
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్‌ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్‌ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.
వివరాల్లోకి వెళితే ఎన్‌ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్‌ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
రాణా ఖురాన్‌ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది.

అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్‌ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు