
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ(Prime Minister Modi) కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మతవాదులను సంతృప్తి పరచిందనడానికి వక్ఫ్ చట్టమే రుజువు అని అన్నారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ లాభపడింది భూ మాఫియానే అని అన్నారు. ఈ దోపిడీ ఇకపై కొత్త చట్టంతో ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు(Waqf Board) ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి, అంబేదర్కర్ దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని పేర్కొన్నారు. వారు అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా అతనిని అవమానించారని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఇప్పుడు లౌకిక పౌర కోడ్ అమలులో ఉందని, కాంగ్రెస్ ఇప్పటికీ దానిని వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు.
ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలపై తమ పార్టీ ట్రాక్ రికార్డ్‌ను సమర్థించుకుంటూ, బీజేపీ చారిత్రక వంచనకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటివారు అప్పట్లో బాబా సాహెబ్‌కు శత్రువులని, నేటికీ అలాగే ఉన్నారన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన అంటరానివాడిగా మారారని వారు ఆరోపించారని ఖర్గే పేర్కొన్నారు. నాడు ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించిందని అన్నారు. మహిళా చట్టంలో రిజర్వేషన్ కల్పించి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఖర్గే గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు