ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొలిరోజు అద్భుత ఆట తీరు కనబరిచిన ఆతిథ్య ఆసీస్ పైచేయి సాధించింది. ఆది నుంచి భారత జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది.
భారత బౌలర్ల సహనానికి పరీక్ష
ముఖ్యంగా అరంగేట్ర ఓపెనర్, 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కొరకరాని కొయ్యగా మారి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అనుభవజ్ఞుడిలా దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఎట్టకేలకు రవీంద్ర జడేజా కొన్‌స్టాస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా అర్ధ శతకాలతో రాణించగా.. ట్రవిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(31) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ సైతం బ్యాట్ ఝులిపించాడు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి స్మిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు.
సహనం కోల్పోయిన రోహిత్
ఈ నేపథ్యంలో చిరాకెత్తిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోనే చాలాసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యంగా కనిపించిన యశస్వి జైస్వాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డూ బౌలింగ్‌లో స్మిత్ డిఫెన్సివ్ షాట్ ఆడగా.. సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్(Yashasvi Jaiswal) బంతిని ఆపాల్సింది పోయి.. జంప్ చేశాడు.
ఏయ్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?
అంతేకాదు.. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఇక జడ్డూ అప్పటికే బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ ఘటన నేపథ్యంలో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. ‘‘ఏయ్ జైసూ.. ఇక్కడ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?
బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్‌లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేగానీ.. నిలబడేందుకు ప్రయత్నించకు’’ అంటూ చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
తొలిరోజు కంగారూలదే
కాగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటిరోజే మెరుగైన స్కోరు సాధించింది. బాక్సింగ్ డే(క్రిస్‌మస్ తెల్లవారి) మ్యాచ్‌లో టాపార్డర్ దంచికొట్టడంతో మూడు వందల పైచిలుకు స్కోరు సాధించింది. 86 ఓవర్ల ఆటలో ఆరు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది.
ఇక స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: IND vs AUS: బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియో
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂
The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a— Star Sports (@StarSportsIndia) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment