
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.
నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.
ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు.
సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం.
Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗
Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯
WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024
Comments
Please login to add a commentAdd a comment