
ఆకాశ్ ఆనంద్ (PC: BCCI)
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్‌పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు.
ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్‌గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 383
ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్‌స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4.
విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4
వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్‌స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.
ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత
ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా రాణించిన మిలింద్ కెరీర్‌లో 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు.
ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment