
న్యూఢిల్లీ: జేఈఈ–మెయిన్ ఆన్సర్ ఫైనల్ కీని విడుదల చేసే వరకు వేచిచూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) బుధవారం ఇంజనీరింగ్ విద్యార్థులను కోరింది. ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటివరకు ఎటువంటి నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ–మెయిన్ ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల్లో పలు తప్పులు దొర్లాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్న ఈ మేరకు ఎన్‌టీఏ స్పష్టతనిచ్చింది. ‘పరీక్షా విధానంలో ఎన్‌టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుంది.
ఇందులో భాగంగానే ప్రొవిజినల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీనిపై వచ్చిన అన్ని రకాల సందేహాలను పరిగణనలోకి తీసుకుంటుంది. విద్యార్థుల ఆందోళనలను, సందేహాలను నివృత్తి చేస్తుంది. అందరికీ న్యాయం దక్కేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. ఫైనల్ ఆన్సర్ కీని ఇంకా వెల్లడించలేదు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే స్కోర్ నిర్ణయమవుతుంది. ప్రొవిజినల్ కీ ఆధారంగా ఆన్సర్లపై ఎటువంటి నిర్ణయానికి రావద్దని ఎన్‌టీఏ సూచిస్తోంది. అనవసరమైన సందేహాలకు, ఆందోళనలకు కారణమయ్యే వార్తలను నమ్మవద్దని విద్యార్థులను కోరుతోంది’అని పేర్కొంది. కాగా, జేఈఈ–మెయిన్ రెండు దశల్లో జనవరి, ఏప్రిల్‌లలో ఎన్‌టీఏ నిర్వహించింది.