ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో చిత్తైన రోహిత్ సేన.. బ్రిస్బేన్ టెస్టులో వర్షం వల్ల ఓటమి నుంచి తప్పించుకుందనే విమర్శలు మూటగట్టుకుంది.
ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, తొలి రోజు ఆటలో మాత్రం టీమిండియాకు కలిసిరాలేదు. టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.
ఆఖరి సెషన్లో భారత బౌలర్లు ప్రభావం చూపినా.. అప్పటికే కంగారూలు పైచేయి సాధించారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. గురువారం నాటి మొదటిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో.. మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా తమ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
అందుకే గిల్‌పై వేటు..
ఇప్పటికే శుబ్‌మన్ గిల్(Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. రెగ్యులర్ ఓపెనింగ్ జోడీతోనే బరిలోకి దిగనుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే శుబ్‌మన్ గిల్‌ను తప్పించి.. వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నాం.
ఓపెనర్‌గా మళ్లీ అతడే
వాషీ కోసం గిల్ త్యాగం చేయాల్సి వచ్చింది. జట్టు ప్రయోజనాల కోసం మేము తీసుకున్న నిర్ణయాన్ని అతడు గౌరవించాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పు ఉంటుంది. అతడు భారత్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిషేక్ నాయర్ మీడియాతో పేర్కొన్నాడు.
కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తొలి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా సారథ్యంలో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. అయితే, రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా అదే జోడీని కొనసాగించగా.. రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు.
వ్యూహం మార్చిన టీమిండియా
కానీ రెండు టెస్టుల్లోనూ రోహిత్(3, 6, 10) విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మెల్‌బోర్న్‌లో తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. గిల్ ఆడే మూడో స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం.. ఆతిథ్య జట్టుతో కలిసి 1-1తో సమంగా ఉంది.
చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment