కోల్‌కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.
లక్షయ్ దలాల్ (34), యశ్‌వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.
తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య
విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.
మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్‌ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్‌వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.
మెరిసిన మనన్, జైమీత్
బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్‌రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.
అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్‌తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment