
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) చివరి అంకానికి చేరింది. ఈ సీజన్‌లో తొలి ఫైనల్ బెర్త్ అధికారికంగా ఖరారైంది. రెండో సెమీఫైనల్లో ముంబైని (Mumbai) ఓడించి విదర్భ (Vidarbha) వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ఈ సీజన్ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది.
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్లో ముంబైపై విదర్భ 80 పరుగుల తేడాతో గెలుపొందింది. విదర్భ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 325 పరుగులకు ఆలౌటైంది. హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్, పార్థ్ రేఖడే తలో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ భారీ స్కోర్లు చేయలేదు.
ముంబై ఓటమి ఖరారైన తర్వాత శార్దూల్ ఠాకూర్ (66) అర్ద సెంచరీ సాధించాడు. షమ్స్ ములానీ (46) సాయంతో శార్దూల్ ముంబైని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. స్టార్ బ్యాటర్లు అజింక్య రహానే (12), శివమ్ దూబే (12), సూర్యకుమార్ యాదవ్ (23) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ 39 పరుగులకు ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే (18), సిద్దేశ్ లాడ్ (2) నిరాశపరిచారు. ఆఖర్లో తనుశ్ కోటియన్ (26), మోహిత్ అవస్తి (26), రాయ్‌స్టన్ డయాస్ (23) కంటితడుపు చర్చగా బ్యాట్‌ను ఝులిపించారు.
ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్‌స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు.
113 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. 292 పరుగులకు ఆలౌటై ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.
గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ డ్రా దిశగా సాగుతున్నప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ (2 పరుగులు) ఆధారంగా కేరళ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. రంజీల్లో కేరళ ఫైనల్‌కు చేరనుండటం ఇదే మొదటిసారి. ఈ సీజన్ ఫైనల్లో విదర్భ, కేరళ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment