National Investigating Agency
-
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్‌కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? ఎల్లో మీడియా రాసిన రాతలేంటి?
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్ఐఏ క్షుణ్నంగా విచారణ జరపాలన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా అసత్య రాతలు రాస్తోందని బొత్స మండిపడ్డారు. ఒక వ్యక్తే హత్యాహత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమన్నారు. ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? మీరు రాసిన రాతలేంటి అని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, కూతలను తీవ్రంగా ఖండించారు. '2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? సానుభూతి కోసమే చంద్రబాబు దాడి చేయించుకున్నారా? చంద్రబాబుకు ఉన్నఅలవాట్లు ఎవరికీ ఉండవు. ఈనాడు వార్తలు నీచమైనవి. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగు దేశం మద్దతు దారుడు అవునా? కాదా? రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలి. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేశారు. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచారు. ఎన్ఐఏ నివేదికలో జగనే దాడి చేయించుకున్నారని చెప్పిందా? ఏ ఆధారాలతో రాస్తారు?' అని బొత్స ధ్వజమెత్తారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రైవేటికరణ ఆపాలని ఢిల్లీలో మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్, జనసేన చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భావనపాడు పోర్ట్‌ను టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవ్.' అని బొత్స హెచ్చరించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్.. -
గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు..
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశవ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, చండీగడ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు చేపడుతోంది. ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. గ్యాంగ్స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. చదవండి: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. -
ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయింది. ఈ కేసుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా గత నెల 25న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు ఎన్ఐఏ డీఎస్పీ రాజీవ్ కుమార్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ఈ ఎఫ్ఐఆర్ను ఆదివారం అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టు అయిన ఈ ఉగ్ర త్రయంపై తొలుత సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను సిట్ అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన బృందాలు వివిధ కోణాల్లో విచారించాయి. ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ కోణాలు అనేకం ఉన్నాయని నగర పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌కు సంబంధించిన కీలక వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉంది. వీరి నుంచి ఈ త్రయానికి విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆదేశాలు అందాయి. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు అక్కడ నుంచే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) మీదుగా కాశ్మీర్‌కు డ్రోన్ల ద్వారా డెడ్ డ్రాప్ విధానంలో చేరాయి. వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చారు. ఈ స్లీపర్ సెల్స్ ఎవరనే దాంతో పాటు ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని భావించిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్నీ ఆరా తీయాల్సి న అవసరం ఉందని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. వీటితో పాటు ఉగ్రవాదుల సంప్రదింపుల మార్గాలు, నగదు లావాదేవీలు గుర్తించడంతో సహా కీలక వివరాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. వీటితో పాటు ఈ కేసులో పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద ఆరోపణలు చేర్చా రు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కస్టడీకి తీసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. (చదవండి: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?) -
అంతర్జాతీయ ఉగ్రవాది కుమారుడి అరెస్ట్
శ్రీనగర్: ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు షకీల్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షకీల్‌ను రాంబాగ్‌లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. షకీల్ తన తండ్రి నుంచి ఉగ్రవాద నిధులు అందుకున్నట్లు 2011 ఏప్రిల్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సలాహుద్దీన్ పెద్ద కొడుకు షాహిద్‌ను జూన్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరు హవాలా మార్గం ద్వారా పాక్ నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అందించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇదే కేసులో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీతోపాటు మహ్మద్ సిద్దిఖి గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూక్ అహ్మద్ ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. -
పాట్నా పేలుళ్ల కేసులో మరో నిందితుడు అరెస్ట్
పాట్నాలో ఆదివారం వరుస బాంబుపేలుళ్ల ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొంత పురోగతి సాధించింది. ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి మరో నిందితుడిగా అనుమానిస్తున్న తాబిష్ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి బుధవారం పాట్నాలో వెల్లడించారు. తాబిష్ను మోతీహారి జిల్లాలో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఆ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో మహ్మద్ ఇమితియాజ్ అన్సారీ ఇచ్చిన సమాచారం మేరకు తాబిష్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పేలుళ్ల ప్రధాన సూత్రదారిగా భావిస్తున్న ఇంతియాజ్‌ను తాబిష్ తరచుగా కలిసేవాడని తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఆదివారం పాట్నాలలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ అనుమానితుగా ఉన్న ఇంతియాజ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తులో ఇంతియాజ్ కీలక సమాచారం అందించాడు. దాంతో ఎన్ఐఏ అధికారులు తాబిష్ను అరెస్ట్ చేశారు. పాట్నాలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.