
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఘనాపాఠి జట్టయిన ముంబైకి రెండో సెమీఫైనల్లో తొలిరోజే విదర్భ బ్యాటర్లు గట్టి సవాల్ విసిరారు. ముంబై బౌలర్లు సగం (5) వికెట్లు పడగొట్టినప్పటికీ ఒకే రోజు విదర్భ 300 పైచిలుకు స్కోరు చేసింది. టాపార్డర్‌లో ధ్రువ్ షోరే (109 బంతుల్లో 74; 9 ఫోర్లు), మిడిలార్డర్‌లో దానిశ్ మాలేవర్ (157 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు), యశ్ రాథోడ్ (86 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) సమష్టిగా కదంతొక్కారు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన విదర్భకు మంచి ఆరంభమైతే దక్కలేదు.
అథర్వ (4) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే (23; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వన్డేలాగే ఆడిన ధ్రువ్ 67 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వందకు సమీపించింది. ఈ దశలో 93 పరుగుల వద్ద పార్థ్‌ను శివమ్ దూబే అవుట్ చేశాడు. దానిష్ క్రీజులోకి రాగా... తొలి సెషన్‌లోనే జట్టుస్కోరు వంద దాటింది. ధ్రువ్, దానిశ్ విదర్భ ఇన్నింగ్స్‌లో మరో 50 పైచిలుకు భాగస్వామ్యాన్ని జోడించింది.
జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ధ్రువ్ షోరేను షమ్స్ ములానీ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చి కరుణ్ నాయర్, యశ్ రాథోడ్‌లు కూడా ముంబై బౌలర్లను చక్కగా ఎదుర్కోవడంతో భారీస్కోరుకు బాట పడింది. ఆట నిలిచే సమయానికి యశ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, షమ్స్ ములానీ చెరో 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్‌స్టన్ డయస్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రేఖడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 47; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 308. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261.
బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 14–0–57–0, మోహిత్ 14–2–61–0, రాయ్‌స్టన్ డయస్ 11–2–26–1, తనుశ్ కొటియాన్ 22–0–78–0, శివమ్ దూబే 9–1–35–2, షమ్స్ ములానీ 18–3–44–2.
Comments
Please login to add a commentAdd a comment