లక్నో: సంచలనం సృష్టించిన కాస్‌గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది.
మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్‌గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment