ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.
నెట్స్‌లోనూ
అనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.
ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.
శుబ్‌మన్ గిల్‌కు గాయం
ఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.
పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే.
అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
టాపార్డర్ బలహీనం!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.
లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.
మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
Comments
Please login to add a commentAdd a comment