రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు.
119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్‌లోకి చేర్చారు. వీరు మూడో వికెట్‌కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు.
చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది.
అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ముంబై కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment