ఎన్‌ఐఏ అదుపులో రాణా  | Mumbai terror attack plotter Tahawwur Rana lands in Delhi after US extradition | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ అదుపులో రాణా 

Published Fri, Apr 11 2025 4:34 AM | Last Updated on Fri, Apr 11 2025 7:13 AM

Mumbai terror attack plotter Tahawwur Rana lands in Delhi after US extradition

26/11 ముంబై దాడుల సూత్రధారి భారత్‌కు తరలింపు    

ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు  

20 రోజులపాటు తమ కస్టడీ ఇవ్వాలని ఎన్‌ఏఐ వినతి  

ఉత్తర్వును రిజర్వ్‌ చేసిన జడ్జి చందర్‌జిత్‌ సింగ్‌  

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్‌ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు తరలించారు. 

ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌ ఎదుట హాజరుపర్చారు. ఎన్‌ఐఏ తరఫున సీనియర్‌ అడ్వొకేట్లు నరేందర్‌ మాన్, దయాన్‌ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అడ్వొకేట్‌ పీయూష్‌ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్‌ కృష్ణన్‌ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్‌ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్‌ సమర్పించారు.   

అతిపెద్ద దౌత్య విజయం  
భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్‌ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 

2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది.    

ముంబైలో ఆ రోజు ఏం జరిగింది?  
2008 నవంబర్‌ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్‌ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్‌ ట్రిడెంట్‌ హోటల్, తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్‌ హౌస్, మెట్రో సినిమా హాల్‌ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 

ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్‌ కసబ్‌ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా  సహాయ సహకారాలు అందించినట్లు ఎన్‌ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో నిర్బంధించింది.  

ఎవరీ రాణా?  
పాకిస్తాన్‌లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్‌ అబ్దల్‌ కేడెట్‌ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్‌ కోలోమన్‌ హెడ్లీ అలియాస్‌ దావూద్‌ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్‌ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్‌ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. 

అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్‌ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు.    

రాణాను బహిరంగంగా
ఉరి తీయాలి: ఏక్‌నాథ్‌ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్‌ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్‌నాథ్‌ ఓంబలే డిమాండ్‌ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్‌పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్‌నాథ్‌ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్‌ ఎస్‌ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్‌ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్‌ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్‌ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.  

దాడులకు ముందు తాజ్‌మహల్‌ సందర్శన  
ఉగ్రవాది తహవ్వుర్‌ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్‌ 26న దాడులు జరిగాయి. నవంబర్‌ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్‌ సమ్రజ్‌ అక్త్తర్‌తో కలిసి రాణా నవంబర్‌ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్‌లోని సమ్రజ్‌ బంధువుల ఇళ్లకు వెళ్లారు.

 తర్వాత వేగన్‌ఆర్‌ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్‌లో బసచేశారు. మరుసటి రోజు తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్‌లో, జలవాయు విహార్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో బస చేశారు. జలవాయు విహార్‌లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్‌ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్‌ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు.  

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్‌  రాణాపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ అడ్వొకేట్‌ నరేంద్ర మాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్‌ కోర్టులో నరేంద్ర మాన్‌ వాదిస్తారు.  

దయాన్‌ కృష్ణన్‌ కృషి వల్లే..  
తహవ్వుర్‌  రాణాను రప్పించడం వెనుక సీనియర్‌ లాయర్‌ దయాన్‌ కృష్ణన్‌ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్‌ చేసిన వాదనను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆఫ్‌ సెంట్రల్‌ డి్రస్టిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్‌ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. 

రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్‌ గార్లిక్‌ క్యూసీ చేసిన వాదనను దయాన్‌ కృష్ణన్‌ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్‌ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరేందర్‌ మాన్‌కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్‌ కాలే సైతం ఉంటారని సమాచారం.  
 

అప్పటి హీరోనే ఇప్పటి ఎన్‌ఐఏ చీఫ్‌  
1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సదానంద్‌ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్‌ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు.

 ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ పేలి సదానంద్‌ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏకు సదానంద్‌ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్‌ 31దాకా ఆయన ఈ పదవిలో  కొనసాగుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement