే ఉగ్రవాదుల చేత తూటాలు తినిపించామని యోగి తెలిపారు. Congress has done divisive politics. As a result of that, terrorism was at its peak in the country. Today you can see that the terrorists which were fed Biryani by Congress are now being fed bullets by us: UP CM Yogi Adityanath in Makrana, Rajasthan pic.twitter.com/TEhaGf2a1r — ANI (@ANI) November 26, 2018 ముంబైలో 26/11 మరణహోమం జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 175 మంది మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వాల్ నికామ్, ముంబై జైళ్లో ఉన్నప్పుడు కసబ్ ప్రతిరోజు బిర్యాని కావాలని అడిగినట్లు పేర్కొన్నాడు. దాంతో అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే చేలరేగింది. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉజ్వాల్ వివరణ ఇస్తూ కసబ్‌కు అనుకూలంగా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గాను తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. అంతేకాక ప్రభుత్వం కసబ్‌కు ఎప్పుడు బిర్యానీని అందించలేదని కూడా వివరించారు. ముంబై 26/11 కేసులో దోషిగా నిర్ధారించబడిన కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు. -
26/11 దాడులు: అమెరికా భారీ రివార్డు
వాషింగ్టన్: ముంబైలో 26/11 మరణహోమం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల వెనుక ఉన్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి భారీ నజరానా అందజేయనున్నట్టు ప్రకటించింది. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి సూత్రధారుల గురించి కానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి కానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. ఈ ఉగ్రచర్య జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం తరఫున, అమెరికా ప్రజల పక్షాన భారత ప్రజలకు, ముంబై వాసులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ అనాగరిక చర్య ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిందని పొంపియో అన్నారు. ఈ దాడిలో కుటుంబసభ్యులను కోల్పోయినవారికి, గాయపడ్డవారికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఈ దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి క్రూరమైన చర్య జరిగి పదేళ్లు గడిచినప్పటికీ.. ఈ దాడికి సూత్రధారులను పట్టుకుని శిక్షించకపోవడం బాధితుల కుటుంబాలను అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు భాద్యులైన లష్కరే తోయిబాతో సహా దాని అనుబంధ సంస్థలపై అంక్షలు అమలు చేయాలని ఐకరాజ్యసమితి భద్రత మండలి తరఫున ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఈ దుర్మార్గపు చర్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాగా, అమెరికా ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి. 2008 నవంబర్ 26న భారత ఆర్థిక రాజధానిపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన పాక్ ఉగ్రమూకల బారిన పడి 166మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రమూకలను మట్టుపెట్టే క్రమంలో పలువురు పోలీసులు వీర మరణం పొందారు. ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను భద్రత బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. కసబ్‌కు న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో.. 2012లో అతడిని ఉరితీశారు. ఈ దాడికి కారకులను శిక్షించడంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పిన దాయాది దేశం.. కుట్రదారులు వారి దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. సంబంధిత కథనాలు: మరో దాడి జరిగితే యుద్ధమే..! 26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం -
నిఘా లోపం వల్లే ముంబై మారణహోమం
అమెరికా, బ్రిటన్, భారత ఏజెన్సీల దారుణ వైఫల్యం న్యూయార్క్: గూఢచార చరిత్రలోనే అతి దారుణమైన వైఫల్యం వల్లే 26/11 ముంబై మారణహోమం చోటు చేసుకుందట. ఈ మారణకాండను అడ్డుకునేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకోవడంలో అమెరికా, బ్రిటన్, భారత నిఘా ఏజెన్సీలన్నీ విఫలమయ్యాయట. అత్యాధునిక నిఘా వ్యవస్థ ద్వారా కీలక సమాచారం లభించినా.. సమాచార మార్పిడిలో ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్లే భారత ఆర్థిక రాజధాని నెత్తురోడిందని పరిశోధనాత్మక నివేదిక ఒకటి తాజాగా వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్, ప్రోపబ్లికా, ద పీబీఎస్ ‘ఫ్రంట్‌లైన్’ సిరీస్‌లో భాగంగా ‘2008 ముంబై హత్యలు.. నిఘా సమాచారం వీడని చిక్కుముళ్లు’ పేరిట వివరణాత్మక నివేదికను రూపొందించింది. ఇందులో ముంబై మారణహోమానికి సంబంధించి వెలుగు చూడని వాస్తవాలను వెల్లడించింది. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై మారణహోమంలో ఆరుగురు అమెరికన్లతో పాటు 166 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మూడు దేశాల నిఘా ఏజెన్సీలు కలసి ముందుకు సాగలేదని, హైటెక్ సర్వైలెన్స్, ఇతర విభాగాల నుంచి సేకరించిన సమాచారాన్ని పంచుకోలేదని, ఇదే జరిగి ఉంటే ముంబైపై ఉగ్రదాడిని అపగలిగే వారని ఆ నివేదికలో వెల్లడించింది. ముంబై దాడులకు సంబంధించి విలువైన డిజిటల్ డేటా ఎంతో అందుబాటులో ఉన్నా క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారని, ఎన్ఎస్ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ బహిర్గతం చేసిన కీలక పత్రాలను ఉదహరిస్తూ పేర్కొంది. లష్కరే తోయిబా టెక్నాలజీ చీఫ్ జరార్ షాకు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలను భారత, బ్రిటన్ నిఘా సంస్థలు పర్యవేక్షించాయని, భారత వ్యాపార వేత్త ఖరాక్సింగ్గా జరార్ పేరు మార్చుకుని అమెరికన్ కంపెనీ నుంచి వాయిస్ఓవర్ ఫోన్ పొందినప్పటికీ సదరు సమాచారాన్ని ఇరు దేశాలు దాడులకు ముందే పంచుకోలేదని వెల్లడించింది. అలాగే పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీకి 26/11 దాడులకు ఉన్న సంబంధంపై అందిన సిగ్నల్స్(ఈ-మెయిల్స్)ను కూడా నిఘా విభాగాలు గుర్తించలేకపోయాయంది. 3 దేశాల నిఘా నివేదికల్లోనూ హెడ్లీ పేరు లేదని, అతడిని కుట్రదారుగా కూడా గుర్తించలేకపోయాయని పేర్కొంది. -
పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న హఫిజ్ సయీద్!
ముంబై దాడుల(26/11) సూత్రధారి హఫిజ్ సయీద్ పాకిస్థాన్‌లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా హఫిజ్‌ను బంధించగలదా? లేక మునుపటి ప్రభుత్వం మాదిరే కాలానికి వదిలేస్తుందా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి ఆరేళ్లు పూర్తి అయింది. 2008 నవంబర్ 26న సముద్రమార్గంలో భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ముష్కర మూకలు జరిపిన దాడిలో 166 మంది చనిపోయారు. 358 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడ్డ 10 మందిలో 9 మందిని ఆపరేషన్‌లో భారత కమెండోలు కాల్చి పారేశారు. మరో ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకుని కొన్నేళ్ల విచారణ తర్వాత ఉరి తీశారు. కానీ పాశవికమైన ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా ఉన్న హఫిజ్ సయీద్ మాత్రం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అక్కడి ప్రభుత్వ సత్కారాలు కూడా పొందుతున్నాడు. పాక్ గూఢచార సంస్ధ ఐఎస్ఐ, పాక్ సైన్యం తోడ్పాటుతో పొరుగుదేశంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోన్న హఫిజ్ సయీద్ జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు. భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషం నూరిపోసే సయీద్ ప్రసంగాలంటే పాకిస్థాన్‌లో క్రేజ్ ఎక్కువ. సేవా కార్యక్రమాలు చేపడ్తోందని పాక్‌లో ప్రచారంలో ఉన్న జమాత్ ఉద్ దవా అక్కడి ఉగ్రవాదులకే కాక భారత్‌కు వ్యతిరేకంగా పోరాడే అన్ని ఉగ్రవాద సంస్థలకు అన్ని అండదండలూ అందిస్తోంది. లష్కర్ ఎ తొయిబా కూడా ఈ తాను ముక్కే. హఫిజ్ సయీద్ పూర్వీకులది హర్యానా. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. సయీద్ అక్కడే పుట్టాడు. విభజన సమయంలో తన పూర్వీకులు హత్యకు గురయ్యారని ప్రసంగాల్లో చెప్పే సయీద్ మాటల్లో నిజం ఎంతనేది ఇప్పటికీ అనుమానమే అని పోలీసు వర్గాలు చెబుతుంటాయి. తొలుత ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన తాలిబన్లతో సత్సంబంధాలు నెరపిన సయీద్ ఆ తర్వాత తన లక్ష్యాన్ని భారత్‌పైకి మార్చాడు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులకు సహకరించి అరెస్ట్ అయిన డేవిడ్ హెడ్లీ సిఐఏకు అన్ని విషయాలూ పూసగుచ్చినట్లు చెప్పారు. సయీద్ ఏ రకంగా భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నదీ వివరించాడు. ఒక్క ముంబై దాడే కాదు, భారత్‌లో జరుగుతున్న అనేక ఉగ్రవాద కార్యక్రమాలకు హఫిజ్ సయీద్ కీలకంగా ఉన్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై దాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడి చంపిన అమెరికా హఫిజ్ సయీద్ భరతం కూడా అలాగే పడుతుందా అనేది అనుమానాస్పదమే. పేరుకు మోస్ట్ వాంటెడ్ అనే ముద్ర వేసి సయీద్ తలపై కోట్ల రూపాయల నజరానా ప్రకటించినా అమెరికా సయీద్‌ను భారత్‌కు పట్టివ్వడంలో సీరియస్‌గా లేదు. అమెరికా సహకరించినా, సహకరించకపోయినా హఫిజ్ సయీద్‌ను భారత సర్కారు కోర్టు ముందు నిలబెట్టగలదా? అనేది అనుమానాస్పదమే. విదేశాంగ విధానంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని అంతర్జాతీయంగా కూడా దేశాలను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోన్న మోదీ సర్కారు హఫిజ్‌ను, భారత్‌పైకి టెర్రరిస్ట్ మూకలను ఉసిగొల్పి పంపుతున్న ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల మద్దతు అత్యంత ఆవశ్యకమనేది ఎవరూ కాదనలేని సత్యం. ప్రపంచ దేశాలు తెచ్చే ఒత్తిడితో పాక్ దారిలోకి రాక తప్పదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. **