మళ్లీ గోల్డెన్‌ డక్‌.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే? | Ranji Trophy 2024: Rahane Consecutive Golden Ducks Fans Reacts Finished | Sakshi
Sakshi News home page

#IndvsAus2021: మళ్లీ గోల్డెన్‌ డక్‌.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే?

Published Fri, Jan 19 2024 4:15 PM | Last Updated on Fri, Jan 19 2024 9:30 PM

Ranji Trophy 2024: Rahane Consecutive Golden Ducks Fans Reacts Finished - Sakshi

అజింక్య రహానే (PC: BCCI)

Ranji Trophy 2024- Ajinkya Rahane Golden Ducks: రంజీ ట్రోఫీ-2024లో టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌, ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే మరోసారి విఫలమయ్యాడు. గ్రూప్‌-బిలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో వరుసగా రెండోసారి ఇలా అవుటై విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

గతేడాది రంజీల్లో ముంబై సారథిగా అద్భుతంగా రాణించి రహానే.. ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కూడా సత్తా చాటాడు. సంప్రదాయ క్రికెట్‌లోనే కాదు.. పొట్టి ఫార్మాట్లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి
ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా.. అతడి స్థానంలో అనూహ్యంగా టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌ ఫైనల్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు రహానే. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గానూ సత్తా చాటాడు.

వైస్‌ కెప్టెన్‌గా
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో రహానే మళ్లీ పూర్వ వైభవం పొందుతాడని అభిమానులు ఆనందించగా.. తన వైఫల్యాలతో వారి సంతోషాన్ని ఆవిరి చేయడమే కాకుండా.. తన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు.

గతేడాది ముగిసిన ఈ పర్యటన తర్వాత రహానే మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కరేబియన్‌ గడ్డపై 2023, జూలైలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా ఆడనున్న టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు ఈ ముంబై కెప్టెన్‌.

వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌లు
కానీ.. ఫిట్‌నెస్‌లేని కారణంగా తొలి రంజీ మ్యాచ్‌కు దూరమైన అజింక్య రహానే.. రెండో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇక తాజాగా శుక్రవారం కేరళతో మొదలైన మ్యాచ్‌లో.. బాసిల్‌ థంపీ బౌలింగ్‌లో.. ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్‌ చేరాడు. దీంతో.. ఇక రహానే టీమిండియా రీఎంట్రీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాడు చారిత్రాత్మక ట్రోఫీ ఎత్తి.. ఇప్పుడిలా
ఇదిలా ఉంటే.. 2021లో ఇదే రోజున రహానే సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ ట్రోఫీని ముద్దాడటం విశేషం. బ్రిస్బేన్‌లోని గాబా వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌ కాగా.. శుబ్‌మన్‌ గిల్‌(91) , రిషభ్‌ పంత్‌(89- నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు.

ఈ నేపథ్యంలో గాబా మ్యాచ్‌ జ్ఞాప​కాలు గుర్తు చేసుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్‌.. ‘‘రహానే.. ఇదే రోజు ఆసీస్‌ గడ్డపై అలా.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఇలా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: #RoKo: కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement