గిల్‌ సెంచరీ కోసం​ హాఫ్‌ సెంచరీని త్యాగం చేసిన రాహుల్‌.. అదే హార్దిక్‌ అయ్యుంటే..! | Champions Trophy: KL Rahul Sacrificed His Fifty For Shubman Gill Century Vs Bangladesh | Sakshi
Sakshi News home page

గిల్‌ సెంచరీ కోసం​ హాఫ్‌ సెంచరీని త్యాగం చేసిన రాహుల్‌.. అదే హార్దిక్‌ అయ్యుంటే..!

Published Fri, Feb 21 2025 1:55 PM | Last Updated on Fri, Feb 21 2025 2:57 PM

Champions Trophy: KL Rahul Sacrificed His Fifty For Shubman Gill Century Vs Bangladesh

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. తౌహిద్‌ హృదయ్‌ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్‌ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.

అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్‌ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్‌ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్‌ రాహుల్‌ (41 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్‌ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ టాపిక్‌ హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గిల్‌ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్‌ రాహుల్‌ తన హాఫ్‌ సెంచరీని త్యాగం చేశాడు. గిల్‌ సెంచరీ కోసం రాహుల్‌ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్‌ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్‌ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్‌ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్‌ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్‌ పాండ్యాను విమర్శిస్తున్నారు. 

రాహుల్‌ స్థానంలో హార్దిక్‌ ఉంటే గిల్‌ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్‌ చాలా సెల్ఫిష్‌ ఆటగాడని.. మ్యాచ్‌ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్‌ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌లో తిలక్‌ వర్మ (49) హాఫ్‌ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్‌ సిక్సర్స్‌తో మ్యాచ్‌ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్‌ సెంచరీకి ముందు రాహుల్‌ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్‌ ఎ‍క్కడ క్రీజ్‌లో వస్తాడో అని అని టెన్షన్‌ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్‌ అభిమానులు హార్దిక్‌ను ఏకి పారేసి, రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్‌ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్‌ చాలా కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌.. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్‌.. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, అక్షర్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్‌ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. 

ఇలాంటి తరుణంలో రాహుల్‌ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్‌ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్‌ సహకారంతో గిల్‌ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. 

బంగ్లాదేశ్‌ బౌలర్లు పిచ్‌ స్వభావానికి తగట్టుగా బౌలింగ్‌ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్‌, రాహుల్‌ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది. అంతకుముందు రాహుల్‌ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు.  మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement