టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మాన్ గిల్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీనీ నమోదు చేశాడు. ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 152 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్ రాహుల్ ఓపెనింగ్ స్థానానికి ఎసరు పెట్టవచ్చు అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బంగ్లాతో తొలి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 45 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "రెండు ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకోవడం వల్ల బౌల్డయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బౌన్సర్ ట్రాప్‌కి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. రాహుల్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడంతో రాహుల్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ ఇప్పుడు తిరిగి జట్టులో చేరితే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గిల్ తొలి ఇన్నింగ్‌లో వేగంగా ఔటైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అతడు తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. టెస్టుల్లో అతడి ఆటతీరు వైట్ బాల్ క్రికెట్‌తో సమానంగా ఉంటుంది. అదే విధంగా గిల్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. అటువంటి ఆటగాడిని ఎలా పక్కన పెడతారు? రోహిత్ జట్టులోకి వచ్చినా గిల్ మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలవెన్‌లో ఉండాలి" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Shubman Gill: డెబ్యూ సెంచరీతోనే అరుదైన రికార్డు కొట్టిన గిల్
Comments
Please login to add a commentAdd a comment