Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు | Celebration in Haryana After Rekha Gupta Became the CM of Delhi | Sakshi
Sakshi News home page

Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు

Published Thu, Feb 20 2025 6:59 AM | Last Updated on Thu, Feb 20 2025 11:59 AM

Celebration in Haryana After Rekha Gupta Became the CM of Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ టిక్కెట్‌పై పోటీచేసి, గెలుపొందిన రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమె పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ప్రకటించగానే హర్యానాలోని జింద్‌లో  ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జింద్‌లోని జులానా ప్రాంతంలోని నంద్‌గఢ్ రేఖా గుప్తా పూర్వీకుల గ్రామం. హర్యానాలోని ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్(All India Agarwal Samaj) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అగర్వాల్ సమాజానికి, జింద్‌కు గర్వకారణమని అ‍న్నారు. కృషి, దృఢ సంకల్పం, సామాజిక సేవా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రేఖ గుప్తా నిరూపించారని గోయల్  పేర్కొన్నారు.

రేఖా గుప్తా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఆమె ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్వీకుల గ్రామం కూడా హర్యానాలోనే ఉండటం, ఆయన కూడా అగర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన గతంలో ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు కుటుంబాన్ని  కూడా ఆయన ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో రేఖా గుప్తా పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బీని ఢిల్లీలోనే  పూర్తిచేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖాగుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వందన కుమారిని ఓడించారు.

ఇది కూడా చదవండి: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?.. భగవంత్‌ మాన్‌ క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement