ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు.
ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment