ముంబై: ముంబై ఉగ్రదాడులలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించాక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ అత్యంత సున్నితమైన విచారణను కొనసాగిస్తున్న బృందానికి ఇద్దరు సీనియర్ అధికారులు నాయకత్వం వహిస్తున్నారు వారే.. అశిష్ బాత్రా(ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్, జార్ఖండ్ మాజీ జాగ్వార్ ఫోర్స్ హెడ్) జయ రాయ్(ఎన్‌ఐఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్) వీరిద్దరూ రాణా ఎక్స్‌ట్రాడిషన్ (ఒక దేశం వేరొక దేశానికి ఒక వ్యక్తిని బదిలీ చేయమని అభ్యర్థించే చట్టపరమైన ప్రక్రియ)నడిపించారు. ఇప్పుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ సారధ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దాడులలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ పాత్ర, రాణాకు గల అంతర్జాతీయ నెట్‌వర్క్ మొదలైనవాటిని వెలికితీసే లక్ష్యంతో ఈ విచారణ కొనసాగుతోంది.
తహవ్వూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2009లో అమెరికాలో అరెస్టయిన రాణా 2013లో లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్‌ఈటీ)కి మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 2025, ఏప్రిల్ 10న అమెరికా నుంచి భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణా విచారణకు సారధ్యం వహిస్తున్న ఇద్దరు అధికారులో ఒకరైన అశిష్ బాత్రా 1997 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. జార్ఖండ్ క్యాడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఎన్‌ఐఏలో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన జార్ఖండ్ పోలీస్ విభాగానికి చెందిన ఎలైట్ యాంటీ-మావోయిస్ట్ యూనిట్ ‘జాగ్వార్ ఫోర్స్’కు మాజీ హెడ్. ఈ యూనిట్ మావోయిస్టుల తిరుగుబాటును అణచివేయడంలో కీలక పాత్ర పోషించింది.
రాణా విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న జయ రాయ్ 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జార్ఖండ్ క్యాడర్(Jharkhand Cadre)కు చెందినవారు. ప్రస్తుతం ఎన్‌ఐఏలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు. జయ రాయ్ జార్ఖండ్‌లోని జామ్‌తారాలో సైబర్‌క్రైమ్‌లను అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో ఎన్‌ఐఏలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా చేరిన రాయ్.. రాణా కేసులో ఛీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. రాణాకు సంబంధించి ఈ మెయిల్‌లు, ఆర్థిక లావాదేవీలు మొదలైనవాటిని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించారు. రాణాని విచారించి, ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ప్రమేయాన్ని వెలికితీసేందుకు ఎన్‌ఐఏ ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్‌ఐఏ ఆరా