India vs Bangladesh Test Series 2022- KL Rahul: గత కొన్నాళ్లుగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుతున్న ఈ కర్ణాటక బ్యాటర్.. గత 8 టెస్టు ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులు 137 మాత్రమే! ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ నాయకుడిగా విజయవంతమయ్యాడు.
కానీ బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. బంగ్లాతో రెండు టెస్టుల్లో కలిపి రాహుల్ చేసిన పరుగులు 57! ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్ కాకపోయి ఉంటే రెండో టెస్టులోనే రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించేవారంటూ ఘాటు వ్యాఖ్యలు వినిపించాయి.
మరోవైపు.. యువ ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బంగ్లాతో తొలి టెస్టులో సెంచరీ చేశాడు గిల్. 152 బంతుల్లో 11 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పోటీనిస్తున్న గిల్
రెండో టెస్టులో విఫలమైనా(27 పరుగులు).. ఈ సిరీస్‌లో మొత్తంగా రాహుల్ కంటే గిల్ వంద పరుగులు ఎక్కువే(157) సాధించాడు. దీంతో ఈ యువ రైట్‌హ్యాండ్ బ్యాటర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుడిచేతి వాటం గల వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు జోడీగా గిల్ సరిగ్గా సరిపోతాడననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో గనుక రాహుల్ వరుస సెంచరీలు సాధిస్తేనే ఇక ముందు తుది జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. లేదంటే గిల్ అతడి స్థానాన్ని ఆక్రమించడం ఖాయమని పేర్కొన్నాడు.
వరుస సెంచరీలు చేయాలి! అప్పుడే
ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో కామెంటేటర్ డీకే మాట్లాడుతూ.. ‘‘నేనైతే కేఎల్‌కు మరో రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇస్తాను. అయితే తనను తాను నిరూపించుకుంటునే అతడికి భవిష్యత్తు ఉంటుంది.
నిజానికి 40కి టెస్టులాడిన ఓ ఓపెనింగ్ బ్యాటర్ సగటు మరీ 30లకే పరిమితం కావడం ఆమోదయోగ్యం కాదు. 35కు పైగా టెస్టులాడిన బ్యాటర్ల అతి తక్కువ సగటు ఇదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రాహుల్ కచ్చితంగా లోపాలు సరి చేసుకోవాలి. టెస్టు జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే ఆస్ట్రేలియాతో టెస్టులో కనీసం రెండు సెంచరీ సాధించాలి. లేదంటే రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా నాటుకుపోవడం ఖాయం’’ అని టీమిండియా టెస్టు ఓపెనింగ్ స్థానం గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అయితే, డీకే వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అంతబానే ఉంది.. కానీ
‘‘అంతా బాగానే ఉంది కానీ.. ఆసీస్‌తో సిరీస్‌కు కూడా రాహుల్‌కు ఛాన్స్ ఇవ్వాలంటున్నావా కార్తిక్? ఇదేమైనా బాగుందా? గాయం నుంచి కోలుకుని రోహిత్ తిరిగి వస్తే.. రాహుల్‌ను కొనసాగిస్తే గిల్‌కు అన్యాయం చేసినట్లే అవుతుంది కదా! నీలాగే రాహుల్‌కు కూడా అవకాశాలు ఇస్తూ పోవాలా?’’ అంటూ విమర్శిస్తున్నారు.
కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ఇప్పటికే గాయంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో సిరీస్‌తో అందుబాటులోకి వచ్చే అంశంపైనే రాహుల్ తలరాత ఆధారపడి ఉంది.
చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
Marco Jansen: 69 పరుగులకే 5 వికెట్లు! పట్టుదలగా నిలబడ్డ జాన్సెన్, వెయిర్నే.. కెరీర్‌లో తొలిసారి..
Comments
Please login to add a commentAdd a comment