
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఇటువంటి విషాద ఘటనలు దేశంలో గతంలోనూ చోటుచేసుకున్నాయి. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో చోటుచేసుకున్న 10 భారీ అగ్ని ప్రమాదాలివే..
1. దబ్వాలి, హర్యానా
1995, డిసెంబర్ 24న హర్యానాలోని దబ్వాలిలో డీఏవీ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెదురు బొంగుల వేదికపై అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 400 మంది మృతిచెందారు. 160 మంది గాయపడ్డారు.
2. బరిపద, ఒడిశా
1997, ఫిబ్రవరి 23న ఒడిశాలోని బరిపదలో ఒక మతపరమైన సమావేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 176 మంది మరణించారు. ఇది ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.
3. ఉపహార్, ఢిల్లీ
1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. 103 మంది గాయపడ్డారు. థియేటర్‌లో సరైన ఎగ్జిట్ ద్వారాలు లేకపోవడం, భద్రతా నిబంధనలను పాటించకపోవడం ప్రమాద తీవ్రతను మరింతగా పెంచాయి.
4. కుంభకోణం, తమిళనాడు
2004,జూలై 16న తమిళనాడులోని కుంభకోణంలో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల అగ్ని అంతటా వేగంగా వ్యాపించింది. ఈ ఘటనలో 94 మంది పాఠశాల విద్యార్థులు మృతిచెందారు.
5. శ్రీరంగం, తమిళనాడు
2004, జనవరి 23న తమిళనాడులోని శ్రీరంగంలో గల పద్మప్రియ మ్యారేజ్ హాల్‌లో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వీడియో కెమెరాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 57 మంది అతిథులతో పాటు వరుడు కూడా మృతి చెందాడు..
6. మీరట్, ఉత్తరప్రదేశ్
2006, ఏప్రిల్ 10న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన ‘బ్రాండ్ ఇండియా’ కన్స్యూమర్ గూడ్స్ ఫెయిర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 65 మంది మృతిచెందారు. 150 మందికి పైగా జనం గాయపడ్డారు.
7. జైపూర్, రాజస్థాన్
2009 అక్టోబర్ 29న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు ట్యాంకుల మధ్య ఇంధన బదిలీ సమయంలో సుమారు 1,000 టన్నుల పెట్రోల్ లీక్ అయి, ఆవిరి మేఘం ఏర్పడి పేలుడుకు దారితీసింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
8. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
2010, మార్చి 21న కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న చారిత్రాత్మక స్టీఫెన్ కోర్ట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందారు. భవనంలో అగ్ని రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది.
9. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
2011 డిసెంబర్ 9న కోల్‌కతాలోని ధాకూరియాలోని ఎఎంఆర్‌ఐ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బేస్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మండే పదార్థాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో ఊపిరాడక 105 మంది మృతిచెందారు.
10. పరవూర్ , కేరళ
2016, ఏప్రిల్ 10న కేరళలోని కొల్లం జిల్లాలోగల పరవూర్ పుట్టింగల్ దేవీ ఆలయంలో మీన-భరణి ఉత్సవం ముగింపు సందర్భంగా బాణసంచా పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 114 మంది మృతిచెందారు. దాదాపు 400 మంది గాయపడ్డారు. ఇది కేరళలో జరిగిన అత్యంత ఘోరమైన బాణసంచా పేలుడు ప్రమాదంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ‘నాడు 74.. నేడు 150’.. హిసార్- అయోధ్య విమాన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ