మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్‌-రాహుల్‌పై జడ్డూ అసహనం! | Aap Dono Baatein Karo: Jadeja Mocks Rohit Sharma, KL Rahul For This Reason | Sakshi
Sakshi News home page

మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం

Published Thu, Mar 6 2025 12:17 PM | Last Updated on Thu, Mar 6 2025 1:31 PM

Aap Dono Baatein Karo: Jadeja Mocks Rohit Sharma, KL Rahul For This Reason

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్‌ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలిచిన రోహిత్‌ సేన సెమీస్‌లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లలో గత కొంతకాలంగా భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.

కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్‌ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

264 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌
కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో భాగంగా భారత్‌ మంగళవారం ఆసీస్‌ జట్టును ఢీకొట్టింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

ఈ క్రమంలో ఓపెనర్‌ కూపర్‌ కన్నోలి(0)ని డకౌట్‌ చేసి మహ్మద్‌ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌(39)ను వరుణ్‌ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్‌ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్‌ 49.3 ఓవర్లలోనే ఆలౌట్‌ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.

టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి రెండు, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్‌ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.

జడేజా అసహనం
అయితే, కెప్టెన్‌ రోహిత్‌ , వికెట్‌ కీపర్‌ రాహుల్‌ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్‌ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్‌ అవటం లేదు’’ అనగా.. రోహిత్‌ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్‌ వేయాల్సి ఉంది కదా. స్లిప్‌ తీసుకో. బంతి స్పిన్‌ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.

మీరు చర్చలు జరుపుతూనే ఉండండి
ఇంతలో కేఎల్‌ రాహుల్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్‌ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్‌ వేశాడు.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్‌ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్‌ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్‌ అయ్యర్‌(45), కేఎల్‌ రాహుల్‌(42 నాటౌట్‌) రాణించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరులో తలపడుతుంది.

చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement