వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే విషయంలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. రాణా వేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఆ దేశ లోయర్ కోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేయడానికి రాణాకు ఇక అవకాశాల్లేకుండా పోయాయి.
2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ రాణా. ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక, ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి ఇతడు అత్యంత సన్నిహితుడు. అలాగే..
దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. మరో కేసులో ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు గతంలో అనుకూలంగా కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా.. ఫెడరల్ కోర్టులతో సహా పలు పిటిషన్లు వేశాడు. చివరగా.. కిందటి ఏడాది నవంబర్ 13వ తేదీన సుప్రీం కోర్టులో రిట్ ఆఫ్ సెర్షియోరరి దాఖలు చేశాడు. డిసెంబర్ 16వ తేదీన వాదనలు జరిగాయి.
కింది కోర్టులు లేదంటే ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.
కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రెండు రకాలుగా ఉల్లంఘిస్తుందని రాణా తరఫు అటార్నీ వాదనలు వినిపించాడు. ఈ కేసులో ఇప్పటికే రాణాను ఇల్లినాయిస్(చికాగో) కోర్టు నిర్దోషిగా పేర్కొందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలినా లేదంటే నిరపరాధిగా నిరూపించినా.. అమెరికా-భారత్ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదని రాణా తరఫు అటార్నీ వాదించాడు.
మరోవైపు.. ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ ఎలిజబెత్ ప్రెలోగర్ వాదనలు వినిపించారు. భారత్ అభియోగాలను ఇల్లినాయిస్ పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చని, కాబట్టి ఆ దేశానికి అప్పగించే విషయంలో రాణాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకూడదని కోర్టును కోరారామె. అలాగే.. ఈ కేసును ప్రత్యేకమైందిగా పరిగణించాలని ఆమె కోరారు.
దీంతో.. రాణా వాదనలను తోసిపుచ్చిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేస్తూ జనవరి 21వ తేదీన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు దానిని కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతని ముందు దారులు మూసుకుపోయాయి.
భారత్‌కు ఇదో విజయం
తహవూర్ రాణా అప్పగింతకు అమెరికా సుప్రీం కోర్టు మార్గం సుగమడం చేయడాన్ని.. భారత విజయంగా అభివర్ణించారు సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్. అమెరికా సుప్రీం కోర్టు అతని వాదనలను, పిటిషన్‌లను తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే అతన్ని భారత్‌కు అప్పగిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment