భారత్ మరెన్నో విజయాలు సాధిస్తుంది
సామ్సన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్‌ను అందించాలని అనుకున్నా.
నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్‌లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్‌లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు.


