Harbhajan's blunt reaction to KL Rahul's removal from India Test vice-captaincy - Sakshi
Sakshi News home page

KL Rahul: వైస్‌ కెప్టెన్‌ హోదా తొలగింపు.. అతడి​కి లైన్‌ క్లియర్‌.. ఇక దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే..

Published Mon, Feb 20 2023 11:07 AM | Last Updated on Mon, Feb 20 2023 11:53 AM

BGT 2023: Harbhajan Blunt Reaction To KL Rahul Vice Captaincy Removal - Sakshi

India vs Australia Test Series- KL Rahul: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన మొత్తం పరుగులు 38. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను కాదని అనుభవానికే పెద్ద పీట వేసింది మేనేజ్‌మెంట్‌.

రాహుల్‌ను తప్పించాల్సిందే!
సీనియర్‌ అయిన రాహుల్‌ వైపే మొగ్గు చూపింది. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఈ కర్ణాటక బ్యాటర్‌ తన వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

వైస్‌ కెప్టెన్‌ ట్యాగ్‌ తీసేసి ఇకనైనా రాహుల్‌ను పక్కనపెట్టి.. గిల్‌కు అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ పట్ల ఉన్న ప్రేమ(ఫేవరెటిజం) కారణంగానే ప్రతిభ ఉన్న ఆటగాళ్లను తొక్కేస్తుందంటూ బీసీసీఐని విమర్శించారు.

వైస్‌ కెప్టెన్‌ హోదా లేదిక!
ఈ నేపథ్యంలో ఢిల్లీ టెస్టు తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత జట్టు ఇదేనంటూ బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. జయదేవ్‌ ఉనాద్కట్‌ చేరిక మినహా తొలి రెండు టెస్టులకు ఉన్న జట్టునే యథాతథంగా కొనసాగించిన బోర్డు.. కేఎల్‌ రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌  హోదాను మాత్రం తొలగించడం గమనార్హం.

అందుకే ఇలా చేశారన్న భజ్జీ
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా తొలగించడం.. శుబ్‌మన్‌ గిల్‌కు తుదిజట్టులో చోటిస్తున్నామని చెప్పడానికి సూచిక అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడిన భజ్జీ.. ‘‘ఇప్పటిదాకా అతడు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

అయితే, బోర్డు తాజాగా ప్రకటించిన జట్టులో ఆ ట్యాగ్‌ తొలగించారు. తదుపరి టెస్టుల్లో రాహుల్‌కు బదులు శుబ్‌మన్‌ గిల్‌ను ఆడిస్తామని చెప్పేందుకే ఇలా చేయడానికి కారణం అని నేను భావిస్తున్నా. వన్డే, టీ20లలో గిల్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సూపర్‌హీరోగా ఎదిగాడు. కాబట్టి తనకు తప్పక అవకాశం ఇస్తారనుకుంటున్నా.

దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే
ఇక రాహుల్‌ విషయానికొస్తే.. అతడు అవుటైన తీరు గమనిస్తే బ్యాటింగ్‌లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను కీలక ఆటగాడు. కాబట్టి కచ్చితంగా స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా ప్రతిసారి విఫలమైతే కష్టం. తను వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్‌ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. కొన్నాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడితే పూర్వవైభవం పొందే అవకాశం ఉంది’’ అని హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుబ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మమ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌.

చదవండి: Jadeja-Lyon: 'నీడలా వెంటాడుతున్నావా?'.. ఆసీస్‌ స్పిన్నర్‌ను 24 గంటలు ఫాలో అయిన జడేజా
Ind Vs Aus: ఆసీస్‌ను చిత్తు చేసి.. ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన టీమిండియా.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement