
శతకవీరుడు కరుణ్ నాయర్ (PC: BCCI Domestic X)
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్‌లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్‌కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.
23వ శతకం
ఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు.
నాగ్‌పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది 23వ శతకం.
సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్‌ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్‌లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు.
ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
💯 for Karun Nair 👏
A splendid knock on the big stage under pressure 💪
It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final
Scorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025
Comments
Please login to add a commentAdd a comment